| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | దేవా! వైఙశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు దనమనుమండు మృతిం బొందుట విని ధృతరాష్ట్రుండు. | 2 |
| ఉ. |
‘చిత్తము వొక్కెడుం బురుషసింహునిఁ, బౌత్త్రకులాగ్రగణ్యు, న త్యుత్తమతేజు, భూరిగుణు, నొప్పెడు మెత్తని మేనివాని, నె ట్లుత్తల పెట్టిరో పలువు రుగ్రమనస్కులు గూడి యక్కటా! యత్తెఱఁ గెల్లఁ దేటపడునట్టులుగా వివరించి చెప్పుమా!’ |
3 |
| వ. | అనుటయు నమ్మానవపతికి సూతసూనుం డిట్లను: నట్లు భరద్వాజుండు పద్మవ్యూహంబు సంఘటించు నెడ వివిధ దేశంబుల రాజులు దళంబులును, రాజకుమారులు గేసరంబులును, గర్ణ దుశ్శాసన బహుళ సేనా పరివృతుండయి కురువిభుండు గర్ణికయునుంగా నభేద్యభంగి నొనర్చిన నది వలయాకారం బగుటం జేసి చక్రవ్యూహంబు ననంజను, నమ్మొగ్గరంబు మొగంబునం దాను దర్పంబు మెఱయ నెఱయం బొలిచి నిలిచె; మఱియు వలయు నెడలకు లావై జయద్రథ గురుపుత్త్ర కృప శకుని కృతవర్మ భూరిశ్రవ శ్శల శల్యులును, నీ కొడుకులును, మనుమలును రక్తమాల్యానులేపనాంబరాభరణంబులు శోభిల్ల నిలిచి; రంత భీమసేన ప్రముఖంబైన పాండవబలంబులు గదియ నడచె; నందు సాత్యకి ధృష్టద్యుమ్న కుంతిభోజులును, జేకితానక్షత్ర ధర్మక్షత్ర వర్ములును, ధృష్టకేతు నకుల సహదేవులును, నుత్తమౌజ శ్శిఖండి యుధామన్యులును ఘటోత్కచ విరాట ద్రుపదులును, ద్రౌపదేయ కేకయ సృంజయ సముదయంబును నుక్కునం దఱిమి య క్కుంభసంభవుం దలపడిన నవ్వి యవ్వీరుండు వాఁడి మిగులు బలుతూపులం దన వేఁడిమి సూపిన నమ్మేటి విలుకాని మొగంబున నిలువ నోర్వక యా సైనిక ప్రకరంబు దిరుగుడువడిన వెక్కసంబును వెఱఁగుపాటును వెల్లఁదనంబునుం గదురఁ గౌంతేయాగ్రజుం డూరకుండి, కర్ణికార కేతు స్ఫీతుండును, నుత్సాహ శౌర్యసంపద్దుర్నిరీక్ష్యుండును నగు సౌభద్రుం గనుంగొని, ‘వీఁడు దక్క నొరు లీ దృఢవ్యూహంబు భేదింపంజాల’ రని మనంబున నిశ్చయించి యక్కుమారు నుద్దేశించి. | 4 |
| సీ. |
‘ఈ యొడ్డు భేదింప నే మెవ్వరము నేర | మర్జునుండును నీవు నచ్యుతుండుఁ బ్రద్యుమ్నుఁడును దక్కఁ ; బార్థుండు మనల ను | ల్లసమాడకుండ నీ లావు మెఱపి భేదించి మా కెల్లఁ బ్రియ మొనర్పు కు | మార!’ యనవుడు నతఁ డాననాబ్జ మలర ‘దీని ముఖంబు భేదించు తెఱంగు నా | కెఱిఁగించె మా తండ్రి; యేను దెఱపి |
|
| ఆ. |
సేయనేర్తుఁ, జొచ్చి చించి చెండాడెద | మూఁక లెల్లఁ జుట్టు ముట్టినపుడు వెడలు నట్టి వెరవు విన ; దాని కేమి? | నా చొచ్చు నేర్పు బలువుఁ జూడు మధిప!’ |
5 |
| వ. | అనిన విని ధర్మనందనుండు ధనంజయ నందనున కి ట్లనియె. | 6 |
| క. |
తెఱపిగొని నీవు సొచ్చినఁ | బిఱుఁదన చొచ్చెదము రిపులు పెల్లగిలఁగ నం దఱమును మా కిది యెంతయు | నుఱునట్టి వరంబు దీని నొసఁగుము పుత్త్రా! |
7 |
| చ. |
అనవుడు భీముఁ డిట్టులను ‘నర్జుననందన! నీవు ముంద రి మ్మొన యొకయింత సించిన నమోఘరయంబునఁ బార్షతుండు నే నును ద్రుపదుండు సత్యకతనూభవుఁడున్ విరటుండు నంత నం త నడరి చింతు మెల్లెడలు దారుణవిక్రమజృంభణంబునన్.’ |
8 |
| వ. | అనిన విని అభిమన్యుం డాతని యాననం బాలోకించి. | 9 |
| చ. |
‘నను విను కీచకాంతక! మనంబున ద్రోణుఁడు మెచ్చఁ జొచ్చి య మ్మొనఁ గలఁగింప కిట్లు కురుముఖ్యుఁడు ధర్మసుతుండు గారవిం చిన జతనంబు నిష్ఫలము సేయుదునే? నరుఁడున్ సుభద్రయున్ దనయుని గాంచి సంతసము దాల్చుట యంతయు రిత్తఁబుత్తునే? |
10 |
| చ. |
ఇదె యొక పిన్నవాఁ డడరి యెక్కుడు మూఁకల క్రందుఁ దోలెడున్ గదుపుల వెల్చు గోపకుని కైవడి నంచు జనుల్ నుతింపఁ జే సెద; విని మామ ప్రీతి విలసిల్లఁగఁ దండ్రియు సంతసిల్ల బె ట్టిదుఁ డగు కౌరవేంద్రునకు డెప్పర మయ్యెడు భంగిఁ బేర్చెదన్. |
11 |
| క. |
అనిన విని ధర్మసూనుఁడు | దను ప్రీతిం జూచి ‘నీదు ధైర్యము శౌర్యం బును బలమును గీర్తియు వ | ర్ధన మొందెడు’ మనుడుఁ బార్థతనయుం డెలమిన్. |
12 |
| వ. | తన సారథిఁ గనుంగొని ‘మన యరదంబు ద్రోణానీకంబుపైఁ బఱపు’ మనుటయు నా సుమిత్రుం డర్జున పుత్త్రున కి ట్లనియె. | 13 |
| తే. |
‘బాలుఁడవు నీవు; కుంభజ ప్రముఖ సైన్య | పతులు ప్రౌఢులు; పెక్కులు బవరములకుఁ జొచ్చి యెఱుఁగని నీచేతఁ జచ్చువారు | గారు; బహువిధ సమర కర్కశులు వారు.’ |
14 |
| చ. |
అనవుడు నల్లనవ్వి యతఁ డాతని కిట్లను; ‘దేవయుక్తుఁడై యనికి బలారివచ్చినఁ బురారి గణంబులుఁ దానుఁ బన్నినం గినిసి కడంగి క్రీడియును గృష్ణుఁడుఁ దాఁకిన నే జయింతు మా ర్కొని యనుచుండుదున్; సరకు గొందునె ద్రోణునిఁ దోడియోధులన్?’ |
15 |
| వ. | అని పలికి వాని యాలాపంబు నాలంబుసేసి యభిమన్యుండు పెలుచం దఱిమిన వాఁ డనుమానించుచు మన సైన్యంబునకు సమ్ముఖంబుగాఁ దేరు నడపుటయు, వారి సేనయుం దోడన కడంగుటయుం గనుంగొని భారద్వాజ ప్రముఖ యోధు లొండొరులకుం దల మిగిలి యేచి యెదుర్కొని పెలుచ నిలిచిన, సంకుల సమరం బయ్యె; నట్టియెడ. | 16 |