| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అనియె; ధనంజయుండును దదనురూపంబులైన యాలాపంబుల ననుమతి సేసినం గడంగి ఘటోత్కచుండు గర్ణుదెసకుం గవిసె; నట్టియెడ జటాసురసుతుం డగు నలంబుసుం డేతెంచి కురుపతిం గాంచి ‘నాకుఁ బాండవుల దెసం బూర్వవైరంబు గలదు; నీకును బ్రియంబుగా వారిని, వారి వారిని వధియించెద’ నని పలికి యతండు ప్రీతుండై యభినందింప, నా సూతనందనుం గలిసి తలకడచి హిడింబానందనుం దాఁకిన దారుణ రణం బయ్యె; నయ్యిరువురును వివిధ విశిఖ స్ఫురణంబుల నొండొరులఁ దెరల్పం జాలక రథికు లగుట యుడిగి మాయలకుం జొచ్చి మహోరగ గరుడాకారంబులను, వారణ కంఠీరవ రూపంబులను, రవిసైంహికేయాకృతులను, మేఘమారుతమూర్తులను మఱియు బహు విధ వికారాకారంబులను జూపుచుం బోరి యేపునం గదిసి బాహాబాహిం బెనంగునపుడు మేనులు బెరసిన నా భీమనందనుండు. | 203 |
| క. |
పట్టి బలువుగ జటాసురు | పట్టిం బడవైచి, యురము పాదమునఁ గడున్ బిట్టుగఁ ద్రొక్కి, యతని తల | యట్టకుఁ బాయంగఁ జేసి యార్చెం బెలుచన్. |
204 |
| ఆ. |
ఆర్చి నెత్తు రుట్ట నమ్మస్తకము వట్టి | కొని యతం డుదాత్త ఘోర భంగి బ్రమరివాఱి కురునృపాలకు నరదంబు | నందు వైచి యిట్టు లనియె నధిప! |
205 |
| క. |
‘కొను మిదె నీ మిత్రుని తల; | విను మిట్టుల మాఱులేని విక్రమమునఁ గ ర్ణునిఁ ద్రుంచెద; వరుసం బొరి | గొనియెద నిను; భీమసేను కొడుక నెఱుఁగవే?’ |
206 |
| వ. | అని పలికి యసురవరుం డరుణం బగు తన యరదం బెక్కి గృధ్రకేతనంబు గ్రాల నీలోన్నతం బయిన తన రూపంబున కనురూపం బైన దంష్ట్రాయుగళంబును బింగళోద్బుద్ధ జటాకేశ కలాపంబును భీషణంబులుగాఁ గనక భూషణంబుల కతంబునఁ దటిల్లతా వికటంబగు నంబుదంబు కైవడిఁ గర్ణుపయిం గవిసి ఘనశరంబు లేయ నతండును జండభంగి నెదుర్కొని నిశితనారాచంబులఁ గప్పె; నిప్పరుసునం దలపడి యమ్మనుజ దనుజులు మహాద్భుతకరం బగు సంగరంబు సేయునెడ వివిధాయుధ వ్యాపార ఘోర విచేష్టిత విగళిత రక్తసిక్తంబు లగు నంగంబుల యచలత్వంబున గైరిక గిరిద్వయంబు చందంబున నొప్పి; ర ట్లెక్కువ తక్కువలు లేక పోరిపోరి రాధేయుం డొక్క దివ్యాస్త్రంబు ప్రయోగించిన నది భైమసేని ప్రత్యస్త్రంబున నడంచి, మాయాసైన్యం బడరించిన నమ్మాయా సైన్యంబు సాయక శూల ముద్గరాది హేతి వ్రాతంబులును బలల వర్షంబులునుం గురియం గురువాహిని గలంగి పాఱిన, నా సూతసూనుం డొక్కరుండును నవష్టంభ విజృంభణంబు మెఱయ నిలిచి మహనీయాస్త్రబలంబున నమ్మాయ మాయించుటయు హైడింబుండు చక్రంబు వైచినం జక్కడిచె, గద నిగిడించిన మగిడించె, గగనంబున కరిగి తరుపాషాణ పటలంబులు పరఁగించినం దునిమి ధరం దొరఁగించె, మఱియు రథికత్వంబునం గడంగిన నయ్యోధవరుండు తురగ సారథి సహితంబుగా రథంబు శకలంబులు సేసి యతని తను వేదు వెఱిగిన తెఱంగుగా మెఱుంగుటమ్ములు గిఱిగొల్పినం గెరలి య న్నిశాచరనాథుండు. | 207 |
| సీ. |
మాయాముఖంబున మార్గణజాలంబు | ద్రావఁ గర్ణుం డది వ్రయ్య నేసి చెలఁగినఁ గడుఁబెక్కుశిరములతోడి మ | హాకృతి గైకొన నదియుఁ దునుమఁ జచ్చె వీఁ డని మన సైన్యంబు లుబ్బంగఁ | బడియుండి వివిధ రూపములు దాల్చి భంగించె నవియును ద్రుంగఁగ నేసిన | శైలమై తద్వజ్ర సాయకమున |
|
| తే. |
సమసి రథికుఁడై తన చుట్టుఁ జాతురంగ | మైన బల మేచి తఱుమంగ నడరి దీప్త భూరి శరముల నాసూతపుత్రు నొంచి | యెక్కుడై త్రుంచె నతని వి ల్లక్కజముగ. |
208 |
| వ. | ఆ సమయంబున బకుని తోడంబుట్టు వగు నలాయుధుం డను నసురేంద్రుండు వడముడి వలనివైరంబు పెద్ద కాలం బేనియు మనం బెరియింపం దఱి వేచికొని యుండి యన్నిశాసంగ్రామంబునకు ససైన్యంబుగాఁ జనుదెంచి దుర్యోధనుం గని త న్నెఱింగించుకొని యతనితో నిట్లనియె. | 209 |