పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము
అర్జునుఁడు సైంధవుని తల దునుముట (సం. 7-121-31)
క. అతఁడు గని గంధమాల్యా | ర్చిత మై దొన మెఱయుచున్న శితశర ముగ్రో
ద్ధతి నేయ డేగ పులుఁగును | గతిఁ గొనుక్రియ నది హరించె గ్రక్కున శిరమున్‌.
319
వ. అప్పుడు సత్వరుండై. 320
ఆ. శౌరి ‘పార్థ! పార్థ! సైంధవు తల యిలఁ | బడిన నొప్ప; దది నభంబునంద
నిలువఁజేయు; మేను నీ కెఱింగించెద | నత్తెఱంగు దెలియ’ ననిన నతఁడు.
321
క. పటు శరముల మీఁదికి డా | పటికిన్‌ వలపటికి నపర భాగమునకు ముం
దటికిఁ జదల నడపె సము | త్కటరయమున శిరమున్‌ గందుక క్రీడ గతిన్‌.
322
వ. అట్టియెడ. 323
క. మాయపుఁ చీఁకటి విరియుడుఁ | దోయజమిత్త్రుండు మగుడఁ దోఁచెఁ బ్రజకుఁ గో
పాయత్తు లై బలంబులఁ | జేయంగలవారు గడఁగి శితబాణములన్‌.
324
క. నరుఁ బొదివి; రతఁడు వారల | యురవడి వివిధాస్త్రతతుల నుడుపుచు నింగిం
దిరుగ మును నడపుచుండెడు | శిరమును నేమరక యుండెఁ జిత్రస్ఫురణన్‌.
325
వ. ఇ ట్లత్యాశ్చర్యకరణ పరిణత బాహువీర్యుం డై విక్రమవిహారంబు సలుపుచుండి. 326
ఆ. ‘దనుజవైరి! యెంతదడ వింక నిలుపంగ | వలయు సింధురాజు తల నభమున?
నెచట వైచువాఁడ? నేమిటి కివ్విధ | మాచరింప వలసె? ననిన నతఁడు.
327
వ. ‘వినుము. వృద్ధక్షత్త్రుం డను సింధుదేశాధీశుండు సంతానకర తపోవిశేషంబున నీ జయద్రథుం బడసె; నితండు కుమారుండై వర్తిల్లు సమయంబున నొక్క నాఁ డశరీరవాణి ‘వీఁడు సంగ్రామంబున నేమఱి తల దునుమంబడు’ నని యాదేశించిన నతం డెల్లవారును విన ‘వీని మస్తకంబు మహిం బడ నెవ్వఁడేసె వాని శిరంబు శకలశతం బయ్యెడు’ మని తన తపంబు బలిమిం బలికి, యతనిఁ బట్టంబు గట్టి వనంబునకు నియతుండై యరిగె; నట్లుగావున. 328
క. ఈ తల పుడమిం బడనీ | కాతనితొడమీఁద వైచునది; యాపని వి
ఖ్యాతం బగు పాశుపతము | చేతన యగుఁగాక! యొంటఁ జెల్లునె మనకున్‌?
329
వ. ఆ వృద్ధక్షత్త్రుండు శమంతపంచక సమీపంబున నుండు; నీ వమ్మహనీయాస్త్రంబు నాశ్రయింపు’ మనవుడు నర్జునుం డట్లకాక యని భక్తియుక్తంబుగా నియతమతిం దత్ప్రయోగం బాచరించిన నద్దివ్యసాధనంబు సాయక పరంపరాకారాంబయి యా శిరం బట గొని చని తదాశ్రమ ద్వారంబు సొచ్చునప్పు డజ్జనపతి జపయుక్తుండై యుండ నమ్మహాస్త్రంబు మాహాత్మ్యంబున నమ్మస్తకం బతని తొడమీఁదఁ బడిన నతండు తదీయ స్పర్శంబున నెఱింగి దిగ్గన లేచుచుం ద్రోచిన నది భూతలపతితం బగుటయు. 330
తే. పగిలి యాతని తల నూఱు పఱియలయ్యె; | శౌరి విజయుని నగ్గించె; సకల భూత
ములు మహాద్భుతరసమున మునిఁగె; నపుడు | సంహరించె నయ్యస్త్ర మా సవ్యసాచి.
331
క. ఇవ్విధమున సైంధవు తలఁ | గవ్వడి యట నడపుశక్తి గనుఁగొని సేనల్‌
నివ్వెఱఁగందె; మనంబుల | క్రొవ్వడఁగెను దొరల కెల్లఁ గురువంశనిధీ!
332
సీ. సైంధవు ఘోరకబంధంబు దల యిలఁ | బడునంతకును దేరిపైన నిలిచి
మఱి కూలుటయు విస్మయము గావించెఁ జూ | పఱ కట్లు పార్థుండు ప్రతిన నెఱపె;
నీ తనూభవులు గన్నీళ్ళు దొరఁగ న | త్యంత శోకముఁ బొంది; రచ్యుతుండు
నన్నరుండును బరమానంద కందళి | తాత్ములై; రత్తఱి ననిలసుతుఁడు
 
ఆ. నలిఁ జెలంగి సింహనాదంబు సేసిన | విని యుధిష్ఠిరుండు విజయు పూన్కి
నెఱయు టెఱిఁగి హర్షనిర్భరాకృతి యయ్యె | నుల్లసిల్లి రతని యోధు లెల్ల.
333
వ. అచ్చట నార్పులుఁ దూర్యనినదంబులుఁ జెలంగెఁ; దద్బలంబులుఁ బరమప్రమోదంబునుం బొందె నని సంజయుండు సైంధవవధ ప్రకారంబు ధృతరాష్ట్రున కెఱింగించె నని చెప్పినఁ జిత్తంబు గౌతుకాయత్తంబగుచుండ నటమీఁది వృత్తాంతం బెఱింగింపు మనుటయు. 334
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )