పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధన ప్రభృతి మహారథికు లందఱు నొక్కుమ్మడి నభిమన్యునిపైఁ గవియుట (సం. 7-36-22)
వ. ఇవ్విధంబున నశ్మకుండు వడినఁ దెరలు బలంబుల మరలనీక పురికొల్పుకొని యప్పటి యాచార్య ప్రభృతి యోధులును నీ కొడుకులలోనఁ గొందఱును గ్రందుగం దఱిమి యనేకాస్త్రశస్త్ర పరంపరలం బొదివిన నొదవిన కినుకం గిరీటినందనుం డందఱమేనులు నానా నిశిత విశిఖ వేగంబున నెత్తుట జొత్తిల్లం జేసి కర్ణుపయిం గవిసి. 31
తే. కంకటము దూఱి యంగంబు గాఁడిపోవఁ | గ్రూరనారాచ మేసిన స్రుక్కె నతఁడు
లీల నట్టివ పఱపి భూపాల! నీదు | సుతుల వెనుకకుఁ బఱపె నుద్ధతి దలిర్ప.
32
చ. అడరి నరేంద్రకోటి నుఱుమాడఁగ నత్తఱి శల్యుఁ డెంతయున్‌
వడిఁ దనుఁ దాఁకినన్‌ మెఱుఁగు వాలిక తూపుల మూర్ఛవుచ్చి క
వ్వడికొడు కేచి యుద్భట రవంబున నార్చినఁ బెల్లగిల్లి న
ల్గడలకుఁ బాఱె నిల్వక బలంబులు ద్రోణుఁ డెలుంగు సూపఁగాన్‌.
33
వ. అప్పుడు. 34
క. సురలును సిద్ధులు విద్యా | ధరులుఁ బొగడు నులివుఁ జూచు ధరణీశుల బం
ధురనుతి నాదంబుల నం | బరధరణీ మధ్యభాగ భరితము లయ్యెన్‌. ’
35
చ. అన విని యాంబికేయుఁడు ‘మహాద్భుత విక్రమశాలిఁ బార్థునం
దను మఱి యెవ్వ రట్టి యెడఁ దాఁకిరొ?’ నావుడు సూతపుత్త్రుఁ డి
ట్లను ‘నటులైన శల్యుఁ గని యాతని తమ్ముఁడు మేను వెంచి మా
ర్కొని పది తీవ్రబాణములు గ్రుచ్చెఁ దదంగములం జెలంగుచున్‌.
36
వ. అట్లు బెట్టేసిన వాసవికొడుకు కోపించి. 37
చ. హయములఁ జంపి, సూతుఁ దెగటార్చి, పతాక ధరిత్రిఁ గూల్చి, చా
పయుతము గాఁగ వానిఘనబాహులు రెండును ద్రుంచి, యెంతయున్‌
రయమునఁ దేరు చక్కడిచి, రాజులు రాజతనూజులుం గడున్‌
భయమునఁ దూలిపోవఁ బటు భల్ల హతిన్‌ దల డొల్ల నేసినన్‌.
38
వ. ద్రోణ కృప ద్రౌణి కృతవర్మ బృహద్బల కర్ణ ప్రముఖ యోధవరు లొండొరులఁ బేరువేరం బిలిచి బలంబులం బురికొలిపిన రథనేమి గజఘంటా తురంగ కింకిణీ స్వన సింహనాదమేదుర రోదోంతర రౌద్రంబుగా సౌభద్రుం జుట్టు ముట్టిన నతం డట్టహాసంబు చేసి లాఘవలక్ష్య శుద్ధి చిత్రత్వ దృఢత్వంబులు మెఱయఁ గృష్ణార్జునులు గావించు నేర్పు మెఱయం బోరు నవసరంబున మండలీకృత కోదండుండును బటు సంధాన స్ఫురిత శరనికరుండును నై పరివేష వలయంబు లోనం గిరణస్ఫురణ దుర్నిరీక్ష్యుండగు తపను ననుకరించుచు గుణఘోషభీషణంబుగా బెడిదంపు నారసంబులు వరఁగించి యార్చి యూర్జితగర్జితం బగుచున్‌ బలు పిడుగులు దొరఁగించు విలయకాల వలాహకంబు విడంబించుచు విజృంభించి భల్లాంజలీక క్షుర ప్రకూర్మ నఖర ప్రభృతి బాణ వేణికా వితానంబుల వెగడు పఱిచిన విచ్చిన వాహినుల నిలువరింప నేరక నివ్వెఱపడి యాచార్యుండు సూచుచుండె’ ననవుడు ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. 39
క. ‘మనమున ఖేదము మోదముఁ | బెనఁగొనియెడు మద్బలంబుఁ బీడించెడు నా
మనుమఁడని వినికి నాతని | యని పని యటమీఁద నెట్టు లయ్యెం జెపుమా!’
40
క. అనుటయు సంజయుఁ డిట్లను | ‘వినుము జనాధీశ! యిట్లు విఱిగిన సేనం
గనుఁగొని పోవఁగనీ క | ర్జున తనయుఁడు దనరథంబు చుట్లం బఱపున్‌.
41
వ. కొఱవి ద్రిప్పిన తెఱంగు దోఁపఁ బొదివి, పోనీక పీనుంగు పెంటలు సేసిన నప్పు డక్కుమారు నాలోకించి వికాస భాసిత వదనుం డగుచు గురుండు గురుపతి నెఱను దాఁకఁబలుకవలయు నను తలంపున నతండు వినుచుండఁ గృపాచార్యుతో నిట్లనియె. 42
ఉ. తమ్ములు నన్నలుం జెలులుఁ దండ్రులు మామలు భృత్యులుం బ్రమో
దమ్మునఁ దేల నిట్లు వడిఁ దాఁకెడునే? విజయాత్మజుండు, ఘో
టమ్ములుఁ గుంజరమ్ములు బడల్పడఁ దేరులు నుగ్గుగాఁగ నా
నమ్మిన యోధవీరులు వినాశము భంగము నొంద నొక్కఁడున్‌ .
43
ఆ. అనిన వెలుకఁబాఱి యతిదీనమగు నాన | నమున నవ్వుగాని నవ్వు నెఱయ
సౌమదత్తి కర్ణ శల్యాదులగు యోధ | జనులతోడ నిట్టు లనియె విభుఁడు.
44
చ. ‘పలుకులు వింటిరే ధనువు వట్టెడివారికి నెల్లనొజ్జ, దో
ర్బలవిదితుండు గుంభజుఁడు బాలుని నొక్కరుఁ జంచలాత్ము వెం
గలిఁ గడుఁ బెద్దఁ జేయుచుఁ బొగడ్తకుఁ జొచ్చె నితండు నొంపఁగాఁ
దలఁపడు వీనిఁ బార్ధునకుఁ దాఁ గడుఁ గూర్చుట నెంత త్రుళ్ళినన్‌.
45
చ. గురుని యుపేక్షఁ జేసి తనకున్‌ సమరోద్ధతి సెల్లె; దాని నీ
వెరవిఁడి గానలేఁడు దన వీరమకాఁ గొని విఱ్ఱవీఁగెడుం
బొరిగొనుఁ డందఱుం గడఁగి పోవఁగనీక దృఢాస్త్రశస్త్రని
ష్ఠుర పరిపాతనోగ్రముగఁ జుట్టును ముట్టి చలం బెలర్పఁగన్‌’
46
వ. అనిన విని వార లందఱు న వ్వాసవపౌత్రుం బొదువం బోవ నవ్వీరుల వారించి దుశ్శాసనుం డిట్లనియె. 47
చ. ‘ఇనుఁ గబళించు రాహు క్రియ నే నొకరుండన పోయి పార్థపు
త్త్రునిఁ బరిమార్తు నీతఁడు మృతుం డగు టేర్పడ విన్నఁ గేశవా
ర్జునులును బిట్టు సత్తు రతిశోక భరంబునఁ జేసి యంతతో
మన పగ దీఱుఁ దీవ్రమగు మద్భుజదర్పము సొంపు సూడుఁడీ!’
48
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )