పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
వేదవ్యాసమునీంద్రుఁ డర్జునునకుఁ బరమేశ్వరు మహిమ సెప్పుట (సం. 7-173-2)
మ. మహనీయాకృతి సంయమిప్రవరు ధర్మస్ఫూర్తి సంకీర్తనీ
యు హుతాగ్ని ప్రతిమానతేజుఁ గరుణాయుక్తుం బ్రతీపాన్వయో
ద్వహు నాశ్చర్యకర ప్రబోధనిధి వేదవ్యాసుఁ బుణ్యున్‌ జయా
వహుఁ డై వచ్చినవాని నాగమసుఖావాసాననాంభోరుహున్‌.
420
వ. అంతంతం గనుంగొని యత్యంతవినయ సంభ్రమంబులతో దండప్రణామంబు సేసి యాసనారణపాద్యాది పూజనంబుల నారాధించి సమీపభూమిం గూర్చుండి కృతాంజలి యై సుప్రసన్నంబగు నమ్మహాముని వదనంబు వీక్షించి. 421
తే. ‘ అవధరింపు మహాత్మ! కయ్యమున నేను | శాత్రవుల నేయఁ బూనుచో సరభసముగ
నడరి ముందట నొకరుఁడు పుడమి నడుగు | లిడక పావకనిభమూర్తి యెసక మెసఁగ.
422
చ. కిరణము లుల్లసిల్లఁ దన కేల నుదగ్రపుశూల ముండఁగాఁ
బొరిఁబొరి నందు ఘోరముగఁ బుట్టినశూల పరంపరల్‌ గరం
బరుదుగ వారి నెల్లఁ దెగటార్పఁగ నే వెనుకన్‌ శరంబులం
గురియుచుఁ జంపినాఁడ నని కొందు జయంబు సముద్భటంబుగన్‌.
423
క. అప్పురుషుఁ డెవ్వఁడో యని | యెప్పుడు మదిఁ దలఁతు; నతని నేర్పడ నాకుం
జెప్పవలయు’ నని యడిగిన | నప్పార్థున కిట్టులనియె నమ్ముని ప్రీతిన్‌.
424
వ. నీయడిగిన యతండు. 425
ఉ. ఆదికి నాది, లోకముల కన్నిటికిం బ్రభుఁ డవ్యయుండు, వే
దాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్యరూపుఁ, డం
హోదళన ప్రకారక శుభోదయ కారక దివ్యనాముఁ, డం
బాదయితుండు దృఙ్మహిత ఫాలుఁడు లోలుఁడు భక్తి యుక్తికిన్‌.
426
క. యోగీంద్రచిత్తకమలా | భోగ మధుప విభుఁడు, ప్రకృతిపురుషాత్ముఁడు, ని
ర్భోగ స్వరూపుఁ డవ్య | క్తా గోచరుఁ డధికసులభుఁ డమలాత్ములకున్‌.
427
ఉ. నీలగళుండు, శంకరుఁడు, నిత్యుఁడు, సత్యసురూపుఁ, డుజ్జ్వల
త్కాల మహానల ప్రశమక ప్రచురామృతవృష్టి విస్ఫుర
ద్బాలమృగాంక శేఖరుఁడు, దైత్యకుల ప్రవిదారణ క్రియా
లోల పరశ్వథుండు, సకలుం డమలుండు, ప్రియుండు శాంతికిన్‌.’
428
వ. అని ప్రశంసించి కవ్వడి గనినవాఁడు రుద్రుం డగుటఁ దేటపఱిచి దక్షమఖ మథన త్రిపుర మర్దనాదులగు నద్దేవుని దివ్యలీల లుపన్యసించి మహాదేవ పశుపతి శివప్రముఖంబు లగు తదీయ భవ్యనామంబులకుం బ్రవృత్తి నిమిత్తంబులగు నర్థంబులు దెలియ నిర్వచనంబు సేసి; ‘యట్టి పరమేశ్వరుండు నీకు వరదుండయి సన్నిధిసేసె నతనిం గని పెన్నిధిఁ గన్న పేదవోలెం గృతార్ధుండ వై; తయ్యంధకాసురభంజను కతంబున గడింది పగ రడంగుదు; రయ్యాదిమ ధనుర్ధరుం డివ్విధంబున; వైరివధం బాపాదింప నీకు గెలుపు గొనుట సుకరం బయ్యె; నీ తపంబు పెంపునం దొల్లి సన్నిహితుండై నీకుం బ్రియంబుగా దివ్యాస్త్రంబు లొసంగె; నంతటం దనివి సనక యత్తెఱంగున భక్తపరాధీనత్వంబు ప్రకటించె; నీవు పుణ్యాత్ముండ వప్పరమాత్ము నాత్మ నిలిపి నమస్కరింపు; మాసర్వలోక శరణ్యు శరణంబు సొరు మక్కరుణాకరుండు శరణాగతులకు నాయు రారోగ్యైశ్వర్యాది సకలాభిమతంబులు నిత్యంబులుగాఁ బ్రసాదించు’ నని నిర్దేశించిన నయ్యర్జునుండు దండ ప్రణామ పూర్వకంబుగా భక్తి రసాయత్తంబగు చిత్తంబునం జంద్రధరు నెలకొలిపి సాంద్రానందం బనుభవించి సాత్యవతేయు చరణంబుల కెఱంగిన, నమ్మునీంద్రుం డయ్యింద్ర నందను నభినందించి ‘సుఖివి గ’ మ్మని దీవించి విజయం చేసె నని యిట్లు సంజయుండు ధృతరాష్ట్రున కెఱింగించె నని జనమేజయునకు వైశంపాయనుండు సెప్పుటయు. 429
క. మునివర! ద్రోణుని వృత్తము | విని సంతుష్టుండ నైతి వినువేడుక నా
మనమునఁ దోడ్తో నొదవెడు; | వినిపింపు దగంగ మీఁదివృత్తాంతంబున్‌.
430
వ. అని యడుగుటయు. 431
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )