| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అనిన విని భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. | 122 |
| క. |
ఆరంభరహితుఁ బొందునె | యారయ సంపదలు? హీనుఁ డయ్యును బురుషుం డారంభశీలుఁ డయి యకృ | తారంభుల నోర్చు నెంత యధికుల నయినన్. |
123 |
| క. |
కడు నధికుతోడఁ దొడరినఁ | బొడిచిన నొడిచినను బురుషు పురుషగుణం బే ర్పడుఁగాక, హీను నొడుచుట | కడిఁదియె? పౌరుషము దానఁ గలుగునె చెపుమా! |
124 |
| క. |
ఈహరి కరుణయు నర్జును | సాహాయ్యముఁ గలుగ నీ ప్రసాదమున జగ ద్ద్రోహు జరాసంధు మహా | సాహసు వధియింతు నుగ్ర సంగ్రామమునన్. |
125 |
| తే. |
అనఘ! యేము మువ్వురము మూఁడగ్నులట్లు | నీ మహాయజ్ఞ కార్యంబు నిర్వహింతు మా జరాసంధ పశువున నఖిల శాత్ర | వాహుతులఁ జేసి తృప్తుల మగుచు బలిమి. |
126 |
| వ. | అనిన భీమసేను విక్రమవచనంబుల కనుగుణంబుగా నర్జునుం డిట్లనియె. | 127 |
| ఉ. |
భూభుజులన్ జయింపుము, విభూతి నొనర్పుము రాజసూయమున్, నాభుజ వీర్య విక్రమ గుణంబులకుం దగుచున్న యీ ధను ర్లాభము, దివ్య బాణరథలాభము, శోభితమైన యీ సభా లాభము నొండుపాట సఫలత్వముఁ బొందునె కౌరవేశ్వరా! |
128 |
| క. |
కలరూప గుణ ద్రవ్యం | బులు విక్రమవంతునందు భూవిదితములై నిలుచు నవిక్రమునకు నవి | గలిగియు లేని క్రియ నప్రకాశంబు లగున్. |
129 |
| వ. | ‘మఱియు రాజసూయ మహాధ్వరంబు కారణంబుగాఁ బరాక్రమంబున జరాసంధు వధియించి నిఖిల క్షత్త్రియ నిగ్రహ మోక్షణంబు సేయునంతకంటె మిక్కిలి యశోధర్మంబు లొండెవ్వి?’ యనిన భీమార్జునుల పలుకులకు సంతసిల్లి నారాయణుం డి ట్లనియె. | 130 |
| క. |
వెలయ విధిదృష్ట నయమున | వలయుఁ బరాక్రమము సేయ వసుధేశ్వర య గ్గల మగు బుద్ధియుఁ గడఁకయుఁ | గల పురుషుల కిదియె చూవె కర్తవ్య మిలన్. |
131 |
| వ. | ‘కావున మేము మువ్వురముఁ గ్రమంబునం బరాక్రమించి జరాసంధుడాసి నదీప్రవాహంబులు వృక్షోన్మూలనంబు సేయునట్లు క్రమంబున వాని నిర్మూలితుం జేసెద; మద్దురాత్ముండు భూతంబులయం దంతరాత్మయుం బోలెఁ దన యంతరం బెఱుంగక యేకాంతశీలుఁడై సుఖం బనుభవించుటం జేసి వాని యంతికంబున కరుగుట యశ్రమం’ బనిన నారాయణునకు ధర్మరా జిట్లనియె. | 132 |
| క. |
దనుజాహిత! నీ కాహవ | మున నెదిరి మహోగ్ర దహనమునఁ బడియును గా లని మిడుత వోలె నతికో | పనుఁడు జరాసంధుఁ డెట్లు బ్రదుకఁగ నేర్చున్? |
133 |
| క. |
అట్టి యతి దారుణత్వము | నట్టి యజేయ భుజ విక్రమాధిక్యము వాఁ డెట్టి క్రియఁ బడసె; నాతని | పుట్టిన విధ మెట్లు చెప్పు పొలుపుగ నాకున్. |
134 |