| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
అవిలంఘనీయ మీదు | ర్వ్యవసాయం బనుచు సత్యవచనుఁడు ధర్మా ర్థవిదుం డప్పుడు ధృతరా | ష్ట్రవిధాతృనియోగమున కొడంబడి యంతన్. |
154 |
| క. |
ఇంద్రప్రస్థపురంబున | కింద్రగురుప్రతిభుఁ డరిగి యింద్రసమానుం జంద్రయశు ననుజసహితు నృ | పేంద్రుని ధర్మసుతుఁ గాంచె నెంతయుఁ బ్రీతిన్. |
155 |
| వ. | అతనిచేత నభ్యర్చితుం డయి కుశలం బడిగి నిజాగమనప్రయోజనం బెఱింగించిన విని, విదురునకు ధర్మతనయుం డి ట్లనియె. | 156 |
| సీ. |
‘పుత్త్రవత్సలుఁడు విచిత్రవీర్యాత్మజుఁ | డార్యుండు ధృతరాష్ట్రుఁ డాదరించి నిన్ను నియోగించె నన్నుఁ దోడ్కొని తేర; | నీవును వచ్చితి నెమ్మితోడ; లాలితాపూర్వసభాలోకనంబున | యందు జూదంబు కార్యంబె? చెపుమ; జూదంబు కతమున భేదంబు గాకుండ | నేరదు మాలోన; నీనియోగ |
|
| ఆ. |
మనఘ! మా కలంఘ్య మయినట్లు ధృతరాష్ట్రు | పనుపుసేయ నీకుఁ బాడి యదియ’ యనుచు విధినియుక్తుఁ డయి యప్డు విదురుతో | నేఁగ నిశ్చయించె నిందుకులుఁడు. |
157 |
| క. |
అనుజులు ద్రుపదాత్మజయును | ననుచరముఖ్యులును ధౌమ్యుఁ డాదిగ విద్వ జ్జనులును దోఁ జనుదేరఁగ | నినసన్నిభతేజుఁ డరిగె నిభపురమునకున్. |
158 |
| వ. | అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్త్రశతంబుతో భీష్మశల్య శకుని సైంధవ కర్ణ గౌతమ ద్రోణాశ్వత్థామ సోమదత్త సమేతుండయి యున్న ధృతరాష్ట్రునకు భానుమతీ ప్రభృతిస్నుషా పరివృతయయి తారకాపరివృత యయి యున్న రోహిణియుంబోలె నున్న గాంధారీదేవికిఁ గురువృద్ధజనులకు నతివినయంబున ననుజ సహితుండయి ధర్మతనయుండు మ్రొక్కె; నంత ద్రుపదరాజనందనయు గాంధారికి మ్రొక్కిన, నక్కోమలిం జూచి గాంధారికోడం డ్రెల్లను విస్మితలయి. | 159 |
| తే. |
‘అఖిలలావణ్యపుంజంబు నబ్జభవుఁడు | మెలఁతగా దీనియందు నిర్మించె నొక్కొ! కానినాఁ డిట్టి కాంతి యే కాంతలందు | నేల లే?’దని సామర్షహృదయ లయిరి. |
160 |
| వ. | ఇట్లు పాండవ కౌరవు లతిప్రణయగౌరవంబున నద్దివసంబు సలిపి రంతఁ బ్రభాతంబ. | 161 |
| ఉ. |
ఆ ధృతరాష్ట్రుచేసిన యనర్ఘమణిప్రకరానుబద్ధ శో భాధృతి నొప్పుచున్న సభ పార్థివముఖ్యుఁడు ధర్మజుండు దు ర్యోధనుఁ డర్థిఁ జూపఁగ సహోదరవీరులుఁ దానుఁ జూచి ల క్ష్మీధరమూర్తి యెంతయును మెచ్చె మనంబునఁ దద్విభూతికిన్. |
162 |
| వ. | అయ్యపూర్వసభామణి కుట్టిమంబున నందఱు సుఖాసీనులయి యిష్టసంభాషణాది క్రీడావసరంబున నున్నంత దుర్యోధనుండు యుధిష్ఠిరున కి ట్లనియె. | 163 |
| క. |
అనఘ! సుహృద్ద్యూతం బిం | దొనరింతము ప్రొద్దువోకయును నగు, జూదం బునకుం బ్రియుఁడవు దక్షుఁడ | వన విందుము నిన్నుఁ బ్రీతి నక్షజ్ఞులచేన్. |
164 |
| వ. | అనిన వానికి ధర్మతనయుం డి ట్లనియె. | 165 |
| తే. |
క్షత్త్రనీతిక్రమంబులు గావు సూవె | నికృతియును జూదమును; ధర్మనిత్యులైన వారి కీ రెండు వర్జింపవలయు నెందుఁ; | బాపవృత్తంబు జూదంబు పార్థివులకు. |
166 |
| ఆ. |
కుటిలమార్గు లయిన కుత్సితకితవుల | తోడఁ గడఁగి జూదమాడఁ జనదు; దానఁజేసి యర్థధర్మవివర్జితు | లగుదు రెట్టివారు జగములోన. |
167 |
| వ. | ‘మఱియు మాయాద్యూతంబున జయించుట మహాపాతకం బనియును, ధర్మద్యూతంబున జయించుట ధర్మయుద్ధంబున జయించు నంతియ పుణ్యం బనియును నసితుండయిన దేవలుండు చెప్పె’ ననిన నయ్యుధిష్ఠిరునకు శకుని యి ట్లనియె. | 168 |
| క. |
ద్యూతకళాకుశలుండగు | నాతఁడు లోకజ్ఞుఁడును మహామతియును వి ఖ్యాతుఁడు నగు సత్‌క్షత్త్రియ | నీతి విదుఁడు దగునె దాని నిందింపంగన్. |
169 |
| క. |
బలహీను లయిన వారలు | బలవంతుల నొడుచునపుడు బహుమాయల న చ్చలమునఁ జేయుట యెందును | గలయదియ; జయంబ కాదె కర్తవ్య మిలన్. |
170 |
| వ. | ‘జూదంబున కీ వోడుదేని యుడుగు’ మనిన నాతనికి ధర్మరా జి ట్లనియె. | 171 |