పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
ద్రోణాచార్యునిచేత సత్యజిత్తు సచ్చుట (సం. 7-20-1)
చ. కని ద్రుపదాన్వయోత్తముఁ డకంపిత శౌర్యుఁడు సత్యవిక్రముం
డనుపమ ధైర్యధుర్యుఁడు మహాబల దీప్తుఁడు సత్యజిత్తు ద్రో
ణుని వెసఁ దాఁకి తత్తనువు నొవ్వ దశోగ్ర శరంబు లేసి సూ
తుని మెయిఁ గ్రుచ్చెఁ చేర్చి పది తూపులు ధర్మజుఁ డుల్లసిల్లఁగన్‌.
283
ఆ. గురుఁడు సత్యజిత్తు కోదండ దండంబు | దునుముటయును వేఱుధనువు వుచ్చి
కొని యుదాత్తరేఖఁ గ్రూరభల్లంబులు | ముప్పదింట నతనిఁ గప్పె నతఁడు.
284
వ. తదవసరంబున సత్యజిత్తుం గూడికొని. 285
క. వృకుఁడను పాంచాలకుమా | రకుఁ డఱువది తూపులం గరం బరుదుగ న
స్త్ర కళాచార్యుం బొదివిన | వికాసముం బొందెఁ బాండవేయ బలంబుల్‌.
286
చ. ఘనతర కోపవేగమునఁ గన్నుల నిప్పులు రాల సత్యజి
త్తనువు వృకాంగమున్‌ విశిఖ ధారల ముంచె గురుండు, వార లా
తని వడి కోర్చి మై గలయఁ దాఁకఁగ సారథి యు బ్బడంగ వా
హనములు బీఱువోవ సిడ మల్లల నాడఁగ సేసి రుద్ధతిన్‌.
287
ఆ. సత్యజిత్తు మేన సాయక దశకంబు | నాటి కుంభజుండు నగుచు విల్లు
దునుమ, నొండు వింట ద్రోణుని నొప్పించె | నతఁడు; వృకుఁడుఁ బెలుచ నడరి యేసె.
288
క. కినిసి వెసన్‌ సత్యజితుని | ధనువు నఱికి గురుఁడు వృకునితల దునియఁగ నా
తని హయములు సారథియును | మును డొల్లఁగ నాఱు బాణముల్‌ బిట్టేసెన్‌.
289
ఆ. అన్యచాప హస్తుఁడై సత్యజిత్తు సం | రంభజృంభణమునఁ గుంభజన్ముఁ
దరల నేయుటయు నతండు గెంపారెడు | నాననంబు తోడ నవుడు గఱచి.
290
ఉ. ఖండములై పడం ధనువు గ్రక్కున నేయుడు సత్యజిత్తు వి
ల్లొండు గొనం గొనం దునియ నుద్ధతి నేయుచుఁ బెక్కు విండు లు
ద్దండత నుగ్గు సేసి భుజదర్పధురంధరుఁ డీతఁ డింత ద
క్కం డని యర్ధచంద్ర విశిఖ ప్రహతిం దల డొల్ల నేసినన్‌.
291
క. సాహంకారుం డగు గురు | బాహు బలంబునకు నులికి పాఱఁ దొలంగెన్‌
వాహములఁ దోలుకొని యు | త్సాహంబుఁ జలంబు నెడల ధర్మజుఁ డధిపా!
292
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )