| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| క. |
శినివరుఁడు సోమదత్తుఁడుఁ | బెనఁగఁగఁ దోడ్పడియె వచ్చి భీముఁడు గడఁకం దన మఱఁదికి నక్కౌరవుఁ | డెనయే? యని బిరుదులాడి యేడ్తెఱ నొంచెన్. |
87 |
| వ. | అట్టియెడ. | 88 |
| క. |
అనలశిఖవోని నారస | మున సాత్యకి యేయు నెడను ముద్గరమున భీ ముని కొడుకు వైచె రెంటం | దనువున నొ వ్వడరి సోమదత్తుఁడు సోలన్. |
89 |
| చ. |
తనయుఁడు మూర్ఛవోయిన నుదగ్రత బాహ్లికుఁ డచ్యుతానుజ న్మినిఁ దలపడ్డ నాతనికి మించి వృకోదరుఁ డన్నరేంద్రు నే సిన నతఁ డుగ్రశక్తి వయిచెన్ మెయి నాటుడు సోలి యంతలో నన తెలివొంది ముద్గరమునం బవనాత్మజుఁ డేచి వైచినన్. |
90 |
| క. |
తల వ్రయ్యలైన నిష్ఠుర | కులిశహతిం బగిలి కూలు కులపర్వతముం దలఁపించుచుఁ గురువృద్ధుం డిలఁ | గూలెం బ్రతిబలంబు లే పారంగన్. |
91 |
| వ. | అయ్యవసరంబున దశరథసుత సన్నిభం బగు భవత్కుమార దశకం బా కిమ్మీర వైరిం బొదువుటయు దశ నిశిత బాణంబులం బ్రాణంబులు గొనియెఁ గర్ణానుజుండగు వృకరథుండు గడంగి వచ్చినం బొరివుచ్చె సౌబల సోదరులు పన్నిరువురు బరవసంబు సేసినం బడనేసె నిట్లు పటు పరాక్రమంబునం బేర్చిన భీమసేనుమీఁద శూరసేన వసాతి మాళవ త్రిగర్త బాహ్లిక ప్రముఖంబు లగు దేశంబుల బలంబులు బలువిడిం గవిసినం గని కౌంతేయాగ్రజుండు సైన్య సంతాన సమేతంబుగా నురవడించి భుజాటోపంబు సూపిన నవి మడిసియు జడిసియుఁ జిక్కువడియు నుక్కు మడిఁగియు వెఱంగుపడి చూచుచుండ నాచార్యుని దుర్యోధనుండు పురికొల్పిన నతం డుత్సాహదీప్తుండై యా ధర్మతనయుఁ దాఁకి వాయవ్య యామ్య వారుణాగ్నేయ త్వాష్ట్ర సావిత్రంబు లగు సాయకంబులు వరుస నేయ నయ్యై యస్త్రంబుల నవ్విభుండు ప్రత్యస్త్రంబుల వారించిన నతం డైంద్రాస్త్రంబున నిజ ప్రతిజ్ఞ నెఱపం జూచిన నదియు నట్ల యడంగుటయుం గోపించి సకల భూత భయంకరంబగు బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన నమ్మహీపతియు నమ్మహనీయాస్త్రంబునన సమయించె నంత ధృష్టద్యుమ్నుం డతని కడ్డపడిన నా రథికుతోడి యనికిం గ్రేడించి కుంభసంభవుండు. | 92 |
| చ. |
ద్రుపదుని సేనపై నడరి తోలినఁ జూచి వృకోదరుండు దే వపతిసుతుండుఁ దాఁకి యనివారణ నగ్గురు నొంప నేచి యు గ్రపువడి మాత్స్య కేకయ ముఖం బగు పాండవ సైన్య మొక్క పె ట్ట పరఁగి నీ బలంబుల కడంక యడంచి మదించి పేర్చినన్. |
93 |
| వ. | కనుంగొని కౌరవేశ్వరుండు కర్ణుని కిట్లనియె. | 94 |
| క. |
‘పాండవ పాంచాలాదులు | గండు మిగిలి బెట్టు దఱుమఁ గౌరవబల మొం డొండ కలంగెడు నీ దగు | దండితనము సూపి కావఁ దగు తఱి వచ్చెన్.’ |
95 |
| వ. | అనవుడు. | 96 |
| శా. |
‘చంపం జాలుదు నే నొకండన భుజాశక్తిన్ నరున్ వెండి మ ర్దింపం జుల్కన భీమముఖ్యుల భవత్తేజంబు రాజ్యంబుఁ బా లింపం బూనిన యేను గల్గఁగ రిపుల్ జృంభింతురే? చూడు నా తెంపుం బెంపును’ నంచుఁ గర్ణుఁడు మహోదీర్ణాకృతిం బొల్చినన్. |
97 |