| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అంత నంశుమంతుండు శాంతుం డగుచు వచ్చె ; నట్టియెడం గదిసి కవ్వడి గాంగేయుపైఁ గ్రూరనారాచనికరంబు నిగిడించి పడం ద్రోచిన. | 413 |
| క. |
తూర్పు తలఁ గాఁగ నీ సుతు | లేర్పడఁ గనుఁగొనుచునుండ నిల గంపింపన్ దర్పోజ్జ్వలుఁ డా భీష్ముఁ డహర్పతి | యస్తాద్రి సేరునట్లుగఁ బడియెన్. |
414 |
| తే. |
తనువు ధరఁ బొందకుండఁగఁ దల్పభంగి | శరము లూఁత యై పొలుపారె నరవరేణ్య! యట్లు శరతల్పగతుఁ డగు నమ్మహాను | భావు దేవవ్రతుని దేవభావ మొందె. |
415 |
| చ. |
అనిమిషు లప్డు సూచి ‘మృతుఁ డయ్యెడు నక్కట! దక్షిణాయనం బునఁ గృతపుణ్యుఁ డంచు వగఁ బొందిన భీష్ముఁ డెఱింగి వారి కి ట్లను ‘సురలార! కాలగతి నాత్మఁ దలంచియ కాదె? మేనిలో నునిచినవాఁడఁ బ్రాణముల నుమ్మలికింపకుఁ డించుకేనియున్. |
416 |
| వ. | సత్యవతీవివాహం బొనర్చుటకు మాతండ్రి మెచ్చి నా కవధ్యత్వంబును స్వచ్ఛందమరణంబును నిచ్చినవాఁడు గావునఁ దద్వరప్రభావంబున నావధంబున కే నొడంబడక కానేరదయ్యెఁబ్రాణంబులు నా వశంబ’ యనిన విని వారలు సంతోషించి రాసమయంబున భాగీరథి పనుపునం గొందఱు మునివరులు హంసరూపంబుల నమ్మహాత్మునకు దక్షిణాయనం బెఱింగింపం జనుదెంచి యతండు దెలిసియునికి నతనిచేత నెఱింగి ప్రియం బంది యేఁగి రట్టియెడ దుర్యోధనుండు వుచ్చిన దుశ్శాసనుండు గుంభసంభవుపాలికింబోయి భీష్ముపాటు సెప్పిన నతండు మూర్ఛిల్లి యొక్కింత దేఱి దీనాననుం డగుచు నమ్మహీనాథుకడకుం జనియె నయ్యవసరంబున. | 417 |
| సీ. |
పాండవేయులు మాత్స్య పాంచాలయాదవ | సహితంబుగా సంతసమునఁ బొదలి; రాదెస బొబ్బలు నార్పులు బహుతూర్య | కోటియుఁ జెలఁగె; నీకొడుకుగమియు నీదిక్కుదొరలును నెలుఁగెత్తి యేడ్వంగ | నంబరచరుల హాహారవంబు లులియంగ రోదసి గలయంతవట్టును | ఘనశబ్దమయమయ్యె మనుజనాథ! |
|
| తే. |
కాలుసేయార్చుటలు లేక కన్నుఁగవల | నశ్రు లొలుకంగఁ జిత్తంబు లడలఁ బాండు సూనుతతిఁ జూచుచుండిరి గాని యించు | కయును గడఁగరు మనవారు గయ్యమునకు. |
418 |
| వ. | తదవసరంబున నంబరమణి యపరరత్నాకరంబు సొచ్చె ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. | 419 |
| క. |
‘నాయుల్ల మరయ నినుమో? | ఱాయో? కా కిట్లు రూపఱక విన నోర్చెన్ సాయకసముదయఖరభవ | దీయవచనచయము గవియుదేరం దిర మై. |
420 |
| వ. | ఇంక నేనేమియుం జెప్పఁ గొఱంత గలదే’ యనుటయు నాసూతనందనుం డి ట్లనునప్పుడు కౌరవులుం దారును దమవారును మైమఱువులూడ్చి యాయుధంబులు వెట్టి గాంగేయుకడకుం బోయిరి. కౌంతేయులు నట్ల బంధుమిత్త్రసహితు లయి యచటికిం జనిరి. ధనంజయుం డొక్కరుండును ధనుష్పాణి యై యరిగె ని ట్లయ్యిరుదెఱంగులవారలుం దత్కాలప్రశాంతస్వాంతులై యన్యోన్య విషయరోషంబులు దక్కి తన్నుం బరివేష్టించినం గులగురుం డగు నమ్మందాకినీనందనుండు వారి నభినందించి కొలిపించికొని యుండె. | 421 |
| తే. |
తనకుఁ గ్రీఁదల యని భవత్తనయులకు నె | ఱుంగఁ జెప్పిన వారు గడంగి మెత్తఁ దనముగల తలగడలు దేఁబనుచుటయును | జూచి చిఱునవ్వుతో సవ్యసాచిఁ బిలిచె.’ |
422 |
| క. |
పిలుచుటయు నతఁడు బాష్పము | లొలుకఁగ గాండివము వెట్టి యొయ్యన చనినం ‘దలగడతూపులు సెజ్జకు | నలవడఁ బెట్టు’ మని భీష్ముఁ డాతనిఁ బనిచెన్. |
423 |
| వ. | ఇట్లు పనిచినం బార్థుం డట్ల చేయుదు నని గాండివంబు పుచ్చికొని మఱియు ననుజ్ఞ గొని మూఁడు వాలమ్ము లభిమంత్రించి పెడతలఁ దాకి యెత్తి పట్టుకొని పుంఖంబులు భూమి మోచి నిలుచునట్లుగా నేసినం దాత ప్రీతుం డై తల్పంబునకుందగిన యుపధానంబు వెట్టి తని యతనింగొనియాడి సకలపౌత్రులను ధాత్రీపతులను నవలోకించి. | 424 |
| క. |
‘రవిఁ గొల్చి యుత్తరాయణ | మవునంతకు నంపపాన్పునం దిట్లు మహో త్సవలీల నిలుతు నా కీ | దివసంబులఁ జేయవలయుఁ దృఢతరరక్షన్. |
425 |
| క. |
అలయ కరయ నోపినవా | రలు గ్రక్కునఁ బరిఖతోడి ప్రాకారం బి ట్టలముగఁ గావింపుఁ’ డనుడుఁ | దలకొని నీసుతులుఁ బాండు తనయులు భక్తిన్. |
426 |
| వ. | అత్తెఱం గాచరింపనుం దాత్పర్యంబున రక్షింపనుం దమతమయందుఁ దగినవారల నియోగించి రంతఁ జికిత్సకులు వచ్చి శల్యచికిత్స సేసెద మని తొడంగిన గాంగేయుండు వారించి వారి కభిమతార్థంబు లొసంగి వీడుకొల్పె గీతవాద్యనృత్తప్రవీణంబు లగు పాత్రంబు లమ్మహాత్మునకు వినోదంబు సలుపుచుండె నట్టియెడ నాదేవవ్రతుండు నీళ్ళు ద్రావ నడిగినం దనుపారు నీ రనేకులు గొనివచ్చిన నతండు. | 427 |
| తే. |
‘వినుఁడు శరతల్పగతుఁడ నై యునికిఁజేసి | యన్యసలిలంబు సేవించు టనుచితంబు నాకుఁదేజోమయాస్త్రవిన్యాసవిధి స | ముత్థితం బైన భూజల మొకఁడు దక్క’. |
428 |
| వ. | అనుటయుఁ గౌరవులును దక్కటి రాజులును వెఱఁగుపడియున్నం గవ్వడిం గనుంగొని గాంగేయుండు. | 429 |
| క. |
‘శరవేదన సర్వాంగము | లెరియఁగ నా కిపుడు పెదవు లెండెడుఁ దృష్ణా భర ముడుపఁదగిన నీళులు | వెరవునఁ దే నేర్తు వీవ వే తె మ్మనఘా!’ |
430 |
| వ. | అనిన నట్లకాక యని యతం డతనికిం బ్రదక్షిణంబు సేసి తేజోమయంబయిన మార్గణంబు పర్జన్యమంత్రాభిమంత్రితంబు గావించి మహీతలంబు గాఁడనేసిన భాసురచ్ఛాయం బగుతోయంబు ధారా రూపంబున దివ్యగంధరసోపేతం బయి యెగసిన. | 431 |
| ఆ. |
కౌరవులు ప్రకంపగాఢ విస్మయు లైరి | పాండుసుతులు వారిబలము నుబ్బి యార్చి సంకు లొత్తి రా జలంబుల నమ్మ | హాత్ముఁ దృప్తుఁ జేసె నర్జునుండు. |
432 |
| వ. | ఇట్లు తృప్తిఁ బొంది మందాకినీనందనుండు పురందరనందనున కి ట్లనియె. | 433 |
| ఉ. |
‘నారదుచేత నిన్ను మునినాథునిఁ గాఁగ నెఱింగి యుండుదున్ శౌరియు నీవుఁ గూడిన నసాధ్యము లెవ్వియు లేవు దర్పదు ర్వారుఁడ వైన నీవలనివైరము గీ డని చెప్పఁ జెప్ప నీ కౌరవరాజు మానఁడు దెగం జెడుఁ గా కిటమీఁద భీముచేన్.’ |
434 |
| వ. | అని పలికి దీనమానసుం డగుచున్న భవత్సూనుతో ని ట్లనియె. | 435 |
| మ. |
‘నరుఁ డత్యద్భుతవిక్రముం డతని కానారాయణుం డాప్తుఁ డె వ్వరికిన్ వీరి జయింపరాదు సమరావష్టంభముం దక్కి ధ ర్మరతుం డైనయజాతశత్రునకు నింద్రప్రస్థ మి మ్మర్ధరా జ్యరమం బొందుము మీరు గొందఱయినం జాకున్న నీ కొప్పదే?’ |
436 |
| వ. | అని పలికి యూరకుండెం; గౌరవ పాండవులును మాఱు పలుకక యతనికి నమస్కరించి నిజనివాసంబులకుం జని; రట్లు సనునెడ గోవిందుండు కౌంతేయాగ్రజుం గనుంగొని. | 437 |
| క. |
‘సురలకు నజయ్యుఁ డగు నీ | సురసరిదాత్మజుని గెలువఁ జొప్పడునే? యె వ్వరికైన నద్భుతావహ | పరికరులగు మీకుఁ దక్కఁ బౌరవముఖ్యా!’ |
438 |
| క. |
అనుటయు నతఁడిట్లను ‘నే | మనఁగా నొక మానిసులమె? యప్రతిహతవీ రుని నిన్నుఁ బడసి యింతటి | పనులకుఁ జాలితిమి గాక భక్తాధీనా! |
439 |