| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
ద్వారవతినుండి జగదా | ధారుఁడు గృష్ణుండు వచ్చి ధర్మజు ధర్మ ప్రారంభనిత్యు నుత్తము | భూరిధనంబులను రత్నములఁ బూజించెన్. |
274 |
| వ. | ధర్మరాజును జగదర్చితుం డయిన యచ్యుతు నర్ఘ్యాదివిధులం బూజించి తమ్ములయు ధౌమ్య ద్వైపాయనాదులయు ఋత్విజులయు నాప్తమంత్రులయు సమక్షంబున నధోక్షజున కి ట్లనియె. | 275 |
| మత్తకోకిల |
ధారుణీధర! ధర్మతత్త్వనిధాన! దానవదర్ప సం హార! వారిజనాభ! బంధుజనానురంజనకారి! నీ కారణంబునఁ జేసి మాకు జగంబునం గల భూపతుల్ భూరివిక్రమవశ్యు లైరి విభుత్వ మేర్పడుచుండఁగన్. |
276 |
| క. |
క్షితిపతులవలన సముపా | ర్జితమైన ధనంబు కొలఁదిఁ జెప్పఁగ వాచ స్పతికి నశక్యము; దీనిం | బ్రతిపాదింపంగవలయుఁ బాత్రవశమునన్. |
277 |
| వ. | ‘దేవముఖం బైన యగ్నిదేవుముఖంబున విధ్యుక్తంబుగా వేల్చి, దేవతర్పణంబును, యథోచితదక్షిణల నభీష్టదానంబుల మహీదేవ తర్పణంబునుం జేయవలయుం గావున నీ కిష్టంబయిన యజ్ఞంబు చేయించి, నాకును, లోకంబులకుం బ్రియంబు సేయు; మొండె నన్ను రాజసూయాధ్వర విధానంబునందు నియోగించి యనుగ్రహింపు’ మనిన యుధిష్ఠిరునకు నారాయణుం డి ట్లనియె. | 278 |
| ఉ. |
పూజ్యుఁడ వెల్ల వంశముల భూపతులందును, ధర్మ నిర్మల ప్రాజ్యవిభూతి నద్దివిజపాలకు నట్టిఁడ నీక యొప్పె సా మ్రాజ్యము దైవసంపదయు మానుషసంపదపేర్మి కావునన్ యాజ్యుఁడ విప్డు నీవ భరతాన్వయభూషణ! ధర్మనందనా! |
279 |
| క. |
పంపం దగుఁ దగ దని శం | కింపక నీ కిష్టమయిన కృత్యముల నియో గింపుము నన్ను భవద్గుణ | సంపత్ప్రవణుల సమస్తజనుల జనేశా! |
280 |
| చ. |
అనిన నుపేంద్రువాక్య మను నయ్యమృతంబునఁజేసి ధర్మనం దనుఁడు ముదంబు నొంది ‘విదితంబుగ నాకు మనోరథంబు లె ల్లను సమకూరె నిప్డు, సఫలత్వము నొందె ధనాగమంబు’ లం చును నెడ నిశ్చయించె మధుసూదనదేవు ననుగ్రహంబునన్. |
281 |