పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
ధృతరాష్ట్రుఁడు సపరివారంబుగాఁ బొలికలనికిం బోవుట (సం. 11-9-5)
క. ఆరంగూరిన శోకము | భారంబున మేను దూలఁ బరవశగతి గాం
ధారి చనుదెంచె నవ్వసు | ధారమణుని కడకు జనవితానము వొగులన్‌.
96
వ. కుంతీ ప్రముఖంబైన కురువృద్ధనారీజనంబును బరివారవనితాజనసహితంబుగాఁ దరతరంబ యరుగు దెంచె నట్టియెడ. 97
సీ. చేతులు నడుదల సేర్చు టుత్కటశోక | మాకారములు దాల్చి నట్టులుండ
విరిసిన వేనలుల్‌ వెన్నులఁ బ్రక్కల | నెఱసి చూపఱ దృష్టి నీఱు సేయ
నందంద దొరఁగెడు నశ్రుజలంబుల | పెంపున మోములు ముంపఁబడఁగ
నేమియుఁ దొడవులు లేమిఁ బాడఱియున్న | యంగంబులందు దైన్యంబు నెఱయఁ
 
తే. బతుల నన్నలఁ దమ్ముల సుతుల హితులఁ | బేరుకొని వాతు లెండంగఁ బ్రేముడించి
పనవు పలుకులు వినువారి వనటఁ దేల్పఁ | గురుకుమార నారీజనకోటి వచ్చె.
98
క. చెలులైనఁ జూడఁ బయ్యద | దొలఁగుటకును సిగ్గు పడు వధూజనతతి య
త్తల యెదుర నేక వస్త్రం | బులతో నంగమును వికృతిఁ బొందఁగ నడచెన్‌.
99
క. కొండొక వగపున కేనియు | నొండొరువులఁ దెల్పునట్టి యువిదలు చిత్తం
బొండొండ వనట మునుఁగఁగ | నొండెవ్వరుఁ దెలుపలేక యుండి రవశలై.
100
వ. అట్టి యెడఁ బురంబున నచ్చటచ్చట. 101
తే. విపుల హర్మ్యతలంబులు వెడలునట్టి | వెలఁది మొత్తముల్‌ వొల్చె బల్వేఁటకాఱు
పతులఁ జంపిన గిరిగుహాప్రతతి వెడలఁ | బాఱు సింగంపుఁ బెంట్లకుఁ బాటియగుచు.
102
క. మున్నెన్నఁడు నెవ్వరికిం | గన్నులెదురఁ బడని యట్టి కాంతలు జను లె
ల్ల న్నిలిచి చూడ వెడలిరి | కన్నులు గమరన్‌ సుహృన్నికాయంబులకున్‌.
103
వ. అప్పుడు కురువీరాగారంబులయందు హాహాకారంబు లెసంగ నిట్లు వనితా జనవ్రాతం బేతెంచి ధృతరాష్ట్రు సూరెల నాక్రందన ధ్వనులు సెలంగ నిలిచె, విదురుండు డగ్గుత్తికపడుచు నయ్యువిదల నూరార్చుచుఁ దగువారల నుచిత వాహనంబులపై నిడియె. నద్ధరణీనాథుండు నిజయోగ్యయానంబునఁ జనఁ దోడన యా తమ్ముండును గాంధారీప్రభృతులం దోడుకొని సంజయ సహితంబుగాఁ జనియెఁ, బిన్నలు పెద్దలనక సకల పౌరలోకంబునకు శోకం బావహిల్లినం బెల్లైన రోదనప్రణాదంబుల దిక్కులు పిక్కటిల్లెఁ. బ్రళయకాల జ్వలన జ్వాలలం బొదువంబడు జంతువు లాక్రోశించు చందంబు దోఁచెఁ, బురిఁగల వైశ్యశూద్ర శిల్పి కర్మార తక్షక క్షౌరక స్వర్ణకారక రజకాదు లమ్మహీపతి బలసి చని రివ్విధంబునం గ్రోశమాత్రంబు చని రాసమయంబున. 104
సీ. ఆచార్య సుతుఁడుఁ గృపాచార్యుఁడును గృత | వర్మయు నెదురుగా వచ్చి రథము
లంతంత డిగ్గి శోకార్తి నంగంబులు | దూల బాష్పంబులు దొరుఁగుచుండఁ
గా ధృతరాష్ట్రునిఁ గాంచి గద్గదకంఠు | లగుచు నాతని కిట్టు లనిరి ‘నీదు
తనయుండు భుజబల దర్పంబు దుర్వార | శౌర్యంబు మెరయంగ సంగరంబు
 
తే. సేసి యింద్రాది సురుల మెచ్చించి వారి | కతిథియై చని పరమ సుఖానుభవము
దగిలె నేము మువ్వురమును దక్క నమ్మ | హీశుతోడన్‌ సైన్యంబు లెల్లఁ జనియె.’
105
వ. అనినఁ దదనంతరంబ. 106
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )