పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
భగదత్తుండు సుప్రతీకంబుతోడ నర్జునుచేఁ జచ్చుట (సం. 7-28-40)
ఉ. వాలిక దొడ్డనారసము వజ్రము శైలము దాఁకునాకృతిన్‌
ఫాలము మీదఁ దాఁకిన నిభంబు వెసం బడి కొమ్ము లూఁతగా
వ్రాలుడు నర్ధచంద్రరుచిర ప్రదరంబునఁ ద్రుంచె బాణ వి
ద్యాలసితుండు గ్రీడి భగదత్తుని కంఠ మకుంఠితోద్ధతిన్‌.
358
వ. ఇట్లు దంతిని భగదత్తునిం బరిమార్చి మాఱులేక మలయు మధ్యమ పాండవునిం గనుంగొని శకుని తమ్ములు వృషకుండును, నచలుండును దాఁకిన నతండు వృషకుని రథరథ్య సూత ధ్వజచ్ఛత్రచామరంబులు రూపఱ నఱకుటయు, నాతండు సోదరుని రథంబెక్కె నప్పుడు వారి కడ్డపడిన గాంధార వీరరథిక పంచశతంబుఁ బంచత్వంబు నొందించిన సంక్రందననందను నురవడికిం దెరలక యేకరథస్థులగు నయ్యిరువురుం బరాక్రమించిన. 359
తే. చేరియుండుట ననువైన వారి నొక్క | నారసంబునఁ బడనేసె నరుఁడు; దానిఁ
జూచి కన్నీరు నించి నీ సుతులు సాలఁ | గుంది రర్జును నపుడు మార్కొనియె శకుని.
360
వ. అతండు మాయావి యగుట ననేక మాయలు గల్పించిన మొగిళ్ళు వరపి పాషాణ వృక్ష వివిధాయుధంబులు వివ్వచ్చు పైఁ గురిసెం బదంపడి తమం బడరెఁ బిదప నీళ్ళు వెల్లిగొనియె; మఱియు మహోరగ శార్దూలాది క్రూరసత్త్వంబులు గవిసె; వారి నెల్లను దోడ్తోన దివ్యాస్త్రవేదియగు నా సవ్యసాచి యడంగించి యల్లనినగవుతో నిట్లనియె. 361
క. ‘మాయలు జూదము తోడన | పోయెంగా, కింక నిచటఁ బొసఁగునె యవి? మ
త్సాయకము లడ్డసాళ్ళే? | నీయాచవి లేదు పొమ్ము నిలువక మామా!’
362
క. అని పలికి వాలుటమ్ములు | తనువున నినుచుటయుఁ గలఁగి ధైర్యము మానం
బును వీటిఁబోవఁ బాఱెను | జననాయక! నీ మఱంది సరివారు నగన్‌.
363
ఉ. ఆతఁడు వాఱినం దెరలు నచ్చటి సేనలఁ గాల్కొనంగ నీ
కాతత బాహువీర్యులు బకారియు సాత్యకియుం గడంగి తో
డై తన పార్శ్వ భాగముల నార్చుచుఁ దోలఁగఁ దోలె ఖేచర
వ్రాతము మెచ్చఁ గ్రీడి కురురాజును ద్రోణుఁడు నున్న నేలకున్‌.
364
ఆ. బలము విఱిగి రెండు పాయలై యిట్టు ల | మ్మనుజవిభుని గురుని మఱువు సొచ్చె;
ద్రోణుఁ బొదువుఁ డనుచు దుర్దమలీల నీ | ధిక్కువారు గవిసి రుక్కు మిగిలి.
365
క. చనుఁ డడ్డం బాచార్యున | కనునెలుఁగులతోడ నీసుతావళి వెస మా
ర్కొనుటయు మన సేనలు పురి | కొని పాండవబలముఁ దాఁకెఁ గురువంశనిధీ!
366
క. గురుఁ డొడ్డుగఁ దమకంబునఁ | గురువీరులుఁ బాండుపుత్రకుల యోధులు ని
ర్భర సమరద్యూత కళా | నిరతిం గ్రీడించి రుగ్రనిపుణత మెఱయన్‌.
367
వ. శరగురుఁ డెచటికిఁ దఱిమిన | వెరవున నచ్చటికి నెల్ల విక్రాంతి ధురం ధరుఁ డగు ధృష్టద్యుమ్నుఁడు | బరవసము దలిర్ప నడ్డపడి పోరాడెన్‌. 368
చ. కురుపతి ధర్మనందను లకుంఠిత విక్రమ కౌతుకంబునం
బురికొలుపంగ సైన్యములు వోక పెనంగెడు రౌద్రభంగి క
చ్చెరువడి యున్కి నిట్టు లని చెప్పఁగ నిప్పుడు నేర నయ్యెదం
గరిపురనాథ! చూడ వినఁ గల్గునె యమ్మెయి కయ్య మెయ్యడన్‌!
369
వ. అట్టియెడ. 370
క. నీలుఁ డను రాజు గురుసుతు | పై లీలం దేరు వఱపఁ బటువిశిఖమునం
గీ లెడపిన జంత్రముక్రియ | నేలం బడ నేసె నతఁడు నృపుఁ డగ్గింపన్‌.
371
క. చచ్చిన నీలునిఁ గనుఁగొని | విచ్చిన సైన్యంబు గురుఁడు వెనుకొనుటయు వే
వచ్చిన ధృష్టద్యుమ్నుని | నచ్చిన యబ్బలము మగిడినం బో రొప్పెన్‌.
372
వ. అప్పుడు సంశప్తకులు నారాయణగోపాల బలంబులం గూడికొని పఱతెంచి. 373
క. ‘ఓడితిమె మేము రణమునఁ | గ్రీడికిఁ? గ్రేడించి రాక గెలుపే? యతఁ డేఁ
డీ? డాఁగి పోయెనొకొ! మా | తోడి బవర మిట్లు దాను దొలఁగినఁ దెగునే?’
374
వ. అను నెలుంగులు నింగిముట్ట దక్షిణ భాగంబునం గవిసినం గవ్వడి యట నడచి వారికిం గయ్యం బిచ్చిన నత్తెఱపి గని తఱుము కౌరవయోధుల కోలుతలకుం గాక తమ సేనలు దెరలిన భీమసేనుం డదల్చి మార్కొని. 375
క. తల మిగిలి వచ్చు బాహ్లికు | నిలు మని విశిఖముల నొంచె; నృపతియు గురు క
ర్ణులు నశ్వత్థామయు న | మ్ముల వానలు గురిసి రొక్క మొగి నతనిపయిన్‌.
376
వ. అతం డందఱ కన్ని రూపులై యార్చుచు నేట్లాడె; నిట్లొక్కనిం బెక్కండ్రు బొదివినం గనుంగొని కౌంతేయాగ్రజుండు పురికొలుప నకుల సహదేవ సాత్యకి సౌభద్రు లా సమీరపుత్త్రునకు బాసటయై దుర్యోధనాదులం దలపడుటయు రెండు సేనలు గలయన్‌ బెరసె ని ట్లపరాహ్ణంబునం గ్రందు కయ్యంబయ్యె నం దరదంబులు దాఁకు పెల్లున డొల్లు కరులును కరవాల ధారలఁ గాననగు కుంభి కుంభమౌక్తికంబులును దురగ ఖురంబులం గరటి రదంబులను బెనంగొనుచు వ్రేలు ప్రేవులును దెగిపడియు నంకుశంబులు విడువక మిట్టిమిట్టిపడు బాహువులును దొండంబులం బెనఁచి యెత్తినం దొరఁగు హయంబులు వ్రేలు రాహుతులును ముందఱి కాళ్ళు దెగవ్రేసినఁ గూలు శుండాలంబులును సామజంబు లడరి రథ్యసారథి రథిక సహితంబుగా మల్లడి గొనం ద్రొక్కిన నేలం గలిసిన రథంబులును నాశ్వికు లొక్కమొగిఁ జెక్కినం దునిసి పడి యేమిటి యంగంబులో యను సందేహంబునకుం బట్టయి యున్న పదాతి గాత్రఖండంబులును జూచి ఖేచరులకు వెక్కసం బొనర్చె; నట్టి సంకుల సమరంబున ధృష్టద్యుమ్నుండు. 377
క. ‘మన కిది సమయము సుండీ’ | యని ద్రోణునిఁ జూపి తఱుమ నమ్మొన రథికుల్‌
గని ‘పొదువుఁడు సంపుఁడు పొరి | గొనుఁడు దునుముఁ డనుచుఁ ‘గూడుకొని యతనిపయిన్‌.’
378
చ. కవిసిన నమ్మహాభుజుఁడు గన్నుల దట్టపుఁ గెం పెలర్ప భై
రవముగ దివ్యబాణ నికరం బడరించినఁ దేఱి చూడ రా
క వెఱఁగునొంది చిత్రములకైవడి నా ఘనయోధు లుండ నీ
రవుతులు జోదులున్‌ రథికరాజియు వారి మొనల్‌ గలంపఁగాన్‌.
379
మ. తను నత్యుద్ధతిఁ బిల్చి దుర్దమభుజా దర్పంబు శోభిల్లఁ దాఁ
కిన సంశప్తకకోటి నొంచి సమర క్రీడా కళా కౌతుకం
బున నాభీల కపీంద్రకేతన పరిస్ఫూర్జత్ప్రభా జాలముల్‌
వినువీథిం బరఁగంగ వచ్చె మగుడన్‌ వివ్వచ్చుఁ డచ్చోటికిన్‌.
380
క. చిచ్చునకుఁ దోడు గరువలి | వచ్చిన క్రియ భీముకడకు వాసవి యిమ్మై
వచ్చిన మన యోధావళి | ఱిచ్చవడియె; వారిమొన దఱిమికొని వచ్చెన్‌.
381
ఉ. బాసట యై వృకోదరుఁడు పార్శ్వ మునం దఱుమంగ వైరి సం
త్రాసనమూర్తి వాసవి శరప్రతతిం దొరఁగించి ద్రోణు ను
ల్లాసము మాన్చి కౌరవ బలంబులు నెత్తురు వెల్లిఁ దేలఁగాఁ
జేసినఁ ‘గర్ణ కర్ణ మముఁ జేకొనవే’ యనుచున్‌ భయంబునన్‌.
382
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )