| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
అదలిచి లక్ష్మణుండు విజయాత్మజుఁ దాఁకినఁ జూచి యుమ్మలం బొదవఁగఁ బుత్త్రుఁ బెట్టి చన నోపక క్రమ్మఱు రాజుఁ గాంచి యం బుదములు గొండపై నడరు పోలిక నన్నరుపట్టి నందఱుం బొదువ, నతండు ఘోరశర భూరి సమీరమునం దెరల్చుచున్. |
88 |
| క. |
కదిసిన లక్ష్మ ణునిం బులి | కొదమను సింగంపుఁ గొదమ గొదగొని లీలం బొదువుగతిఁ గిట్టి మోదము | మదము నెలర్పంగ నింద్రు మనుమఁడు గడిమిన్. |
89 |
| చ. |
ఉఱక యురంబు బాహువులు నొక్కొక యమ్మున నొవ్వనేసి నీ వెఱిఁగి యెఱింగినన్ దొడరి తెక్కడఁ బోవఁగ వచ్చు? నంచు నే డ్తెఱఁ దలఁ గుండలస్ఫురితదీప్తులతో నిల డొల్ల నేసె నం దఱుఁ బతియుం గనుంగొనఁగ దైన్యరవంబు సెలంగ సేనలన్. |
90 |
| తే. |
మిడుక మిడుక ని త్తెఱఁగునఁ గొడుకుఁ దునిమి | యక్కుమారుండు మెఱయుట నడలుఁ గనలుఁ గడలుకొను మదితోడ నీ కొడుకు ‘వీని | నొంపుఁ డందఱుఁ బైపడి చంపుఁ’ డనుడు. |
91 |
| క. |
కృతవర్మయుఁ గృపుఁడు గురుఁడు | నతని సుతుఁడుఁ గర్ణుఁడును బృహద్బలుఁడును భా సిత శరములు గురియుచు న | చ్యుతు నల్లునిఁ బొదివి రొక్కయుమ్మడిఁ బెలుచన్. |
92 |
| క. |
అతఁ డందఱ విశిఖమ్ములు | వితథమ్ములు సేసి, వారి వెగడు పఱిచి యు ద్ధతి సైంధవు పోరెడు నెడ | కతిరయమునఁ దేరు నడపు నా సమయమునన్. |
93 |
| వ. | నిషాదులు గళింగులు గజబృందంబులతో నడ్డపడిన నయ్యతిరథసింహుండు దరువాయి గొని తునుమాడ నెప్పటి యోధవీరు లెయిది పె క్కాఁబోతు లొక్కపులిం జుట్టుముట్టిన చందంబునం బొదివి పెనంగ నా జయద్రథుండును బాండవ బలంబులం ద్రోచి రానీక రభసాతిశయ ఘోరంబుగాఁ బోరుచుండె; నక్కుమారుండు గురుం బంచాశద్బాణంబులను గృతవర్మ, నశీతి సాయకంబులను, గురుతనయు దశవిశిఖంబులను, గర్ణు నొక్క బలు నారసంబునను స్రుక్కించి, కృపుని విరథుంజేసి, బృహద్బలుమేన ముప్పది నారసంబులు నాటించి, వారలకు బాసట యయి కదిసిన సైనికులం బెక్కు తెఱంగుల తూపులఁ జిక్కువఱిచి యుక్కునం గ్రోధపుత్త్ర బృందారకు లనురాజులను రూపడంచె; నప్పుడు శారద్వతుండు దే రాయితంబు సేసికొని కడంగి తోడి యేవురం గూడుకొని యాక్రీడి కొడుకు మీఁద మార్గణ పరంపరలు పరఁగింపం బెరిఁగిన దర్పంబునం గసిమసంగి యతండు నొప్పింపఁ బెఱవారు బీఱువోవ బృహద్బలుండు బిట్టు గవిసి నిశిత శరంబులు నిగిడించిన నన్నరనందనుండు. | 94 |
| ఉ. |
చాపము కేతువుం దునిమి సారథి నశ్వములన్ వధించుడుం గోప మెలర్ప ఖేటకముఁ గ్రూర కృపాణముఁ గొంచుఁ దేరు సా టోపత డిగ్గి వే కవియుడుం బటు భల్ల హతిం గృతాంత సే వాపరుఁ జేసె హృత్పుటము వ్రచ్చి బృహద్బలు భూరిదోర్బలున్. |
95 |
| వ. | ఇ ట్లింద్రపౌత్త్రుండు గోసలేంద్రునిం దెగఁ జూచినఁ జూచి యేచి తదీయ బంధు భూపతు లొక్క మొగి నురవడించిన నతండు వారల యేపు మాపి కర్ణుండు డాసినం గర్ణోపాంతంబు గర్ణికానారాచంబుల నొప్పించె; నయ్యిరువురు నొండొరుల మేనులు నెత్తురుల జొత్తిల్లం జేసిన సంధ్యా సమయ సూర్యబింబ ప్రతిబింబంబులుం బోలె బొలిచి; రా సమయంబున సూతనందను నాయకు లార్వురు గర్వంబునఁ దన్నుం గదిసినం గవ్వడి కొడుకు చిత్రవధ విహారంబు సలుపు నప్పుడు కుంభసంభవ ప్రభృతి రథికవరుల శరంబులు మగిడించుచు వారిపైఁ దూపులు నిగిడించుచునికి యద్భుతంబయ్యె; నట్టియెడ. | 96 |
| తే. |
మగధపతి సూనుఁడైన యశ్మంతకుండు | బాలుఁ డయ్యును బ్రౌఢదోర్బలము మెఱయఁ దాఁకుటయు, సూతు తలయు రథ్యముల తలలు | నతని తలతోన యభిమన్యుఁ డవనిఁ గూల్చె. |
97 |
| వ. | ఇట్లు పూర్వ వైరంబు దలంచి తలపడిన మాగధు కుమారు నవలీల నేలం గలిపి సింహనాదంబు సేసినం దత్సంరంభంబు సైరింపంజాలక దుశ్శాసన సూనుండు సరభసంబుగాఁ గవిసి ఘోటకంబుల నంబక చతుష్టయంబునను, సారథి నొక్కనారసంబుననుం దదీయ తనువు పది బాణంబులను బెలుచ నొప్పించినం జంచదరుణ కమలచారు విలోచనుం డగుచు సౌభద్రుం డతనిఁ బ్రదీప్త సప్త నారాచ నిపాత పీడితుం జేసి డగ్గఱి. | 98 |
| ఉ. |
ఇంతకు మున్న నీ జనకుఁ డెంతయు నోటఱి పాఱె; నీవె నా పొంతకు వచ్చి; తింక నెట వోనగు? నం’ చొక దొడ్డనారసం బెంతయు బెట్టిదంపు వడి నేయుడు ద్రోణసుతుండు దాని నిం తింతలు సెక్కలై యిలపయిం దొరఁగన్ వెస నేసె; నేసినన్. |
99 |
| తే. |
అతని దిక్కును జూడక యతఁడు రయము | మెఱసి నీ పౌత్త్రుచాపంబు నఱికి, సూతుఁ గూల్చి, యాఱమ్ము లురమున గ్రుచ్చుటయును | నొండు దేరిపై కబ్బాలుఁ డుఱికె నధిప! |
100 |
| వ. | అంత నపరాహ్ణం బయ్యె; నా సమయంబున శత్రుంజయుండును, జంద్రకేతుండును, సువర్చసుండును, సూర్యభానుండును, మేఘవేగుండును, మొత్తం బై, తాఁకిన ధనంజయ తనయుండు మేటి మగలగు నమ్మహీశుల మేనులు నానాస్త్రంబుల ననేక ఖండంబులు గావించి గాంధారపతి సేరినం గ్రూరనారాచ జాలంబుల జర్జరిత శరీరుం జేసి దుర్యోధను దెసకు నడరుటయు నంగపతి యాచార్యున కిట్లనియె. | 101 |
| క. |
‘చండగతి వీరరథికులఁ | జెండుచు నేతెంచి రాజుఁ జేరెడు సౌభ ద్రుం డిట్టులు నీ కూరక | యుండ నగునె? ప్రతివిధాన మొనరింపు తగన్’. |
102 |
| క. |
అని పలికి పతికి నడ్డము | సనుటయు గురుఁ డచటి యోధచయముం గలయన్ గనుఁగొని ‘యభిమన్యుఁడు న | ర్జునుఁడును నని నొక్కరూప చుండీ! తలఁపన్. |
103 |
| వ. | చూడం బిన్నవాఁడు గాని యలంతులం బోయెడు వాఁడు గాఁడు, మన మందఱముం గూడికొని యొక్కపెట్ట యక్కుమారుపై నురవడింపవలయు’ నని పురికొలిపి బరవసంబు సేసె; నప్పు డప్పాండు పౌత్త్రు బాణంబులం బీడితుండై సూతపుత్త్రుండు గుంభసంభవు నాలోకించి ‘నా దెస సూడుము; వీఁడు నొప్పించె; నిలువం దగు నెలవగుట నసము డింపక యీల గఱచుకొని యున్నవాఁడ; గాండీవిఁ గలనం గలిసి యెఱుంగుదుమ కాదె! యతనిచే యింత బెట్టిదంబుగా, దని చెప్పిన విని యల్లన నగి యతం డతని కిట్లనియె. | 104 |
| సీ. |
‘కవచధారణ మను ఘనవిద్య, గవ్వడి | కే నెఱింగించితి; నితఁడు దాని నేర్చుట నీతని నెట్టన నొప్పింప | శక్యంబు గాదు; వంచన గుణంబు నఱకంగఁ జాపంబు విఱుగ నేయఁగ ఘోట | కములఁ జంపఁగ, సూతు సమయఁ జేయ నగుఁ; జాలు దేని నీ వట్ల సేయుము; చేత | ధనువుండ న వ్వీరుఁ జెనయ వశమె |
|
| ఆ. |
దేవతలకు నైనఁ? గావున నొక్క మై | విల్లు ద్రుంచి తఱిమి విరథుఁ జేసి చూచికొంద మలవు చొప్పునఁ దెగునె యీ | రథికవరుని పటుపరాక్రమంబు?’ |
105 |