పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము
అశ్వత్థామార్జునుల బ్రహ్మశిరోనామకాస్త్రంబు లొండొంటిం దాఁకుట (సం. 10-15-1)
వ. కూర్చి తొలుత గురునందనునకుం గీడు వొందకుండ వలయునని ప్రార్థించి పదంపడి నాకును సోదరులకును శుభం బయ్యెడుమని పలికి యస్త్రదేవతలకు నమస్కరించి యస్త్ర మస్త్రంబునన శమియించుఁ గావుత మని శివంబుఁ జింతించుచుం బ్రయోగించిన నా దివ్యాస్త్రంబు కల్పాంతజ్వలనంబునుం బోలె నాభీలజ్వాలా మాలాకరాళంబై యుప్పరం బెల్లను దనమయంబుగా నిగిడి యశ్వత్థామాస్త్రంబు గ్రమ్మఱింప నుత్సహించిన నది క్రమ్మఱక పెరిఁగి సముద్దామధామం బగుటయు నయ్యస్త్రద్వితయంబు నాటోపంబున. 64
మహాస్రగ్ధర జలధుల్‌ ఘూర్ణిల్లె, నుల్కాశతములు వడియెం, జండభానుండు మాసెం,
గులశైలంబుల్‌ వడంకెం, గురిసె నురవడిన్‌ ఘోరపాషాణధారా
వలి, నాకాశంబు ధాత్రీవలయముఁ దిరిగెన్‌, వజ్రనిర్ఘోష మెందుం
జెలఁగం జొచ్చెన్‌, జనం బచ్చెరువును భయముం జెంది నిశ్చేష్ట మయ్యెన్‌.
65
వ. ధర్మాత్ముండగు నారదుం డప్పుడు సాత్యవతేయునకు సన్నిహితుండయ్యె, నతండును భరత కులోద్వహుండగు నప్పారాశర్యుండును గూడి యిట్లు జగద్భయంకర ప్రక్రమోద్దాములగు నయ్యర్జునాశ్వత్థామల నుపశమింపంజేయుట కై నడుమ నిలిచి యయ్యిరువురును నాకర్ణింప నిట్లనిరి. 66
క. ‘పలువురు మహాస్త్ర విత్తము | లలఘు భుజావీర్యశౌర్యు లవనిఁ జనిరి వా
రలు దీనిఁ బ్రయోగించుట | గలిగెనె మానవులపై నకల్మషులారా?’
67
వ. అనిన విని సవ్యసాచి దివ్యాస్త్ర జ్వాలా కలాప మధ్యంబున నిస్సంభ్రములై యున్న సర్వధర్మరక్షణ సర్వలోక హితాచరణపరిణతులగు నప్పరమమునులం గనుంగొని తత్కాలోచితానుష్ఠానంబు నూహించి యమ్మహాత్ములతో నిట్లనియె. 68
తే. అస్త్ర మస్త్రముతో శాంత మగుటఁ గోరి | సొలవ కట్లు ప్రయోగింపవలసెఁ గాని
యొండు దలఁపునఁ గా దది యుడుపవలయు | నేని యుడిపెదఁ బరమమునీంద్రులార!
69
క. ఏను మదస్త్రం బుడుపం | గా నీ పాపాత్ముఁ డస్త్రఘనదహనమునం
దా నేర్చు నందఱను; మీ | మానసములఁ దలఁపవలయు మా సేమంబుల్‌.’
70
తే. అనుచుఁ జయ్యన నస్త్రవిద్యాప్రవీణ | మానసుండగు నరుఁ డయ్యహీన రూప
సాధనము నశ్రమంబున సంహరించె | మెచ్చి యమ్మహామును లెదఁ బిచ్చలింప.
71
చ. తపమును, బ్రహ్మచర్యమును, దానము, సత్యముఁ గల్గు నా సురా
ధిపతనయుండు దక్క సముదీర్ణముగా నిగిడించి యమ్మహో
గ్రపు మహితాస్త్ర మొండ్లకును రాదు మగుడ్పఁగ; నట్టి భంగి భూ
మిపతుల కాదు దేవతలు మేకొనఁ జాలరు కౌరవేశ్వరా!
72
వ. బ్రహ్మశిరోనామకంబగు నమ్మహాస్త్రంబు దలంచి బ్రహ్మతేజోమయంబగుటం జేసి యిట్లు ప్రయోగించి వారింప శక్యంబు గాకుండు; వారించిరేని వారించిన వారిన తలద్రెంచు; గురుభక్తియు వ్రతయుక్తియు నెక్కుడు గలుగుట నక్కౌరవశ్రేష్ఠుండు నివారణపటిష్ఠుం డయ్యె; నవ్విధంబునఁ గవ్వడి యా దుర్నివారసాధనంబు వారించుట నాలోకించి యమ్మునీశ్వరు లమ్మాహాత్మ్యం బూహించి, రశ్వత్థామ నిజాస్త్ర సంహారంబు సేయంజూచి యది శక్యంబుగా కుండుటయు దీనమానసుండగుచు మాననీయోపాయుండగు సాత్య వతేయున కిట్లనియె. 73
తే. ‘చంపెఁ గురువిభు నాకు లజ్జాకరముగ | భీముఁ డదియు నధర్మ సంగ్రామవృత్తి;
నంతఁ బోవక వచ్చి ప్రాణాపహార | మాచరింపఁగఁ బూని నన్నాక్రమించె.
74
చ. పరిభవజాతరోషమునఁ బ్రాణభయంబునఁ జేసి యిమ్మహా
శరము వివేకవర్జితవిచారుఁడనై యిటు లేసితిన్‌ మునీ
శ్వర! యిది పాండుభూపసుత వర్గము నంతటినేర్చుఁగాని యె
ప్పరుసున మాన దివ్విధము పాపమయేనియు దాని కోర్చితిన్‌.’
75
వ. అనిన విని యమ్మునిపతి యతని యాననంబునఁ జూడ్కి నిలిపి మీ తండ్రి యిప్పాండవమధ్యమునకు వాత్సల్యంబున నీయస్త్రం బొసంగె నీ యోధవరుండు నీకుఁ గీడు దలంపఁడు; భవదస్త్రం బుపశమించుటకునై నిజాస్త్రంబు ప్రయోగించె; మేము వలవ దన్న నుపసంహరించె; ని ట్లస్త్రవిద్యావైదగ్ధ్యంబు సడిసన్న కవ్వడి వధింప నీకు వశంబగునే? నీ యస్త్రం బతని యస్త్రంబు చేత నివారితం బయ్యెడు; నది యట్లుండె; విను; మమ్మహాస్త్రంబు మనుష్య విషయంబుగాఁ బ్రయోగించువానికి నశుభంబగు; నొకనిచేతఁ బ్రయోగింపఁబడి యన్యు నస్త్రం బుపశమించెనేని, యద్దేశంబునకుఁ బండ్రెండేం డ్లనా వృష్టి దురితం బగుం; గావునఁ బాండవులను నిన్నును నిద్దేశంబును రక్షించుటకుం జెప్పితి; మెప్పాటనయిన దీని నుపసంహరింపవలయుఁ; దపంబునకుఁ జొచ్చినవాఁడవు, రోషంబునకుఁ దొలంగి సుఖివి గమ్ము; ధర్మంబున జయంబు గొన నోపిన యిప్పార్థుండును బ్రీతుండై చనవలయు; భవదీయ శిరోమణి యీతని కి; మ్మట్లయిన నితండ కాఁడు, పాండవులందఱును నీ దగు జీవనంబు నపహరించినంతయ సంతసిల్లుదు; రిది సమీచీనంబయిన సంధిప్రకారం; బిట్లు సేయుట మే;’ లనుటయు, నుమ్మలికంబుతో నగ్గరునందనుండు పరాశరనందనున కిట్లనియె. 76
సీ. ‘పాండునందనులకు బ్రాఁతె రత్నంబులు? | కౌరవనాథు భండార మెల్లఁ
గైకొన్నవారు; నాగభయంబుఁ, దస్కర | భయమును, దానవభయము, దేవ
భయమును, బొరయవు; బాధింప దాఁకలి | తృష, నిద్ర, రోగంబు, దీనికతన;
నిట్టిరత్నము వీరి కీఁ జాలుదునె? ముని | నాయక! నీ వచనం బలంఘ్య
 
ఆ. మగుట దీని నీకు నర్పించితిని; మద | స్త్రంబు పాండవేయ రాగ పాత్ర
గర్భములకు హానిఁ గావించి సంతృప్తిఁ | బొంది తాఁ బ్రశాంతిఁ బొందుఁగాత.’
77
క. అన విని కృష్ణద్వైపా | యనుఁ ‘డట్టులు సేయు మొంటి కాస పడకు మీ’
యని పలుక నప్పలుకునం | గనియెను దన పలుకు తప్పుగా నతఁడు మదిన్‌.
78
వ. కని ‘పాండవేయ రాగపాత్ర గర్భంబులని తత్సంతాన సంజాత గర్భంబులనెల్ల నుగ్గడించిన వాఁడనయితి; నది పారాశర్యుండు పాండవేయ భార్యాగర్భంబులన పేరుకొనుటగాఁ జేసి ‘యొంటి కాసపడకుమీ’ యనియె. దీని నెఱింగినవాఁడఁ గానేని యిది యనుమతిగా భావించి సకలగర్భవిధ్వంసనంబు గావించెదంగాక’ యని నిశ్చయించి యమ్మునీంద్రునితో ‘నట్ల చేయువాఁడ’ నని పలికె. వారల సంవాదప్రకారంబు హృషీకేశుం డెఱింగి ‘వీఁడు సంయమివరు మాట గీటునం బుచ్చి తనవలసినట్లు సేయువాఁడయ్యె; నిప్పాపాత్ము నుపక్రమంబునకు నడ్డపడి చూచెదఁ; గాకున్నఁ దుది నా చేయుతెఱంగున్నదియ కాదె’ యని వితర్కించె, నప్పు డశ్వత్థామ చేతోవృత్తి సాత్యవతేయుం డెఱిఁగియుం, గృష్ణుం డెఱుంగుటయు నతం డతనితో సల్లాపంబు సేయం దలంచుటయుఁ గనుంగొని యూరకుండె. 79
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )