| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
అందుఁ బాంచాల వీరుల నశ్వసూత | రథ సమేతంబుగా నంగరాజు దర్ప మెసఁగ నేవురఁ బదువుర నేడ్వురను మ | హాస్య మార్గణములఁ దునుమాడె నధిప! |
339 |
| క. |
పదపడి పాండవ యోధు | ల్వొదివినఁ బెనుఁదుంగ మడువులో గజపతి యు న్మదవృత్తిఁ గేలిసలుపు ప | గిది నాతఁడు పోరె సురలు కీర్తన సేయన్. |
340 |
| వ. | అట్టియెడ. | 341 |
| చ. |
ద్రుపద తనూజులుం గవలు ద్రోవది పుత్రులు శౌరితమ్ముఁడుం గుపితమనస్కులై బలుపుఁ గోల్తలఁ దాకి; రతం డదల్చి యు గ్రపు రభసంబునన్ శరపరంపరలం బరఁగించెఁ గౌరవా ధిపు హృదయంబు మోదమునఁ దేలఁగ నందఱ యంగకంబులన్. |
342 |
| వ. | వారలపై నక్కురుభూనాథుం డేనుఁగు కయ్యంబునకు వెరవు గల కళింగ వంగాంగ మగధ సుహ్మపౌండ్రాది దేశంబుల బలంబులం గవియించిన నవి తదీయ చతురంగ బలంబుల మట్టి మల్లాడి చిత్రవధ విహారంబు సలుప నగ్గజ ప్రధాన సేన లగ్గలికం జించి చెండాడుచు నా దండి మగలును జేకితాన ప్రభద్రకులును రౌద్రరసంబునం బెనఁచినఁ గనుంగొని మదంబునం బొదలి యొత్తరించి యురవడించిన. | 343 |
| శా. |
వంగాధీశుఁ గరీంద్రుతో నడఁగ గర్వస్ఫూర్తి శైనేయుఁ డే యం గేలీగతి మాద్రి లేఁగొడుకు పౌండ్రాధీశ్వరుంగిట్టి యా భంగిం గూల్పఁ దదగ్రజుం డటుల దర్పం బొప్ప సుహ్మాధి నా థుం గోపంబునఁ ద్రుంప నేచెఁ గరటిస్తోమంబు లంతంతకున్. |
344 |
| క. |
విను మ ట్లేచి నకులుఁ బొది | వె నుదగ్రధ్వని ననేక వేదండములం దెనిమిదిటిఁ గూల్చె బాణము | లెనిమిది యెనిమిదులఁ దమ్ముఁ డేడ్తెర నధిపా! |
345 |
| క. |
ఆ ధృష్టద్యుమ్నాదులు | గ్రోధాంధత నడరి యేనుఁగుల నస్త్రహతిన్ వ్యాధూతములుగఁ జేయుచు | రాధేయుం గదియ సంగరము పేర్చె నృపా! |
346 |
| వ. | ఆ సమయంబున శోణితంబు పెల్లున మున్నెగసిన రేణు వడంగిన నిరువాఁగు సైనికులును దమతమ యడియాలంబులతోడి గొడుగులును సిడంబులును బెద్దయు మెఱయఁ బెనంగుచుండ సంశప్తక సంచయంబు గించిదవశిష్టంబుగా నష్టంబుసేసిన సవ్యసాచికి శౌరి యక్కౌరవ పాండవ బలంబుల పోరు సూపి యప్పుడు దుర్యోధనుండు దనయందుఁ జేయంగలవారును దానును ధర్మనందనుం బట్టు తలంపున బెట్టు పొదువుటయు నమృతంబున కాసపడి యడరు నసురుల మరల్చు శక్రాగ్నుల చందంబున భీమసేనుండును సాత్యకియు వారలం బ్రతిహతులం జేయుటయు, నంత నిలువక యక్కురువిభుండును గర్ణ కృపాశ్వత్థామలును నుద్దామగతి నయ్యిరువుర శరజాలంబుల నమ్ముల జడియుచుం గదిసి యక్కౌంతేయాగ్రజు కంకటంబు ద్రుంచివైచుటయుఁ గర్ణు నుత్సాహంబునం గడంగు ధార్తరాష్ట్రుల సింహనాదంబులకుం దెరలక మరుత్సుతుండు మండలప్రచారుం డగుటయు నా సూతనందనుండు మొదలగు నమ్మేటిమగల మార్గణమ్ము లమ్మనుజపతిపైఁ బరఁగుటయు నకుల సహదేవ సాత్యకి ధృష్టద్యుమ్న ద్రౌపదేయ ప్రభృతులైన పాండవేయ పాంచాలాది యోధులం గలంచి యక్కర్ణుండు కమలాకరంబునం గేలిసలుపు శుండాలంబు లీల నటించుటయు నవ్వీరుం డగ్గలిక నక్కవ్వడి రాక గోరి కపికేతనం బాలోకించుటయుం గలిగిన యప్పరిపాటి యంతయు నేర్పడం జెప్పి యా రాధేయు రభసం బుగ్గడించి మఱియు నిట్లనియె. | 347 |
| క. |
‘నినుఁ దలపడఁజూచిన యీ | తని యేడ్తెఱ మంట సొరఁగఁ దలఁచు మిడుత యు బ్బున కెనయై నాకుం దోఁ | చినయది మ్రందింపు మితని శితవిశిఖములన్.’ |
348 |
| వ. | అని పలికి యతని కప్పుడు దోడ్పడ నుత్సహించు భవత్సుతు నుపలక్షించి బీభత్సునకుం జూపి. | 349 |
| ఉ. |
‘ఇత్తఱిఁ ద్రుళ్ళు సూపి నిను నేపున మార్కొని గెల్తు నన్ తలం పెత్తి సుయోధనుం డదె యహీనబలంబులఁ గూర్చెఁ గర్ణుతో మత్తగజంబులీల నెలమామిడిఁ గూల్చినభంగిఁ బాండు పు త్రోత్తమ! వీనిఁ గూల్పు; మతఁ డొంటిగ రాజ్యము నీకుఁ జేకుఱున్.’ |
350 |
| వ. | అను నవసరంబున. | 351 |
| మ. |
సమదాటోపత వాయునందనుఁడు ధృష్టద్యుమ్న శైనేయు లే కమనోవృత్తిఁ గడంగి తో నడర దోర్గర్వంబు శోభిల్ల శౌ ర్యము సొంపార నిలింపకోటి వొగడన్ రారాజు సైన్యంబు లొ క్కొ మొగిం బెల్లగిలంగ బెట్టడరె సక్రోధాంతరంగంబుతోన్. |
352 |
| క. |
అడరి పటు బాణజాలం | బడరింపఁగ వారిబలము లధికరయము నె క్కుడు మదము నొలయఁ బైకొని | బడలువడఁగఁజేసె నీదు బలముల నధిపా! |
353 |
| క. |
వడిఁ బొదివి భీముఁ డార్చినఁ | జెడ విఱిగిన సేన నేమి సెప్పుదుఁ దన దొం దడిఁ దాన చదిసె వెనుకొను | కడిఁదిమగలచేత గాసి గాదె నరేంద్రా! |
354 |
| ఉ. |
మ్రొగ్గెడు వాహనంబులును, మోములు వాడఁగ వాహనంబుల న్డిగ్గి తలంగు సైనికులు, నేలకుఁ గష్టపుఁజొప్పు సొప్పడం ద్రగ్గు సిడంబులుం, గులముఁ దన్నుఁ దలంచి యెదిర్చి యొంటిమై మ్రగ్గెడువారు నై కురు ధరావరు సైన్యము రూపుమాయఁగన్. |
355 |
| ఆ. |
పావనికి నిషాదపతి నందనుఁడు మాఱు | కొనిన నాతఁ డతని కుంజరంబు కరముతోఁ దదీయ కరములు శిరమును | నఱకె శితశరములు నాలుగింట. |
356 |
| క. |
మూఁ డక్షౌహిణు లిమ్మెయిఁ | బోఁడిమి సెడి పాఱఁ బవనపుత్రుని యెదురన్ వేఁడిమి సూపఁగ నొకఁడు | న్వాఁడిమగఁడు లేఁడ; యేమనం గల దధిపా! |
357 |
| వ. | ఇవ్విధంబున విక్రమించిన భీమసేను బరవసంబును దదీయసైనికుల సంరంభంబునుం బద్మనాభుండు ఫల్గునునకుం జూపి చెప్పె ననిన విని సంజయునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. | 358 |
| క. |
‘నీ చెప్పెడుమెయి సూడఁగ | నీచత వాటిల్లె మన యనీకమునకుఁ దా రే చేటు సెడిరొ కౌరవు | లా చరిత ముపన్యసింపు మంతయుఁ దెలియన్.’ |
359 |
| క. |
అనవుడు నతఁ డిట్లను న | మ్మనుజపతికి ‘హితులు సెప్ప మానక నీచే సిన దుర్ణయమునఁ జేటొం | దెను; వగవక రణము వినుము ధీరవిచారా!’ |
360 |
| వ. | ఇట్లు భీము కడంక గని కవ్వడి దన మునుము కొంచెము మూఁకలం దోలి మగిడి మన సేనల మర్దించుటకుం దమవారిఁ జేరంజనఁ గౌరవపతి యమ్మారుతి మార్కొని. | 361 |