| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు కర్ణుండు గౌంతేయాగ్రజు విడిచి, దుర్యోధన సంరక్షణంబునకుం జనుటవిని, ధృతరాష్ట్రుండు దన మనంబున. | 2 |
| క. |
‘అనిలజునకుఁ జాలఁడె నా | తనయుఁడు? మోసంబుగాక ధర్మజుఁ డ ట్ల బ్బినఁ బో నిచ్చుట రాధా | తనయునకున్ బుద్ధి యగునె? తప్పెం దప్పెన్!’ |
3 |
| వ. | అని వగచి, ‘యుధిష్ఠిరుండు సనినపిదప నెత్తెఱంగున సంగరంబు సెల్లె?’ నని యడిగిన, సంజయుం డతని కి ట్లనియె; నట్లు సని యా ధర్మతనయుండు రథావతరణంబు సేసి శిబిరంబు ప్రవేశించి, సెజ్జ నొడలు సేర్చి, నాటియున్న యమ్ములు పెఱికించుకొని, హృదయంబున నమ్మెయి నున్న పరిభవంబు పీడ యొనర్ప, విషాద వివర్ణవదనుం డగుచుఁ గవలం గనుంగొని- ‘మీరు సమీరనందనుకడకుం జనుం’ డని చెప్పె., నటమున్న నకులుం డొక్కయరదం బాయితంబు సేసికొనియుండుట, నయ్యిరువురుఁ ద్వరితగతిం జని, యంబుదంబు చందంబున గర్జిల్లుచుఁ గౌరవులతోడం గయ్యంబు సేయుచున్న భీమసేనుఁ జేరం జని, యవష్టంభ విజృంభణంబునం బొలిచి; రంత నప్పాండవాగ్రజు తెఱం గేమియు నెఱుంగక నరుండు ద్రౌణితోడ భరంపడి రణం బొనర్చుచుండి. | 4 |
| క. |
నెఱి దగఁ దేజితమై, గమి | మెఱుఁగు లడరు నారసమున మిక్కిలివడి నే డ్తెఱ మెఱయ నురము నొంచిన | నుఱ కవ్విప్రుండు వైచె నుగ్రంపు గదన్. |
5 |
| వ. | వైచిన నవ్వీరుండు. | 6 |
| చ. |
అది దునుమాడి, మేనఁ బదియమ్ములు గ్రమ్మఱఁ గ్రుచ్చి, సూతు బె ట్టిద మగు కోలఁ గూల్చినఁ, గడింది మగంటిమి దాన రథ్య సం పదయును నూలుకొల్పికొని పార్థునిఁ గృష్ణుని నొంచె విస్మయం బొదవఁగ దేవకోటికి నృపోత్తమ! యగ్గురుపుత్రుఁ డుగ్రుఁ డై. |
7 |
| వ. | అ ట్లద్భుతవిక్రమంబున నశ్వత్థామ విజృంభించిన సహింపక; | 8 |
| చ. |
హయములు పగ్గముల్ వెడఁదయమ్మున నుగ్గుగఁ గ్రీడి యేయుడున్ రయమున నీడ్చెఁ దే రటు దురంబునకుం దొలఁగంగ; నెంతయున్ భయమున నీమొనల్ గలఁగి పాఱె; నరేశ్వర! వారిసైన్యసం చయ మెగవన్ మహీతలము సంభృతకంపము గాఁగ నల్గడన్. |
9 |
| ఉ. |
పాఱినఁ జూచి, కౌరవ నృపాలుఁడు సూతతనూజుతోడ ‘నీ కాఱియ మద్బలంబునకుఁ గాఁ దగునే వివిధాస్త్ర సంపదన్ మీఱిన నీవె సూడఁగ? నమేయపరాక్రమ,! నీకుఁ బాండవు ల్మాఱె తలంప, నీదగు బలంబును జేవయుఁ జూపు మిత్తఱిన్!’ |
10 |
| వ. | అనిన విని, యబ్బలుమగండు మదోద్రేకంబున మద్రపతి నాలోకించి యిట్లనియె: | 11 |
| చ. |
‘కనుఁగొను! మిప్పు డేను మురఘస్మరుఁ బార్థుని భీమసేనునిం దునిమెద; నస్త్రసంపదయు దోర్విభవంబును శౌర్యసారము న్జనులకు నెల్లఁ దెల్లముగ నాదగు పూనిక పార మెయ్ద; మే దినిఁ గురునాథుఁ డొక్కఁడె యతిస్థిరసౌఖ్యత నేలునట్లుగన్.’ |
12 |
| వ. | ‘రథరథ్యగతులు నెఱయ మెఱయ వలయుం జుమ్మీ!’ యని పలికి, విజయంబు వీక్షించి గుణంబు సారించి ‘గాండీవంబు నీ కెదురే?’ యని యగ్గించి, యప్పుడు పై పయి నురవడించు పరసైనికులం జే యెత్తి యదల్చి, భార్గవాస్త్రంబు ప్రయోగించిన నమ్మహనీయసాధనంబు. | 13 |
| శా. |
ఘోరానేకశరాకృతిం బరఁగి సంక్షోభంబు గావించుచుం, దేరుల్ ద్రుంగఁగ, వారణంబులు ధరం ద్రెళ్ళంగ, నశ్వాళి ను గ్గై రక్తంబునఁ దేలఁగా, భటచయం బత్యంత చూర్ణీకృతా కారత్వంబు భజింపఁ, గేళి సలిపెం గౌంతేయ సైన్యంబునన్. |
14 |
| వ. | ఇప్పరుసున భార్గవాస్త్ర బాధితంబై యప్పాండవ బలంబు వెఱచఱచి మరలి పఱచిన, మనమూఁకలు వెన్నడిం దఱుమ, నా సూతనందనుం డ ట్లేచి యార్చి యంటందాఁకి విశిఖశిఖలు నిగిడించుచుఁ, బొగ లేనిమంట పగిదిఁ బ్రదీప్తుం డయినఁ; దదుత్సాహంబున కోటువడి యా సైన్యంబును జనంబులు హాహాకారంబు లెసఁగ దీనదశం బొంది, ముకుంద పురందరనందనులం బేర్కొని యాక్రందించి; రట్టియెడ. | 15 |
| ఉ. |
గాండివి శౌరి కిట్టులనుఁ: ‘గర్ణునిఁ జూచితె? యేకవిక్రమో ద్దండతఁ దెంపు సేసి పటుదర్పము సూపుచుఁ, దేఱి చూడ రా కుండెడునట్లుగా నలుక నుగ్రత మండెడు; నిప్డు నేర్పుమై నుండక యీసునం దొడరి, యోటమి దెచ్చికొనంగ నేటికిన్?’ |
16 |
| క. |
‘వచ్చిన మఱి గెల్పు గొనన్ | వచ్చునె? తనయొడలు గలుగ వైరుల గెలువన్ వచ్చుం దఱి వచ్చిన; నది | మెచ్చు జయార్థులకు మరుదమిత్రధ్వంసీ!’ |
17 |
| తే. |
‘పట్టపగలింటి సూర్యుని పగిదిఁ గర్ణుఁ | డుగ్రమూర్తియై వెలుఁగుచు నున్నవాఁడు! మన రథం బిప్డు మాధవ, మరలనిమ్ము | బ్రదికియుండిన శుభములు వడయవచ్చు.’ |
18 |
| వ. | అనిన విని, వాసుదేవుండు వడముడిదిక్కు విలోకించు నెడ, నతండు కర్ణునకు మార్కొని పరాక్రమించె. పాండవసైన్యంబు నిలువరించి, ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి ద్రౌపదేయాదిరథికు లా రథికునిం దలపడఁ, దానును గౌరవులపయిం గడంగె; న ట్లమ్మేటిమగని యాటోపం బప్పటికి వైరినివారణంబునకుఁ జాలి యునికి యనుసంధించి, రాధేయుం డొరులతో డయ్యం బోరుటయుఁ, బార్థుండు ‘డప్పి దీర్చుకొనుటయు మేలకాక’ యని యూహించి, యమ్మురారి దే రక్కురుసేనాధిపతి సంగ్రామంబు సేయుచక్కటి కెడ గలుగం గొని చని, యన్నరునితో ‘మన మశ్వత్థామతోడి పెనఁకువం జిక్కిన సమయంబున ధర్మనందనుండు సూతనందనున కగ్గమై యుండె; నాతం డతనియమ్ముల నొచ్చెనో యని తలంచెద. నయ్యవనీశు నవస్థ యెఱింగి, మఱి నీ వయ్యంగరాజు సమయింపం గల వాఁడ’ వనుటయు. | 19 |
| ఆ. |
అన్న నొచ్చె నన్న యమ్మాట చిత్తంబు | గలఁప, నిజబలంబుఁ గలయఁ జూచి, యన్నరేంద్రుఁ గాన కనిలనందను కడ | కేఁగి యడిగె; నతఁడు నిట్టు లనియె. |
20 |
| ఉ. |
‘కౌరవకోటి నేఁ బొదివి క్రందుగఁ గయ్యము సేయఁ, గర్ణుఁ డా భూరమణున్ వడిం గదిసి భూరిశరంబులు మేన నింప, నొ వ్వారుటయుం దొలంగె నతఁ, డాహవరంగమునందు లేఁడు; నీ వారయు మింత కె ట్లగునొ? యచ్యుతుఁ డుండఁగ నట్టు లే లగున్?’ |
21 |
| వ. | అనిన వివ్వచ్చుండు వృకోదరున కిట్లనియె. | 22 |
| క. |
‘క్రూరము లగు సూతసుతుని | నారాచము లొడలఁ బెక్కు నాటినఁ జేత స్సారము సెడి శిబిరమునకు | నా రా జేఁగెనొకొ? యకట! యటు గా నోపున్. |
23 |
| క. |
‘ద్రోణాచార్యుని యుగ్రపు | బాణంబులు కోర్చి యతఁడు పడునంతకు న క్షీణధృతి నసమ సమర | క్షోణి నిలిచి, కర్ణుచేతఁ గోల్పోయెఁ గదే!’ |
24 |
| వ. | అని పలికి, యనిలనందను నాలోకించి యన్నరుం ‘డా నృపాలుతెఱం గెఱుంగుటకు నీ వరుగు; మేను సేనమొగంబున నిలిచెద’ ననిన విని, యవ్వీరుం ‘డవ్విధంపు నడవడి నీకుఁ జనుం గాని, జనంబులు న న్నయినం బోరి కోహటించి పోయె నని యాడుదు’రని చెప్పిన, నప్పార్థుండు. | 25 |
| ఆ. |
‘సరభసముగ నన్ను సంశప్తకులు వీరె! తొడరుచున్నవారు, దొలఁగి నాకు నరుగ నెట్లు వచ్చు?’ నని చూపె నతనికి; | నపుడు గడఁగి వచ్చు నబ్బలముల. |
26 |
| క. |
చూపుటయు, నగ్గలం బగు | నేపునఁ గిమ్మీరవైరి ‘యేన కలఁచెదన్ రూపు సెడఁగ నిమ్మొనలను | భూపతి నరయంగ నీవ పొ’ మ్మనియె నృపా! |
27 |