| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లద్భుతోదారంబగు నరనారాయణుల విక్రమ విహారంబు విని వెఱఁగంది యాంబికేయుండు సంజయు దిక్కు మొగంబై. | 2 |
| క. |
‘ఇవ్విధమున సైంధవుఁ డా | కవ్వడిచేఁ బడిన పిదపఁ గౌరవు లెట్లై రవ్వార్త సెప్పు’ మనవుడు | నవ్విభునకు నాతఁ డిట్టు లనియె నరేంద్రా! |
3 |
| వ. | అట్లు పాండవ బలంబులు పొంగి కడంగి కుంభసంభవుమీఁదం గవిసి కయ్యంబు సేసె; నా సమయంబున నిక్కడ. | 4 |
| చ. |
కృపుఁడును ద్రౌణియుం గడఁగి క్రీడిపయిన్ శర వర్షముల్ మహో గ్రపు రభసంబునం గురియఁగా నవి మాన్చి యతండు వారలం గుపితుఁడు గాకయున్ విశిఖ కోటుల నల్లన కప్పు పెల్లునం గృపుని శరీర మొయ్య నొఱగెన్ రుధిరచ్యుతి మూర్ఛ వచ్చినన్. |
5 |
| వ. | ఇట్లు కృపాచార్యుండు రథంబుమీఁదం బడినఁ దత్సారథి దేరు దొలంగం దోలుకొని పోయె; నశ్వత్థామయు నోహటించి తొలంగెఁ; దక్కటి రథికులు పైఁబెట్టంజాలక యంతంత నిలిచి;రట్లు శారద్వతుండు దనయమ్ముల మూర్ఛిల్లుట సూచి సవ్యసాచి వగచె; నప్పు డన్నరునిఁ గౌఁగిలించుకొని నారాయణుం డి ట్లనియె: | 6 |
| క. |
‘కురుబలముఁ దొడరి గెలువఁగ | సుర గణముల కైన నరిది శూరోత్తమ! నీ వురవడి గెలిచితి భాగ్య | స్ఫురణంబును బాహు బలముఁ బొగడం దగదే? |
7 |
| క. |
ఆ వృద్ధక్షత్త్రు తపము | వావిరి నోర్వంగ నీకు వచ్చినటుల దు ర్భావుఁ డగు కర్ణు నోర్వం | గా వచ్చినఁ గాదె నాకుఁ గడుఁ బ్రీతి యగున్!’ |
8 |
| చ. |
అనవుడు నాతఁ డిట్లను ‘మహాత్మ! భవత్కరుణం బ్రతిజ్ఞ యే ను నెఱపఁ గంటిఁ బాండవమనోరథసిద్ధి భవద్దయా సమృ ద్ధి నగుట వింతయే? భవ దధీనులకున్ విజయంబు బ్రాఁతె? నీ పను పొనరించు వార; మట భారము నీయది గాదె యెప్పుడున్!’ |
9 |
| తే. |
అనుడు నుద్గత మందస్మితాస్యుఁ డగుచు | దనుజమర్దనుఁ డతనితో ‘ధర్మతనయుఁ గానఁ బోవంగ వలయు భాస్కరుఁడు గ్రుంకు | చున్నవాఁ’ డని పలికిన నన్నరుండు. |
10 |
| వ. | ‘అట్లు కాక’ యనుటయుఁ గదిలి, భీమసేనుండును సాత్యకియును యుధామన్యుండును నుత్తమౌజుండును సముచితసల్లాపంబులు సేయుచుఁ దో నేతేర సాంద్ర శోణిత పూర సేకంబున ఘోరంబైన సంగ్రామ తలంబునం జని చని శౌరి సవ్యసాచి నాలోకించి. | 11 |
| చ. |
‘కరులు రథంబు లశ్వములు కాలుబలంబు చమూపతుల్ మహీ శ్వరు లఖిలాస్త్ర శస్త్రములు చామరముల్ గొడుగుల్ సిడంబు లా భరణము లిత్తెఱంగునను బార్థ! కడుం జెలువొందెఁ జూడ సం గరమహి చిత్ర వస్త్రమునఁ గప్పిన చందముఁ దోఁపఁ జేయుచున్. |
12 |
| వ. | భవదీయ బాహావిహారంబు నుదారత్వం బిట్లుండునే?’ యని యగ్గించుచు నరిగి సమయోచితం బగుటయును ప్రతియోధులు ఱిచ్చవడియునికిం జేసియు సమరంబు సాలించి తమరాక కెదురు చూచుచుం గూడికొని యున్న యుధిష్ఠిరాదుల సమీపంబగుటయుం బాంచజన్యంబు పూరించినం బాండవాగ్రజుండు. | 13 |