పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
కర్ణుని మొదటి నాఁటి యుద్ధము (సం. 8-7-14)
వ. ఇవ్విధంబున బలంబులకుఁ బ్రమోదం బెసంగ నడచి రాధేయుండు దుస్సహంబుగా మకర వ్యూహంబు సమకట్టునెడ నందుఁ దుండంబునఁ దాను నిలిచి నయనంబుల శకునియు నులూకుండును శిరంబున నశ్వత్థామయుఁ గంఠంబున దుర్యోధనానుజులును నుదరంబున దుర్యోధనుండును ముందట వామపాదంబున నారాయణ గోపాలయుతుండై కృతవర్మయు దక్షిణపాదంబునఁ ద్రిగర్త దాక్షిణాత్య సంవృతుండై కృపాచార్యుండును వెనుక డాకాల నానాదేశ సేనతో శల్యుండును వలకాల ననేక రథకరితురగసమేతుండై సుషేణ జననాథుండును బుచ్ఛంబున మహాసైన్య సమగ్రుండయి చిత్రుండను ధాత్రీపతియు నతని తమ్ముండగు చిత్రసేనుండును నిలుచున ట్లొనర్చి తక్కిన వారల నెడ నెడం బన్నించె నటమున్న యుధిష్ఠిరుం డుద్దామ సామజాది చతురంగోల్లాసభాసితుండయి నడతెంచె నట్లు నడతెంచి యమ్మనుజవిభుండు మనమొనం జూచి సవ్యసాచి కిట్లనియె. 65
చ. ‘కనుఁగొనఁ జుల్కనైన యది కౌరవసైన్యము గంటె? సూత నం
దనుఁ డొక యొడ్డుగా నిలిపి తాను ముఖంబున నిల్చి కయ్య మె
ల్లను దనమీఁదఁ బెట్టికొని లావును బీరముఁ జూపఁ బూని యే
పున నఱిమెన్‌ భవద్విశిఖ పుంజములం దెగటార్పు మీతనిన్‌.
66
క. వనమునఁ బండ్రెండేఁడులు | మన ముత్కటదుఃఖవార్ధి మగ్నులమై యి
ట్లునికికిఁ దగ నితని భవ | త్సునిశిత బాణాబ్ధి ముంపు దుర్దమలీలన్‌.
67
ఉ. వీఁ డొకరుండె యింక బలవిక్రమ సంపద గల్గి పోరిలో
వాఁడిమి సొంపు సూపఁ గలవాఁడు సుయోధనుపాలఁబేర్చు నీ
వేఁడిమి సూపి రూ పడఁపు వీనిఁ బురందర పుత్త్ర! యంతతోఁ
బోఁడిమి మాలు నాతఁడు ప్రభూత జయోన్నతి నిల్చు నీకడన్‌.
68
వ. నీకుం బోలిన మొగ్గరంబు గావింపు’ మనవుడు నర్జునుం డర్ధ చంద్ర వ్యూహ విధానంబున మోహరించి తాను మధ్యప్రదేశస్థుండై వామదక్షిణ శృంగంబుల భీమ ధృష్టద్యుమ్నుల నిలిపి యుధిష్ఠిర నకుల సహదేవులం బింగలిగా నొనర్చె నతని చక్రరక్షకులగు యుధామన్యుండును నుత్తమౌజుండునుం గయ్యంపువేడుక మొగంబులం జిగురొత్తఁ బొలిచిరి. తక్కిన యోధులుం దగినచోట్ల నిలిచి రిట్లిరువాఁగును బన్నియున్న సమయంబున. 69
చ. హరియును బాండునందనులు నాజి నవశ్యము నేఁడు సూడఁ బో
దురు జమునంచు నాత్మఁ బరితోషముఁ బొందె భవత్తనూజుఁడున్‌
దురమునఁ గర్ణయుక్తముగఁ ద్రుంగు సుయోధనుఁ డన్‌ తలంపుతోఁ
బరమసముద్యమస్ఫురణఁ బాండవముఖ్యుఁ డెలర్చె భూవరా!
70
ఆ. ఒకటి కొకటి కంటె నుబ్బుచు వర్తించు | చాడ్పు దోఁప రెండు సైన్యములను
బొలిచెనపుడు సెలఁగె భూరి భేరీముఖ | తూర్యములు నభంబు దూఁటుకట్ట.
71
వ. చిందంబుల మ్రోఁతకు నిందు నందునం దమకించి భటులు గెలంకులం దాఁకఁ దోడ్తో నెఱపినయగ్గలిక నొండొంటి బెరయ మొగ్గరంబు లురవడించి. 72
సీ. నిబిడ ఘంటావళి నిక్వణంబులతోడ | భీషణ బృంహిత ఘోషములును
ఘననేమి నిష్ఠుర ధ్వనుల పొందులఁ గేతు | నిర్భర కింకిణీ నినదములును
జటుల ఖురవ్రాత పటురవంబులతోడ | నాభీలహేషా మహాస్వనములు
భూరిభుజాస్ఫాలనారావములతోడ | మేదురతర సింహనాదములును
 
ఆ. బరఁగి దిక్తటములఁ బగిలింప ననిమిష | ఖచర సిద్ధ యక్ష గరుడ గణము
లంతరంగములు నితాంత కౌతుకభరి | తములు గాఁగఁ జూడ్కి గములు వఱపె.
73
వ. ఇట్లు దలపడి యిరువాఁగును బేరువాఁడిఁ బోరునెడ గరుడ ప్రహారంబుల నొచ్చిన పంచాస్య పన్నగంబులం బోని బాహువులను గాంతత్వరుచి సౌరభంబుల పెంపున సంపూర్ణ చంద్రార్క కమలంబులం గ్రేణిసేయు నాననంబులను సంగ్రామరంగం బలంకృతంబయ్యె వాహనంబులమీఁదనుండి భూషణకిరణంబులు మెఱయ సైనికులు నేలంగూలు నప్పుడు పుణ్యావసాన కాలంబున నాకలోక పరిభ్రష్టంబగు మహాత్మలోకంబు చందంబు దోఁచెఁ జతురంగంబులునుం దమతమ జాతిచేతంబడుటయు నేనుంగు లడరిన నరదంబులు సదియుటయు నాశ్వికులు వొదివినం గరులు ధరం దొరంగుటయు భటు లురవడించినం దురంగంబులు గడికండంబు లగుటయు రథంబులు గవిసినం గాల్వురు దుమురగుటయుఁ గ్రందున నెల్ల తెఱంగులు నన్ని దెఱంగులం గలయ బడలువఱుచుటయు రౌద్రరసంబుఁ బెనిచె నాసమయంబున సాత్యకి ధృష్టద్యుమ్న చేకితాన ద్రౌపదేయులు ప్రభద్రక చేది పాండ్య చోళ మగధ వంగాది దేశంబుల బలంబుల తోడ బరవసంబుసేసి తఱిమి రట్టియెడ. 74
ఉ. దంతి ఘటల్‌ మహోగ్ర సముదగ్రతతో నడతేర దర్ప దు
ర్దాంత గజాధిరోహణ నితాంత సముజ్జ్వల భంగిఁ బ్రౌఢ వి
క్రాంతి విలాస మొప్పఁగ నఖండిత పౌరుషుఁడైన భీముఁ డ
త్యంతసముద్ధతిం గవిసె నస్మదనీకము సంచలింపఁగన్‌.
75
క. ఉదయాచలమున రుచి సం | పదఁ బొలుచు పతంగు పగిదిఁ బ్రసరత్తీవ్ర
ప్రదరములు నెఱయమెఱయఁగ | మదావళము మీద వెలిఁగె మారుతి యధిపా!
76
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )