| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| స్రగ్ధర |
తుండంబుల్ నుగ్గునుగ్గై తొరఁగఁగఁ జులుకం ద్రుంచుఁ, గుంభస్థలంబు ల్ఖండించున్ మౌక్తికంబు ల్గలయఁగఁ జెదరం, గాయముల్ ప్రేవుఁబ్రోవుల్ చండంబుల్ సాంద్రరక్త స్రవమున బెరయన్ జాల్వడన్, వ్రేయు నిమ్మై శుండాలశ్రేణి మాయించుచు, వెలిఁగి, హయస్తోమశాలాగతుండై. |
175 |
| ఉ. |
కొన్నిటి పాదముల్ నఱుకుఁ; గొన్నిటి మోరలు సెక్కు లీలమైఁ గొన్నిటి కంఠముల్ దునుముఁ; గొన్నిటి వీఁపులు వ్రచ్చు నుబ్బునం గొన్నిటి సర్వగాత్రములు క్రూరవిచేష్టితవిక్రమంబు దోఁ ప న్నుఱుమాడుఁ బ్రౌఢబలభాసితభూరిభుజావిహారుఁడై. |
176 |
| వ. | ఇబ్భంగిఁ బీనుంగుపెంటలైన పాంచాలుర విడిదల వెడలి విజయోద్దాముండగు నశ్వత్థామ చల్లడము, దట్టి మొదలయిన పరికరంబులు పాటించియున్న గనపలోఁగిళ్ళకుం జని, తొలుత దొరలం దునుముచుఁ, బరిజన మాతంగ తురంగ మండలముల ముట్టి, విదళన వినోదంబులు సలుపుచు, నొక్కొక్కయెడ మార్తురు మేల్కని పన్ని మార్కొనిన, మారి మసంగినట్లు, మృత్యుదేవత గెరలిన చాడ్పున, జముండు నలిరేఁగిన కరణిఁ, గనుపుగొట్టి, కాలుకాలం బెనంగిన పీనుంగులను, గనక రత్నవలయంబులఁ జెలువందు చేతులను, దునిసిపడిన కరికరంబులతో సరసమాడు చెలువునం జలనంబు నొందు చరణంబులను, నావులించు తలలను, వేదండ దంత ఖండంబులను, ఘోటక ముఖలేశంబులను, రథావయవ శకలంబులను, మడువులు గట్టు నెత్తురులను, గుప్పలు గొను కండలను, బెనంగొను ప్రేవులను, బెనుతిట్టలగు నెమ్ములను, మూర్తిమంతంబు లయినట్టి యద్భుతంబునకు, భయానకంబునకు, బీభత్సంబునకు, నన్నేల నెలవగునట్లుగాఁ జేయుచుఁ, జెలంగి చెలంగి మలంగి మలంగి తన కరవాల లీలలు భూతబేతాళంబులకుఁ బ్రీతిఁ బెనుపఁ జతురంగంబులం బాఱినను, బీఱువోయినను మరలినను, దెరలినను, గలంగినను, దొలంగినను, దఱిమినను, నఱిమినను, గిట్టినను, ముట్టినను, దాను వానిం బొదివి పొలియించుచు, బలువిడియు, నుబ్బును, వెరవును, బరుసఁదనంబు, నొక్కచందంబునఁజెల్ల నందొక్కటినైనను దక్కనీక యంతకంతకు నెక్కుడగు కోపంబున నాటోపంబు దీపింప, వాదరఁ జిక్కిన యెముకతునుకలు గోఱదౌడల కైవడి గలిగి రుధిరానులేపనంబున నాభీలంబగు నసిపట్టిక ఘోరాకారయైన రాక్షసి పగతుర గీటడంగించుటకుఁ దనకుఁ దోడువచ్చిన తెఱంగున మెఱయఁ జేదిసైన్య సన్నివేశంబు లోనుగాఁగల బలుచోట్లఁ గమలాకరంబు సొచ్చిన ఘనలులాయంబు రేఖయుఁ, గేలివనంబుఁ దఱిసిన మత్తశుండాలంబు పోల్కియును, గాంతారంబు దరికొను దావపావకు విధంబును దోఁప విహరించుచు, వలయుతఱి రథం బెక్కుచుఁ, బాదచారియై విక్రమించుచు, వెరవు దొరకొననప్పుడు నగ్గలికమై బెరయఁ బెనంగి రక్తంబున సిక్తింబైన శరీరంబు దారుణ ప్రకారంబున నుల్లసిల్లఁ, దన్ను సకల జనులు దానవుండని తలంపఁ, బెంపారు భీషణోద్ధతిఁ బ్రవర్తిల్లు పరాక్రమక్రీడ నతిశయిల్లి, రాజమందిరంబు సొర నప్పళించుచుఁ, దద్ద్వారంబున కభిముఖుండై యరిగె నట్టియెడ. | 177 |
| సీ. |
కలయంగ వీడుమేల్కని యమ్మహావీరుఁ | డొక్కఁడ మెలఁగుటయు, నతండు దొలుత ధృష్టద్యుమ్నుఁ ద్రుంచి తద్బంధు సం | తతి గీటడఁచి యోధదంతితురగ చయముల నెల్లను సమయంగఁ జూచుచు | రాకయుఁ, గర్ణ పరంపరావ గతమున సన్నాహగాఢమై యెక్కడె | క్కడయని కడఁగి శిఖండి ద్రౌప |
|
| తే. |
దేయులును దానుఁ బన్ని యుద్వృత్త శౌర్య | మాన తుంగ ప్రభద్రక మాత్స్య తతులు తోడ బలువిడిఁ దఱుమంగ ద్రోణ తనయు | ముట్టి శస్త్రాస్త్రచయముల ముంచుటయును. |
178 |
| వ. | వారల నేర్పడ నాలోకించి. | 179 |
| ఉ. |
అగ్గురునందనుండు హరిణావలిఁ గాంచి కుభృత్తటంబు వే డిగ్గు మృగేంద్రు చాడ్పునఁ గడిందిమగంటిమి యుల్లసిల్లఁగా డిగ్గి రథంబు చోద్యపువడిం గలయన్ బెరసెం గరంబులం దగ్గల మైన ఖేటకము నద్భుతఖడ్గముఁ దేజరిల్లఁగన్. |
180 |
| మహాస్రగ్ధర |
చతురంగచ్ఛేద కేళీ సరభస కలనాశ్చర్య ధౌరేయ నానా గతులం ద న్నెల్లవారుం గడిఁది యసుర నాఁగా నతిక్రూర చేష్టో ద్ధతి యొప్పం జొచ్చి సైన్యాస్త్రముల నతని యస్త్రంబులం ద్రుంచి వీఁకం బ్రతివింధ్యుం గిట్టి రెండై పడఁగఁ దునిమెఁ దద్భాసమానాంగయష్టిన్. |
181 |
| వ. | ఇవ్విధంబున ధర్మతనయనందనుని నడుము దెగనడిచి యార్చి పేర్చిన. | 182 |
| మహాస్రగ్ధర |
అతిశోక క్రోధవేగవ్యథిత హృదయుఁడై యశ్వసాదిత్వ వీరో ద్ధతిఁ బ్రౌఢస్ఫూర్తి సెల్పొందఁగ సబళముఁ దద్గాత్రముఁ జొన్పఁ బూఁచె న్శ్రుతసోముం; డల్లఁ బట్టె న్గురుసుతుఁ డదియున్; స్రుక్కు చెన్నార, నల్క న్ధృతఖడ్గుండైనఁ, జేయు న్శిరముఁ దురగము న్వ్రేల్మిడిం ద్రుంచి వైచెన్. |
183 |
| వ. | ఇవ్విధంబునఁ జిత్రవధంబునకు గోచరుండైన కీచకాంతకతనయుం గనుంగొని. | 184 |
| మహాస్రగ్ధర |
‘నినుఁగూడన్ వీఁడె వచ్చెన్ నృపుఁ’ డనుచు శతానీకుఁ డాభీల చక్రం బున నశ్వత్థామ వక్షంబునను రుధిరముం బొంగఁగాఁ జేయ నప్పా టున నీడంబోక బల్వేటున నిలఁ బడ నాటోపముం జూపి యంతం దనివో కా దుర్జయుం డాతని శిరమును దద్గాత్రముం బాపె లీలన్. |
185 |
| వ. | ఇట్లు నకుల సూనుఁడు సమసిన. | 186 |
| మహాస్రగ్ధర |
శ్రుతసేనుం డప్డు గోపస్ఫురదరుణమరీచుల్ దలిర్పంగఁ జక్షు ర్ద్వితయంబుం గెంపునం బొందిన చెలువము సందీప్త ఘోరంబుగా బె ట్టతనిం జంచద్గదన్ వ్రేయఁగ నుఱక తదాస్యచ్ఛిదాస్ఫారకేళీ చతురుండై యక్కుమారున్ జముకడ కనిచెం జండదోర్దర్ప మొప్పన్. |
187 |
| వ. | ఇత్తెఱంగున వికృతాననుండై పడి మృతుండైన సహదేవ సుతుం జూచి రోషంబునం బేర్చి. | 188 |
| మహాస్రగ్ధర |
వితతజ్యానాద మాశావితతి నినిచి దోర్వీర్యమేపార బాణ ప్రతితం దన్ముంప, వీఁకం బలుక జడియుచున్ బల్విడిం బేర్చి చంచ ద్గతిఁ గ్రీడం దంతి హేలాదళనరతమృగేంద్ర స్ఫురన్మూర్తి దోఁపన్ శ్రుతకీర్తిం గిట్టి కంఠత్రుటనవిలసనారూఢి నవ్విప్రుఁ డొప్పెన్. |
189 |
| వ. | ఇట్లు ద్రౌపదీ తనయ పంచకంబు పంచత్వంబు నొందినఁ గ్రోధాతిరేకంబునఁ బ్రభద్రకులును, శాంతనవాంతకుండును ధృష్టద్యుమ్నాంతకుఁ జుట్టుముట్టి. | 190 |
| చ. |
శరములఁ దోమరంబులను జగ్రములన్ వెసఁ గప్పి బెట్టు ము ద్గర కరవాల కుంతముఖ దారుణ హేతుల నొంప, నాతఁ డు ద్ధుర గతులం బ్రభద్రకులఁ ద్రుంచుచుఁ గేళి యొనర్పఁగా, శిఖం డి రుచిర మార్గణంబు భ్రుకుటిస్థలి నొంచె సముద్భటోన్నతిన్. |
191 |