| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఆ. |
అవనినాథుచేత నాజ్ఞాపితుం డయి | సూతనందనుండు ప్రాతికామి పాండవాగ్రమహిషిపాలికిఁ జని భక్తి | వినతుఁ డగుచు నిట్టు లనియె సతికి. |
206 |
| తరువోజ |
‘ధనసంపదలు నిజధరణిరాజ్యంబుఁ దనయులం దమ్ములఁ దన్నును నిన్నుఁ దనరఁ జూదంబాడి ధార్తరాష్ట్రులకు ధర్మతనూజుండు దా నోటువడియె; వనజాక్షి! కౌరవవరుపని నిన్ను వడిఁ దోడుకొని పోవ వచ్చితి నిపుడ; చనుదెమ్ము కౌరవేశ్వరుకడ’ కనిన జలజాయతాక్షి పాంచాలి యి ట్లనియె. |
207 |
| ఆ. |
‘ఏయుగంబునందు నెట్టి దుష్కితవుండు | భార్య నొడ్డి యోటువడినభర్త గలఁడె? యిది వినంగఁ గడు నపూర్వం బయ్యె; | నిట్లు సేయునొక్కొ యిందుకులుఁడు? |
208 |
| తే. |
మున్ను ద న్నోటువడి మఱి నన్ను నోటు | వడియెనో, నన్ను ము న్నోటువడి విభుండు గ్రన్నఁ ద న్నోటువడియెనో యన్న! నాకు | నెఱుఁగఁ జెప్పుము దీని నీ వెఱుఁగుదేని.’ |
209 |
| వ. | ‘ఎఱుంగవేని యక్కితవు నడిగి వచ్చి మఱి నన్నుం దోడ్కొని పోవనగునేని తోడ్కొని పొ’మ్మనినం బ్రాతికామి క్రమ్మఱి వచ్చి పాంచాలిపలుకులు ధర్మరాజునకుం జెప్పిన, దురోదర పరాజయ దుఃఖిత చేతస్కుం డగుటం జేసి యతఁడు వానికి నదత్తప్రతివచనుం డైనఁ, బ్రాతికామికి దుర్యోధనుం డి ట్లనియె. | 210 |
| క. |
‘సందిగ్ధ మయిన యర్థము | నిందఱ సన్నిధిన యడిగి; తింద ఱెఱుంగన్ సుందరిఁ బాంచాలేంద్ర సు | తం దోడ్కొని రమ్ము, పొమ్ము! తడయక’ యనినన్. |
211 |
| వ. | వాఁడును ద్రౌపది పాలికింబోయి ‘దేవీ! నీ యడిగిన యర్థంబ నిర్ణయించువా రయి సభ్యులు నిన్ను రాఁబంచిరి; ర’మ్మనిన దుర్యోధను దుశ్చేష్టితంబునకు ధర్మరాజుసమ్మతంబునకు వెఱచి, యక్కోమలి ప్రాతికామిపిఱుంద నేకవస్త్రయు నధోనీవియు నవిరళగళితనయనోదకబిందుసందోహపరిపీడ్యమానపీనస్తన పరిధానాంతరయు నగుచు సభకుం జనుదెంచి కురువృద్ధుసమీపంబున నున్నంత; ద్రౌపదిం జూడ నోపక లజ్జితులయి దుఃఖాయమాన మానసులయి తలలు వాంచియున్న పాండవుల వైలక్ష్యం బుపలక్షించి సంతసిల్లి దుర్యోధనుండు దుశ్శాసనుం బిల్చి ‘ప్రాతికామి వృకోదరునకు వెఱచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని ర’మ్మని పంచిన. | 212 |
| ఆ. |
నిర్దయాత్ముఁ బాపనిరతు దుశ్శాసనుఁ | బనుచు టెఱిఁగి కృష్ణ పంకజాక్షి గడుభయంబు నొంది గాంధారియొద్దకు | నరిగెఁ గడు నడంగి యతిరయమున. |
213 |
| చ. |
తడయక కౌరవానుజుఁడు దాని పిఱుందన పాఱి ‘యింక నె క్కడ కరుగంగఁబోలుఁ? జులుకం జను దెమ్మిట; సౌబలుండు ని న్నొడిచె దురోదరంబునఁ; గురూత్తము నర్థమ వైతి; నిన్నునుం బుడమిని దమ్ముఁ గోల్పడిరి పొల్తి! భవత్పతులైన పాండవుల్.’ |
214 |
| వ. | అనుచు డాయ వచ్చిన నక్కోమలి ‘రజస్వల నన్ను ముట్టకు; మేకవస్త్ర నయి యున్నదాన; గురుబంధు జనాధిష్ఠి తంబైన సభకు నెట్లు రా నేర్తు?’ ననిన ‘నీ వేకవస్త్ర వైతేమి విగతవస్త్ర వైతేమి? ని న్నెట్లుం దోడ్కొని పోదు’నని బలాత్కారంబున. | 215 |