| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| ఆ. |
ఎత్తికొని చనంగ నిమ్మగు నట్లుగా | మెదలుచున్న వ్రయ్య లదిమి రెంటిఁ గూడఁబట్టె; నవియుఁగూడి యొండొంటితోఁ | జక్క నంటి రెండు నొక్కఁడయ్యె. |
148 |
| క. |
ఆ రాక్షసి కెత్తికొనన్ | భారముగా వజ్రకఠిన బంధురతనుఁ డై ధీరుఁడు బాలకుఁ డేడ్చె మ | హారవమున దాని చేతు లాడకయుండన్. |
149 |
| వ. | అబ్బాలకు రోదన ధ్వని విని యంతిపురంబున నున్న ముదుసలి యవ్వలెల్లం బఱతెంచి మహాహర్షంబుతో వాని నెత్తికొని; రట్టి సంభ్రమం బెఱింగి బృహద్రథుండు వచ్చి తేజోధికుండయి తామ్రతలముష్టిం దనముఖపద్మంబునం బెట్టికొని దిక్కులు సెలంగ నేడ్చుచున్న కొడుకుం జూచి కృతార్థీకృత లోచనుం డయ్యె; నట్టి యవసరంబున నా రాక్షసి కామరూపిణి గావున మనుష్య స్త్రీరూపధారిణి యయి యమ్మగధరాజున కి ట్లనియె. | 150 |
| తే. |
ఏను జరయను రాక్షసి, నిప్పురంబు | చదుకమునఁ బాయకుండుదు, సంతతంబు నీకు నిష్టంబు సేయంగ నెమ్మితోడఁ | గోరుచుండుదు, నది సమకూరె నేఁడు. |
151 |
| వ. | ‘నీ యిద్దఱు దేవులకు నుద్భవిల్లిన యిమ్మనుష్య శకలంబులు రెండును నీదాదులు దెచ్చి యిచ్చదుకంబు నొద్ద నొక్కచో వైచి పోయిన నేను వానిం గూడఁబట్టుడు నప్పుడు వజ్రఘన ఘటిత కఠిన శరీరుండై యిక్కుమారుండు మేరుగిరి శృంగంబునుంబోలె నా కెత్తికొన నశక్యుం డయ్యె; వీని నొప్పుగొను’ మనిన విని బృహద్రథుండు ముదితహృదయుం డయి దాని కి ట్లనియె. | 152 |
| ఉ. |
ఇచ్చకు వచ్చు పూజనల నెంతయు సంతసమంది తొల్లి నా కిచ్చె మునీశ్వరుండు దయ నిత్తనయున్; మఱి యిప్డు నెమ్మితో నిచ్చితి వీవు రాక్షసివె! యిక్కులమెల్లను నుద్ధరింపఁగా వచ్చిన పుణ్యదేవతవు వారిరుహాయతచారులోచనా! |
153 |
| వ. | అని దాని నతిప్రీతిం బూజించి కొడుకు నెత్తికొని దేవీద్వయంబునకు నిచ్చి, జర యను రాక్షసిచేత సంధింపఁబడినవాఁడు గావున జరాసంధుం డను పేరిడి. పురం బష్టశోభనంబు సేయించి, యా రాక్షసి కేఁటేఁట మహోత్సవంబు సేయించుచుం గొడుకు నతి గౌరవంబునం బెంచిన. | 154 |
| క. |
ఈహిత విధానముల లో | కాహిత దుస్సహనతేజుఁ డయి వాఁడు మహో త్సాహముతో వర్ధిల్లె ఘృ | తాహుతులఁ బ్రవృద్ధి నొందు నగ్నియపోలెన్. |
155 |