పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము
కృపాచార్యుఁడు నిద్రాసక్తులఁ జంపఁదగదని యశ్వత్థామకు హితవు చెప్పుట (సం. 10-5-1)
చ. అలుక మనంబునం గదిరినాతఁడు దాను నెఱుంగఁ డొడ్లచేఁ
దెలియఁడు కార్యతంత్రములు; ధీమహితుండగువాని కైననుం
జెలులును జుట్టలుం దగిలి చెప్పఁగఁ జొప్పడుఁగాక తక్కు ని
ర్మలమగు నీతితంత్రము దిరం బయి చిత్తమునందు నిల్చునే?
77
క. మతి నెప్పుడుఁ దా ధర్మ | స్థితి నూహించుచును, హితులు సెప్పెడి వెర వు
ద్ధతి దక్కి యాచరించుచు | జితేంద్రియత గలిగి నడవఁ జెందు శుభంబుల్‌.
78
తే. దుష్పథంబులఁ జొరనీక తొలఁగఁ దివుతు | రాప్త జనములు దగ వశ్యు లయినవార
లందుఁ బుణ్యంబు దొలఁగని యతఁడు దొలఁగు; | దొలఁగ నేరఁడు భాగ్యంబు దొలఁగువాఁడు.
79
క. మతిమంతు లైనవారికి | హితులగు వెరవుగలవార లెఱిఁగింతురు దు
స్స్థితి గాకుండఁగఁ గార్యము | గతి యొత్తియుఁ దప్పు లిడియుఁ గడవఁ బలికియున్‌.
80
క. నా పలుకునట్టి యాగ్రహ | దీపితుఁ డగు టుడిగి మదికిఁ దిన్నఁదనము నీ
వాపాదింపుము చలమును, | గోపముఁ గ్రౌర్యంబు విడువు గుణరత్ననిధీ!
81
వ. ‘అట్లైనం బశ్చాత్తాపంబునం బడవు, నిద్రించినవానిని, నాయుధంబులు విడిచినవానిని, వాహన వైకల్యంబు నొందినవానిని, శరణుసొచ్చినవానిని, దలవీడినవానిని వధియించుట ధర్మంబుగా; దీ సమయంబున సమస్త సైన్యంబును, బాండవ పాంచాలురు నిద్రవోవుదురు. నిదుర సావునట్టిదికాదె? పీనుంగులుం బోలెఁ బడి యున్న వారిం బొడిచి పాపంబు గట్టుకొని నరకంబునఁ బడుట మేలె? మహాస్త్రవిదులగు రధికముఖ్యుల యందు మేటి యనంబరఁగి యింతకు మున్నేమిటం గల్మషంబు లేని నీయట్టివాని కిట్టి దుష్కర్మంబు గర్తవ్యం బగునె? యిది మడుఁగుఁ జీరయందు మసి దాఁకినట్లయ్యెడు. సూర్యసంకాశుండవగు నీవు సూర్యోదయ సమయంబునఁ బ్రకాశప్రకారం బైన పరాక్రమంబున కుపక్రమింపు’ మనవుడు నశ్వత్థామ గృపాచార్యున కిట్లనియె; 82
సీ. ‘నీ చెప్పినది యెల్ల నిజము; శాసింపంగఁ | దగువాఁడవై హితం బగు తెఱంగు
నా కెఱింగించితి; నీ కేను జెప్పెద | నేర్పడ వినుమయ్య యెల్ల నృపులు
గనుఁగొనుచుండ మజ్జనకుని సన్న్యస్త | శస్త్రుని నట్లు పాంచాల రాజ
సుతుఁడు ధృష్టద్యుమ్నుఁ డతి పాతకం బని | కొంకక తల పట్టుకొని వధించె;
 
ఆ. భీష్ము నా శిఖండి పేరఁ గృత్రిమ సమ | రమున నర్జునుండు సమయఁజూచె;
నరద ముర్విఁ గ్రుంగి యనువు దప్పిన డిగ్గి | యెత్తుచుండఁ గర్ణు నేసె నరుఁడు.’
83
ఆ. చేయి నరుఁడు దునుమఁ బ్రాయోపవేశ ప్ర | వృత్తిమైఁ బ్రశాంత చిత్తుఁడైన
పుణ్యపురుషు నట్టి భూరిశ్రవునిఁ గృష్ణు | ననుజుఁ డట్లు సంపె నాగ్రహమున.
84
చ. పలువురు గూడి కౌరవనృపాలకు నొక్కరుఁ జుట్టుమట్టి వి
చ్చలవిడిఁ బాపకర్మ మనుశంక యొకించుకయేని లేక యూ
రులు గద నుగ్గుసేయఁగ మరుత్సుతునిం బురికొల్పి; రిన్ని భం
గుల మును వారె కాదె చెడఁగ్రొచ్చిరి సంగరధర్మసేతువున్‌?
85
వ. వారి నెట్లు నిందింపవు! మమ్ము నెట్లు వారించెద? వాలింపుము. 86
ఆ. ‘తొడలు విఱిగి నేలఁ బడియుండి ననుఁ గని | మానవేంద్రుఁ డట్లు దీనవృత్తి
నాడెఁ గొన్ని మాట; లవి యంతరంగంబు | నందుఁ జిక్కి కినుక యలఁత సేసె.’
87
వ. వాని వెలార్పవలయు; మజ్జనక హనన సంతుష్టుండగు ధృష్టద్యుమ్నుండు లోనైన యప్పాపాత్ములఁ బాపంబు తెరువున రూపుమాపెద; దీనంజేసి కీటజన్మంబు పాటిల్లినను మేల కాని యీ కడంక మాననేర; నన్ను వారింప నెవ్వరి వశంబగు?’ నని దిగ్గనలేచి యగ్గురుతనయుండు రథంబెక్కినం గనుంగొని యగ్గౌతముం డును గృతవర్ముండు. 88
ఆ. ‘ఏక నిశ్చయమున నిట యేఁగుదెంచితి | మనఘ! నీవు నేము నధివు పనికి;
నిట్టి మమ్ము వేఱు పెట్టి యెక్కటి కార్య | మాచరించువాఁడ వగుట దగునె?’
89
చ. అనవుడు నాతఁడిట్టులను నమ్మహితాత్ముల కే నవశ్యముం
జని ద్రుపదాత్మజుం బొదివి చంపెద దుర్గతిఁబోవుచావుగా
ఘనభుజశక్తి శౌర్యము నకంపిత ధైర్యమునున్‌ వెలుంగ; మీ
రును దెలివొంది కూడికొన రూఢికి నెక్కుద మెల్ల భంగులన్‌.’
90
ఆ. ‘ఒండు తలఁపు లుడిగి రం’ డని పోవ, నా | రథికవరులు గడఁగి రథము లెక్కి
మొనసి చనిరి వారు మువ్వురు నగ్నిత్ర | యంబుఁ బోలి యొప్పి యప్పు డధిప!
91
వ. అట్లు చని నిద్రావివశం బైన పాండవ శిబిరంబు డగ్గఱి’ రనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. 92
ఆ. ‘రాజుఁ గూల్చి జయముఁ దేజంబుఁ బొందిన | యత్యుదగ్ర విభవు లైన యరుల
శిబిర మాక్రమింపఁ జిత్తంబులందుఁ దెం | పొదవి మువ్వురట్లు గదియు టరిది!
93
వ. వారు చేసిన విధంబు వివరింపు’ మనిన నా సూతసుతుండు విచిత్రవీర్యనందనున కి ట్లనియె. ‘నట్ల శిబిర ద్వార ప్రదేశంబునకు నడచి సహాయులం గడచి యశ్వత్థామ యుద్దామరభసంబునఁ జన నుత్సహించె, నట్టియెడ. 94
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )