పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
బోయ లర్జును నోర్చి యాదవాంగనల సొమ్ముల నపహరించుట (సం. 16-8-50)
సీ. కనుఁగొని జంభారితనయుఁ డోరోరి యీ | ప్రజ కేన చుండు సంరక్షకుండఁ
దొలఁగి పొం డడియాస నొద్దకు వచ్చినఁ | దలలేఱి యుర్వికి బలియొనర్తు
నని యదల్చినను వా రఱవాయిగొనక య | ప్పలుకులన్నియును రజ్జులుగఁ గొనుచుఁ
జామల నచట నచ్చట నొల్చికొనఁగ నా | లోకించి యవ్వీరలోకవరుఁడు
 
తే. గాండివం బెక్కువెట్టి ప్రచండబాణ | నికర మక్కిరాతుల మీఁద నిగుడఁ జేయ
నలఘుచర్మసంవృతగాత్రు లగుచుఁ దుచ్ఛ | బాణపాషాణలగుడముల్‌ పరఁగఁ జేసి.
185
క. ఆ బోయలు నిర్భయమతు | లై బీభత్సుపయిఁ గవియ నతఁడు మహాస్త్ర
ప్రాబల్యంబును మెఱయుటఁ | దా బుద్ధిఁ దలంచి మంత్రతతిఁ దోఁపమికిన్‌.
186
క. ఇది దైవ విరోధం బని | మదిఁ దానూహించి ప్రకృతిమార్గణములు బె
ట్టిదముగ నేయఁగ నవియం | దుదముట్టఁగ రిత్తలయ్యె దొనలు నరేంద్రా!
187
సీ. అప్పుడు కాలపర్యయమున కాశ్చర్య | మును విషాదముఁ దన మనములోనఁ
బరిగొన బహువిస్ఫురణకోదండ దం | డమున నా బోయల సమదవృత్తి
నెట్టకేలకు నొకయెడ మాన్చి రుక్మిణి | యాదిగాఁ గల కృష్ణు నగ్రమహిషు
లెనమండ్ర బలదేవు వనితల మఱియును | గతిపయ యాదవాంగనలఁ గాచెఁ;
 
తే. దక్కుఁ గల యింతిగముల నా దస్యులడరి | పట్టికొని యేచి వీ డెల్ల బన్నపడఁగ
దొద్దగొని రథకుంజరతురగతతులు | దమకు వలవకునికి దిగఁ ద్రావి చనిరి.
188
క. ఇమ్మాడ్కిం బరివోయిన | యమ్మొత్తము నడపికొనుచు నతిదైన్యము చి
త్త మ్మలఁపంగఁ గురుక్షే | త్రమ్మునకుం జనియె నరుఁడు ధరణీనాథా!
189
క. చని యచట నచటఁ దన్నుం | గను నాప్తజనంబుతోడఁ గాలవశత్వం
బునఁ బొందిన దుర్దశఁ దగ | వొనర నతఁడు సెప్పఁ జొచ్చె మురివిన మదితోన్‌.
190
సీ. కోపించి గాంధారి శాప మిచ్చిన యది | యాదవసంక్షయ మగుట యెట్లుఁ
దప్పదు; మనము తద్బాలవృద్ధ స్త్రీజ | నంబుల నెల్ల నర్హంబు లైన
ఠావుల సత్ప్రతిష్ఠావిశోకంబులఁ | గాఁ జేయవలయు; నక్కాలమునకు
నొదవి యత్తెఱఁగున కుత్సహించుట కృత్య | మర్జున!’ నీ కని యాడుచుండుఁ
 
ఆ. బలుమఱును దలంచి పాండవాగ్రజుఁ డది | కారణముగ నతని కరుణ పెంపు
నొప్పు నెఱుఁగుఁ గాక యిప్పార్థుఁ డయ్యదు | నికర శేషజనుల నెమ్మి నిలిపె.
191
సీ. నిలిపిన తెఱఁగెల్ల నృపవర! చెప్పెద | విను కృతవర్మనందనునిఁ జూచి
‘నీ తల్లియును నీవు నీతోడఁబుట్టిన | వారును మృత్తికావతపురమున
నిలుఁ’ డని బహుసంపదలఁ బొల్చు నప్పట్ట | ణంబుఁ దదీయదేశంబు నిచ్చి
యభిషిక్తుఁ జేసిన నాతండు నిజపరి | జనములు దాను హర్షం బెలర్ప
 
తే. నందుఁ బోయె; సరస్వతి యనఁగఁ బరఁగు | ఘననగరమున సాత్యకి తనయు నట్ల
నెయ్యమును గారవంబును నెఱయ నిలిపి | యనుప ముదమున నందుల కతఁడు చనియె.
192
సీ. తక్కటివారి నింద్రప్రస్థనగరంబు | నకుఁ గొని చని వజ్రు నాథుఁ గాఁగ
నందుఁ బట్టము గట్టి హస్తితురంగ ర | థంబుల విభజించి తగిన భంగి
నమ్మువ్వురకును సమర్పితంబులు సేసి | యయ్యయి బంధుల నందు నందు
నందును నిలుచు నట్లొందఁగ నియమించి | యక్రూరుభార్యల నాత్మజులను
 
తే. వజ్రునకు నప్పగించె; నవ్వాసుదేవు | పౌత్రుఁ డతి వినయంబునఁ బట్టువఱుప
వారు నిలువక పోయిరి వలచు నెడకు; | దాని విని యూరకుండె భీమానుజుండు.
193
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )