పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
కర్ణుఁడు నకులుని విరథుంజేసి యవమానించుట (సం. 8-17-91)
క. వెనుకొని రాధేయుఁడు నిజ | ధను వాతని కంధరమునఁ దగిలిచి నలిఁ బ
ట్టిన నింద్రచాప పరిగత | ఘనాకృతిని బొలిచె నతఁడు కౌరవనాథా!
134
వ. ఇట్లు పాండుతనయుబాడుదలఁబట్టి మందస్మిత సుందరాననుండై. 135
క. పలుకులు వృథగా నన్నుం | బలికితి ము న్నింక నెన్ని పలుక వలసినం
బలుకుము నీకేఁ దగ నా | యలవుఁ జలము నీ వెఱింగి తంతియ చాలున్‌.
136
క. అలవెఱిఁగి పెనఁగు పెనఁగం | దలఁచిన నదిగాక సిగ్గుదలకొని యనికిం
దొలఁగుట యింకిట దగు వి | చ్చలవిడి నర్జునుని కడకుఁ జనుము కుమారా!’
137
క. అని విడిచె నకులుఁ గుంతి వ | చనములు దృఢవృత్తి చిత్త సంకలితములై
యునికిం గర్ణుం డతఁడు ను | జని ధర్మజునరదమెక్కె సవ్రీడముగన్‌.
138
వ. ఎక్కి నిట్టూర్పు నిగుడం గుంభనిక్షిప్త భుజంగంబుచందంబున నుండె నవ్విధంబున మాద్రీపుత్ర మాన మథనవిజృంభితుం డగునవ్వీరుం డప్పుడు మధ్యందినగతంబైన మార్తాండబింబంబునకుం బ్రతిబింబంబునుం బోలెఁ బ్రదీప్త మూర్తియై వెలిమావులును దెలిపడగయు నుల్లసిల్ల శోభిల్లు తన రథంబు రయంబున దర్శనీయంబుగాఁ బాంచాలబలంబు దఱిసి పెక్కు తెఱంగుల మెఱుంగుటమ్ములగములు గదియించి. 139
సీ. సూతులఁ దెగటార్చి కేతనంబుల వీట | తాటంబుసేసి రథ్యములఁ గూల్చి
చామరచ్ఛత్రభూషణములు పొడిసేసి | రథికజనముల శిరములు ద్రుంచి
కొమ్ములునఱికి యంకుశములుదునిమి తొం | డములు ఖండించి కుంభములు వ్రచ్చి
జోదులతనువులు భేదించి మోరలు | గళ్యాల తోడఁ జెక్కలుగఁ జేసి
 
ఆ. కంధరములుడుల్చి కాళ్ళులు ద్రెంచి యా | శ్వికులఁ జంపి చర్మవిశిఖకుంత
ముసలముద్గరప్రముఖసాధనములు భ | గ్నములు సేసి భటుల సమయఁ జూచి.
140
వ. బాహువిలాసంబు మెఱయ నెఱయంబొలిచె భవత్సుతుండగు యుయుత్సుండు పర్వతప్రతిముండగు నులూకుపయిం గవిసి కులిశనిభంబగు విశిఖంబున నొంచినఁ గోపించి యా బల్లిదుండు విల్లు విఱుగ నేయుటయు నక్కుమారుండు. 141
తే. మేలు విలుగొని యఱువది నాలుగమ్ము | లతనిమెయిఁ గ్రుచ్చి సాయక త్రితయ నిహతి
సూతు నొప్పించి మఱియు నిశాత శరచ | యమ్ము వరఁగించె నధిక రయమ్ము మెఱయ.
142
వ. దానం గనలి. 143
క. బలువిడి నులూకుఁ డిరువది | శిలీముఖము లొడలఁ జొనిపి సిడము రయముమై
నిలఁ గూల్చిన నీ సుతుఁ డు | జ్జ్వల విశిఖములయిదు నాటె వాని యురమునన్‌.
144
వ. ఇట్లు నాటించిన నొచ్చి యా సౌబలనందనుండు రౌద్రంబు రూపంబు దాల్చిన రుద్రువిధంబున విజృంభించి. 145
శా. భల్లం బొక్కటఁ జంపె సూతునిఁ జతుర్బాణాహతిన్‌ వాజులన్‌
డొల్లం జేసె నిశాతపంచవి శిఖాటోపంబునంజించె వీ
రోల్లాసంబు వికాసముం బొరయ మే నుక్కేది నీ నందనుం
డెల్లం జూడఁగఁ బాఱి యొండొక రథం బెక్కెం గురుగ్రామణీ!
146
క. గెలుపున మెయి వొదలఁగ సౌ | బలసూనుఁడు రథమువఱపి పాంచాలబలం
బలుగులపడఁ బలు దెఱఁగుల | యలవుల విహరించె నుద్భటాటోపమునన్‌.
147
సీ. శ్రుతకర్మ నకులునిసుతుని శతానీకుఁ | దాఁకి యశ్వంబుల ధరణిఁ గూల్చి
సూతునిఁ బరిమార్చె నాతఁడు గదవైచి | రథవాహనముల సారథిని గేత
నముఁ బొలియించె భూరమణ! యిమ్మెయి నీదు | తనయుండు నకులనందనుఁడు విరథు
లై యొండు దేరుల కరిగిరి శ్రుతసోముఁ | దలపడి కడిమి గాంధార నాథుఁ
 
తే. డతని నడరించి వివిధ సాయకము లెల్లఁ | దునిమి బాణత్రయంబునఁ దనువు నొంచి
తురగముల నరదమ్ముఁ గేతువుఁ దిల ప్ర | మాణ శకలంబులుగఁ జేసె మద మెలర్ప.
148
మ. విరథుండై పొలివోని బీరమునఁ బృథ్వీభాగసంచారియై
శరజాలంబుల భీమసేనసుతుఁ డాశ్చర్యంబుగా నీ మఱం
ది రథం బేడ్తెఱఁ గప్పినం దునిమె నుత్సేకోగ్రుండై యమ్మహీ
వరుఁ డబ్బాలుని చాపదండము భుజావష్టంభ మేపారఁగన్‌.
149
చ. అతఁడు ప్రదీప్తఖడ్గము రయంబుమెయిం గొని యా నృపాలుఁ డు
ద్ధతిఁ బరఁగించు సాయకశతంబులు ద్రుంచుచు నుల్లసిల్ల న
ప్పతి పటుభల్లఖండిత కృపాణునిఁ జేసిన నీడఁబోక చే
తితునియ బెట్టువైచె జగతీవర! యాతని విల్లు రెండుగన్‌.
150
వ. ఇట్లు కోదండంబు దుండంబులుసేసి తొలంగి యక్కుమారుండు శ్రుతకీర్తి స్యందనంబెక్కె సౌబలుండు వేఱొక్క విల్లెత్తియత్తెఱపి నురవణించి పాండవరథికులం గలంచెఁ గృపాచార్య ధృష్టద్యుమ్నులు పెనంగునెడ గౌతముండు పాంచాలవరుం బొదువునాటోపం బాలోకించి యక్కౌంతేయసైనికులు దమలోన. 151
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )