పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
నారదుఁ డకంపనునకు మృత్యుదేవతా ప్రభావం బెఱింగించుట (సం. అను. 1-8-67 పంక్తి)
వ. అనిన విని యమ్మహాత్ముండు గరుణాయత్తచిత్తుండై యతనికిట్లను ‘ బంధుమరణ శోకం బుడుపం జాలెడు మృత్యుప్రకారకథ వినుట మేలు; నీ వవధానపరుండవై వినుము సెప్పెదం; బ్రజాపతి ప్రజల సృజియించి పదంపడి సంహారంబు లేమిం జేసి భూమికిఁ దదీయభారంబు దుర్భరం బగుటయు, ననుసంధించి చింతాక్రాంతుండై తత్సంహారంబునకు నుపకరణంబు గానక కటకటంబడిన నతని యింద్రియంబుల వలన మహాజ్వలనంబు జనియించి యెల్ల దిక్కులం బరఁగి చరాచరాత్మకంబైన భూతవ్రాతంబు దహింపం గడంగుటయు భువన హితార్థంబుగా భవుండు సని కమలభవు శరణు సొచ్చినం, బ్రజ్వరిల్లుచున్న యమ్మహానుభావుం డద్దేవు నాలోకించి యాదరభరితాంతఃకరణుం డై. 160
క. ‘నీ కోరికి యప్రతిహత | మే కార్యముఁ గోరి వచ్చి తెఱిఁగింపు మమే
యాకార! కామహర! యది | సేకొని యీక్షణమ యేను జేసెద’ ననుడున్‌.
161
ఆ. అభవుఁ డిట్టు లనియె ‘నఖిల సృష్టిక్రియా | కర్త వగుట నీవ కలుగఁ జేయఁ
గలిగి భూతకోటి యెలమిఁ బొందఁగఁ గోప | మెత్తి రూపుమాప నేల యిపుడు?
162
వ. నాకుంగా ‘లోకంబులం గరుణాలోకంబున నా(వ)దరింపు’ మనిన విని యంబుజాసనుండు ‘నాయందుఁ గోపంబును గామంబును లేవు; వినుము! ప్రజాభారపీడితయైన భూమిదేవి దన డప్పి యెఱింగించినం దదీయ హితంబు సేయం బూని సంహారంబు గావించువాఁడనై దానికి నుపాయంబు విచారించి, యెద్దియుం గాననైతి; నది కారణంబుగా నన్నుఁ గ్రోధంబు వొందె’ ననవుడు భూతనాథుండు. 163
ఉ. ‘అనఘవిచార! నీ వరయు మన్నఁ దగం గడు నిష్ఠ లోక పా
లన మొనరింతుఁ గాన యనలం బయి నీ దగు నల్క లోక ము
న్మునుమిడి కాల్పఁ జొచ్చినఁ గనుంగొని యేఁగృప పుట్టి చెప్పెదం
జనునె మహోగ్రకోపవివశత్వము నీకుఁ ద్రిలోకనాయకా!
164
వ. చరాచరంబు లన్నియు నొక్కపెట్ట భస్మీభూతంబులు సేయ నేల? ధరణీభారంబు వాయుటకై యుచిత సంహారంబు గలుగునట్లుగ నొండుదెఱంగు దలంపుము; కోపం బుపసంహరింపు; మివ్వరంబు నా కొసంగు’ మనవుడు నిహత పాపకళంకుండైన యా శంకరు పలుకులకు నతం డయ్యలుక నడంచిన నయ్యనలం బాఱుటయును భువనంబులు ప్రమోదంబు నొంది యా శంకర శతానందుల నభినందించె; నట్లు క్రోధోపశమనం బాచరించు సమయంబున. 165
సీ. కమలాసనుని యింద్రియముల రక్తాస్యయు | నసితాంగియును నరుణాంబరయును
నగు నింతి జనియించి యల్లన నగుచుఁ గెం | జాయ రంజిల్లు లోచనము లలర
నా జగన్నాథుల నలవోకవోలెఁ గ | న్గొని దక్షిణమునకుఁ జన నజుండు
మెలపుతో ‘మృత్యువ! మృత్యువ! యెట వోయె?’ | దని పలుమాఱు సాంత్వనము దోఁపఁ
 
తే. బిలిచి ‘సంహారబుద్ధి నా కొలయఁ బొడము | కనలునం దుద్భవించితి గాన నీవు
దొడరి (గి) వాసి లేకెల్ల జంతువుల సంహ | రింపు నా పంపుమై; నీకుఁ బెంపు గలదు.’
166
వ. అనిన విని మృత్యుదేవత దుఃఖిత యయినం గన్నీరు దొరంగె; నయ్యశ్రుబిందువులు పద్మజుండు పాణిపుటంబునం బట్టి లోకహితార్థంబుగా ననేకభంగుల ననునయించిన, నక్కాంత గాడ్పున నల్లాడు తీఁగ తెఱంగునం జలించి, యంజలి ఘటించి య వ్విరించి కి ట్లనియె. 167
తే. ‘నీవు సృజియించి తటె నన్ను దేవదేవ! | యేను గ్రూరకర్మములకు నెట్టు లోర్తు?
బంధు మరణ శోకార్తులై పనవు జనుల | వివిధ భంగుల యెలుఁగులు వినఁగఁ జాల.
168
వ. ఈ యధర్మంబునకు వెఱతు; నీవు నా మీఁదఁ గృపసేయు; మిట్లు నన్నుం బనుపక తపశ్చరణంబునకుం బనుపవలయు; నివ్వరం బిమ్ము; భవదనుజ్ఞ వడసి ధేనుకాశ్రమంబునకుం జనియెద’ నని పలికినం బరమేష్ఠి య న్నీరజాక్షి నిరీక్షించి. 169
సీ. ‘నినుఁ బ్రజా సంహారమునకునై కల్పించి | నాఁడఁ గావున నీ మనంబునందుఁ
బొడము విచారంబు నుడిగింపు; మిట్లు గాఁ | గలయది యైన యిక్కార్యమునకు
నన్యధాత్వం బేల యగుఁ? బ్రజా సంహర | ణము ననిందిత సమయముగఁ జేయు
మీ వవశ్యంబును’ నావుడుఁ గడుభయం | బున నప్పటికి నియ్యకొని మృగాక్షి
 
తే. నలువ వదనంబు సూచుచు నిలిచె; నతఁడు | ప్రీతుఁడై లోకములఁ గృప పెంపుతోడి
దృష్టిఁ గనుఁగొన నవి పరితుష్టిఁ బొందెఁ | జంద్రమౌళియుఁ దన యిచ్చఁ జనియెఁ బ్రీతి.
170
వ. మృత్యుదేవియుం బరమేష్ఠికిం బ్రణమిల్లి. 171
తే. అచటు వాసి రయంబున నరిగి ధేను | కాశ్రమంబున నియమంబు లాచరించి
నందకౌశికి యనియెడు నదులఁ బెక్కు | వ్రతము లొనరించి మఱియుఁ దీర్థముల నెల్ల.
172
వ. అద్దేవు నుద్దేశించి పెద్దకాలం బనేక విధంబుల దుష్కరంబులగు తపంబులు సేయుచుం బోయి హిమశైల శిఖరంబున సంయతాత్మయై యున్నఁ, జతురాననుం డమ్మానినికిం బొడసూపి, ‘మృత్యువ! నీ వత్యంతనిష్ఠుర నిష్ఠా నియమంబు లేల యనుష్ఠించెద?’ వనిన నయ్యంగన ‘సమాధానంబున నున్న ప్రజల మెడలు నులిచి చంపంజాల; నన్ను నీ పనికిం బంపకు; మధర్మభయంబున ని న్నాశ్రయించెద; నార్తనైన నాకు శరణంబ వగు’ మని ప్రణమిల్లిన నతం డి ట్లనియె. 173
ఆ. ‘ఇంతి! నీ కధర్మ మేల యయ్యెడు? నాదు | పనుపు సేయ నిన్నుఁ బరమధర్మ
మొందు, విమల కీర్తియును జెందు; నట్లుగా | వరము లిత్తు మేను హరుఁడు నీకు.
174
వ. ఏ మనుసంధించిన పనికి నీకు భయం బేల? చతుర్విధ భూతకోట్ల నుపసంహరింపు ’ మనిన నత్తన్వి ‘దేవా! దేవర యాజ్ఞ దలమోచి చేయుదానం గాక! యొక్క విన్నపం బవధరింపుము; లోభంబును గ్రోధంబును నీర్ష్య యు నసూయయు కలిగించి జంతువుల శరీరంబుల వికృతిం బొందింపవలయు’ ననవుడు నతం డట్ల యయ్యెడు; నదియునుంగాక నీ యశ్రుబిందువు లెన్ని యన్నియు రోగంబులై జనంబులం జావం జేయంగలయవి; దానం జేసి యధర్మంబు నిన్నుం బొరయనేరదు; ప్రాణి మారణంబు నీకుం బరమధర్మంబగు; భవదీయశుభం బేను గోరెద; నీవు ధర్మస్వరూపంబ; వీ విశ్వంబునకు నీశ్వరి; వట్లు గావునఁ బ్రాణ సంయమనంబు భవదధీనంబు; సర్వజీవులయెడం గామరోషంబు లుడిగి జీవంబుల నాకర్షింపుము; తత్ప్రకారంబు ధర్మతత్త్వంబు; నీకు భయం బేమి? మిథ్యావర్తనుల నధర్మంబ సమయించుఁ బొ’ మ్మనిన నమ్మానిని శాపభీతిని దన్ను నధర్మంబు వొంద దనుమాటను దన్నియోగం బంగీకరించె; నవ్విరించి వచనంబుల తెఱంగున నాధివ్యాధులు గాత్రహానిం జేయ నా మృత్యుదేవత ప్రాణాపహారిణి యగుటం బ్రాణంబులు దేహంబులం బాసి, దేవాదిభావంబులం బొందుచు మగుడ మనుష్యత్వంబు నొందుచుండు. 175
తే. భీమనాదుండు భీముఁ డుద్దాముఁ డప్ర | తర్క్య తేజోమయుఁడు జగత్ప్రాణుఁ డొడలు
మనుపఁ జెఱుపంగ నొడయండు సనుట మగుడ | నరుగుదెంచుట వింతగా దతని కెందు.
176
క. నరు లమరు లగుదు, రమరులు | నరు లగుదురు; గాన నీదు నందనునకు భూ
వర! వగవ నేల? యతనికిఁ | జిరవీరస్వర్గ సుఖము సేకుఱి యుండున్‌.
177
క. అగణిత దుఃఖాత్మక మి | జ్జగ; మాతఁడు దీనిఁ దొఱఁగి సౌఖ్యాత్మకమై
వగ చెంతలఁ జేరని య | జ్జగమునఁ బుణ్యాత్మ పురుష సంగతి వడసెన్‌.
178
వ. నీకు వగవఁ బని లేదు; బ్రహ్మ కల్పితంబైన యీ నిశ్చయంబు నిరూపించి ధీరులు దెగిన వారలకు వగవ’ రని చెప్పిన నారదునకు నయ్యకంపనుం డిట్లనియె. 179
క. ‘మునినాథ! నీవు సెప్పఁగ | ననఘం బగు నీ సమంచితాఖ్యానం బే
విని గతశోకుఁడ నైతిని; | మనము ప్రియంబందె నతి సమాధానమునన్‌.’
180
వ. అనుచు వినతుం డగుటయు, నమ్ముని దనదైన యశోక వనంబునకుం జనియె నని పలికి పారాశర్యుండు. 181
క. ఈ యితిహాసం బాయువు, | శ్రీయును, నారోగ్యమును, విశిష్టగుణంబుం
జేయు జనములకు జగతీ | నాయక! వ్రాసినఁ బఠించినం దగ వినినన్‌.
182
వ. అభిమన్యుండును భండనంబున పిరుసనక శరశరాసనాది వివిధాయుధంబులఁ బరబలంబుల బడలువఱిచి వీరస్వర్గ సౌఖ్యంబును ప్రఖ్యాతియుం బడసె; నీకు నడలం బని లే’ దని చెప్పిన విని ధర్మతనయుండు దనమనంబున నుత్తమక్షత్త్రధర్మంబు తెఱం గిట్టిద యగుట దలపోసియు, శూరులు పుణ్యలోకంబున సుఖంబుండుటయుం దెలిసియు, నెవ్వగ విడిచి, వెండియు వేదవ్యాసమునీశ్వరుతో నిట్లనియె. 183
ఆ. ‘మును ప్రసిద్ధిఁ బొంది చనిన భూపాలక | శ్రేష్ఠు లెవ్విధమునఁ జేసి రొక్కొ
క్రతువు? లవ్విశిష్ట కర్మజాతముఁ దెలి | యంగఁ జెప్పి నన్ను నాదరింపు.’
184
వ. అనిన విని యమ్మనుజపతి తలంపు గనుంగొని కృష్ణద్వైపాయనుండు నీ విట్లడుగుట నీ కొడుకు దొంటి మహారాజుల యట్టివాఁడు గావున న క్కుమారునకు వారలకుం బుణ్యగతి దారతమ్యం బెట్టిదియో యని యరయుటగా నోపు నని యూహించెద’ ననవుడు నతండు’ మీ దివ్యచిత్తంబున నవధరించినదానిం గాదన నెట్లు వచ్చు? న వ్వానిని వినవలతు నానతియిండు.’ 185
చ. అనుటయు న మ్ముని ప్రవరుఁ డాతని కిట్లను ‘నధ్వర ప్రవ
ర్తనులుఁ దపఃప్రదీప్తులును దానసమగ్రు లుదాత్తశీలురుం
జనియెడు నట్టిచోటు లొక సంపదయే? రణశూరకోటి క
ర్జునసుతుఁ డత్యుదాత్త మగు చోట సుఖస్థితి నుండు భూవరా!
186
వ. అది యట్లుండె, మహితాత్ము లయిన మహీపతుల వరిష్ఠకర్మానుష్ఠానంబు తెఱం గెఱుంగుట మేల కాదె! యంతలంతలు మానుసులు మడిసిరి గాని పుడమి నిత్యులై నిలువంబడ; రది వినుటయు నీ మనశ్శోకోప శమనంబు సేయుం; జెప్పెద నాకర్ణింపుము. 187
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )