పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము
అశ్వత్థామ పాండవ శిబిరంబు వెడలి కృపకృతవర్మలఁ గూడికొనుట (సం. 10-8-140)
సీ. ‘సకల పాంచాలురు సమసిరి పాంచాలి | కొడుకు లందఱు జముకడకుఁ జనిరి;
చేది మాత్స్య ప్రభద్రాది బలంబులు | నిరవశేషంబుగా నేలఁ గలిసె;
మాటలు పెక్కేల? మానిసి గుఱ్ఱ మే | నుం గను పేరెల్లఁ ద్రుంగెఁ బాండు
భూవరనందను లేవురుఁ గృష్ణుఁడు | సాత్యకియును నెందుఁ జనిరొ కాని
 
తే. తండ్రియును నేలినాతఁడు దైన్యపడిన | దాని కరులపై వచ్చి యీశాను వరము
గాంచి మీరలు పెనుఁబ్రాపు గాఁగ వీడు | దఱియుటకు నెంతదగునంత పఱుపఁగంటి.’
203
వ. అని చెప్పిన వినుచు మున్ను రాక్షసావేశంబునం జేసి నీచపరాక్రమంబు లాచరించి తదనంతరంబ తెలిసి యా రథికవరులు వగం బొగులుచున్నవారు గావున నగ్గురునందన నగ్గింపం దలంపక యూరకుండి తమ మనోవికృతి యతం డెఱుంగకమున్న తలలు వంచుకొని తగు తెఱంగునఁ బొగడిన నతండు. 204
తే. ‘పాండుతనయులు నాచేతఁ బట్టువడుట | తెగుట గలిగిన ననుఁ గొంత పొగడఁ దగును;
జలముమై రిత్తవాండ్రను జంపు టరయ | మీరు గొనియాడు నంతటి పౌరుషంబె?’
205
వ. అనిన విని వారలు ‘ధృష్టద్యుమ్న ప్రముఖ పాంచాలురను బ్రతివింధ్యాది ద్రౌపదేయులను బేరుకొని వారివారి బలంబులను మాత్స్యానీకప్రభృతి సైన్యంబులను నొక్కరూపేనియుఁ ద్రిక్కకుండ నొక్కరుండవ రెండు జాములలో నేలం గలిపితి; కరం బచ్చెరువుగాదె!’ యని యతనిం గౌఁగిలించుకొని రనుటయు సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియె: 206
క. ‘కురుపతికి జయము గోరెడు | గురుపుత్రుఁడు మున్న యేలొకో యిటు తఱికిం
జొరక యెడ మడిసినను మఱి | వెరవుం జేవయును జూప వేడుక వడియెన్‌.’
207
వ. అనిన యమ్మహీపతి కతం డిట్లనియె. 208
ఉ. ‘పాండు నృపాలనందనుల బాహుబలంబున కోడి యాతఁడు
ద్దండతఁ గుంది యుండి వసుధావరునూరులు నుగ్గుసేసి భీ
ముండు దదుత్తమాంగము సముద్ధతిఁ దన్నిన దాన శోకముం
జండతర ప్రకోపము నసహ్యపు వేదన సేయ నత్తఱిన్‌.
209
ఆ. గురుని చావు తెఱఁగు క్రొత్తయై మనమున | నావహిల్లుటయు మహాగ్రహమున
బాసయిచ్చి రాజు పనుపును బడసి యు | దగ్రవృత్తి నరిగి యట్లు సేసె.
210
ఉ. తా వెసఁ బోవునప్డు బలదర్ప సమగ్రులు పాండుపుత్రు ల
చ్చో వసియింపకున్కిఁ దనచూచిన కార్య మతం డొనర్చె; దే
వావలికైన నత్తెఱఁగు నాక్రమలీలలు సెల్ల నేర్చునే?
భూవర! వారలున్న విధిపోకలఁ బోవుట గాక యంతయున్‌.’
211
వ. అని చెప్పి విను మట్లు కృపకృతవర్మలచేత సంభావితుండై కుంభసంభవసంభవుండు వారలతో మనమిఁక ‘మనుజపతి కడకుఁ దడయక పోవలయుఁ బుణ్యంబున మనము వోపునంతకుం బ్రాణంబులు గలిగి యుండెనేని యిత్తెఱం గెఱింగింత’ మనుటయు వార లట్లకాక యని యచ్చోటు గదలి యమ్మువ్వురును భూవల్లభసల్లాప కుతూహలంబున రయంబునం జనుదెంచి. 212
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )