పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము
సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీ శాశ్వతత్వ కరణ క | లాశాలి! దయాది నిర్మల జ్ఞానమయా!
నాశోత్పత్తి రహిత! శు | ద్ధాశయ సంభజన మహిత! హరిహరనాథా!
1
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. నట్లు సూర్యోదయంబైన యా సమయంబున సమీరనందనాదిసోదరులును, శౌరిసాత్యకులుం బరివేష్టింపనున్న ధర్మతనయు పాలికిఁ బఱతెంచి ధృష్టద్యుమ్నుని సారథి సాష్టాంగ దండ ప్రణామంబు సేసి కరకమలంబులు మొగిడ్చి. 2
సీ. ‘నరవర! మన వీడు నడిరేయి కృతవర్మ | యును గృపాచార్యుండుఁ దనకుఁ దోడు
గా వచ్చి జనులు నిద్రావివశాత్ములై | యుండ నశ్వత్థామ యొకఁడు సొచ్చి
తొలుత ధృష్టద్యుమ్నుఁ ద్రుంచి తత్సోదర | తనయాది పాంచాల తతుల ముట్టి
యన్యాయవిధిని నింద్యంబైన విక్రమ | లీలాతిశయమున నేలఁ గలిపి
 
ఆ. చేది బలము నెల్లఁ జెండి మాత్స్య ప్రభ | ద్రకులు మేలుకాంచి ద్రౌపదేయు
లను శిఖండిఁ గూర్చికొని తన్నుఁ దాఁకిన | బెట్టు చంపె నంతవట్టు వారి.
3
వ. మఱియును. 4
స్రగ్ధర వీడెల్లం దల్లడిల్లన్‌, వివిధ గతులమై విక్రమోల్లాస మొందం,
గ్రీడాకల్పంబుగా, నాకృతిఁగని ప్రజ శంకించి దైత్యుం డనం, జెం
డాడెన్‌. శీర్ష వ్రజంబున్‌, హరులగముల వేఁటాడె, నేనుంగులం దు
న్మాడెం, గౌక్షేయ హేలాభ్యసనలసిత బాహార్గళా భీషణుండై.
5
తే. అడవి దరమిడి నఱుకంగ నందుఁ గల వి | హంగమంబులు గలగొన నఱచు తెఱఁగు
దోఁచె నాతఁడు యోధులఁ దునుమఁ గలఁగి | యన్యజనము లాక్రందించునప్పు డధిప!
6
క. అఱచినఁ బఱచిన వ్రేళులు | గఱచిన నతఁ డించుకయును గరుణింపక యం
దఱ నుఱముసేసె గుంపుల | కుఱికి యుఱికి ఖడ్గదారుణోల్లసనములన్‌.
7
వ. ఆ సమయంబున. 8
మహాస్రగ్ధర కృపుఁడున్‌ హార్దిక్యుఁడున్‌ వాకిట నిలిచి భయాక్షిప్తయోధవ్రజంబున్‌
నృపులున్‌ వే నిర్గమింప న్వివిధ శరముల న్మేదినిం గూల్చుచున్‌ ఘో
రపు సంరంభంబు దుర్వారముగఁ గెరలి రౌద్రంబు రూపంబు దాల్పం
గుపితక్రవ్యాదులో నాఁ గుచరిత నిరతిం గ్రూరతాధుర్యు లైనన్‌.
9
వ. తత్ప్రదేశంబు నవ్వీటిలోనుంబోలెఁ బీనుంగుపెంట యయ్యె నట్లు శిబిరంబునం గల కరితురగ నర నికరంబులు నిశ్శేషత్వంబు నొందె నాయుశ్శేషంబు కతంబునం గృతవర్మచేతం బట్టువడి యతండు మందల విడువ నిట వచ్చితి’ నని చెప్పినం బాండవాగ్రజుండు. 10
తే. శోకవేగసంతప్తుఁడై సొలసివ్రాల | సంభ్రమమ్మునఁ బట్టిరి సాత్యకియును
గవలు భీమసేనుండును గరతలముల | నుమ్మలికము నెమ్మనములఁ గ్రమ్ముదేర.
11
వ. కొండొకసేపునకు మూర్ఛదేఱి యన్నరపాలుం డెలుంగు రాల్పడ నిట్లనియె. 12
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )