పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము
గాంధారి పొలికలను చూచి కృష్ణునితోఁ జెప్పి దుఃఖించుట (సం. 11-16-18)
సీ. ‘చూడుము ధృతరాష్ట్రు కోడండ్రఁ గన్నార | వీరె కన్నీరు పై వెల్లి గొనఁగ
దీనతఁ బొందెడు నాననంబుల విప్ర | లాపంబులైన సల్లాపములను
నడలు చొండొరులకు నన్నలఁ దమ్ముల | రూపించి వేర్వేఱఁ జూపుటయును
బొరిమొగంబులు సూచి పురుపురఁ బొక్కుచుఁ | దలలల్లం దూలంగ నిలుచుటలును
 
తే. గలిగి యలిగెడు వారి కన్నులకుఁ బండు | వగుచునున్నారు కాకులు మగల తనువు
లెక్కియున్నను చేష్టలు దక్కి కొంద | ఱడువఁ జేయాడకున్నవా రంబుజాక్ష!
11
మానిని కూలియుఁ గాంతి యిగుర్పఁగఁ దేజము గుందక వహ్నులు గ్రూరశిఖా
జాల మడంగియుఁ జాయ వెలింగెడు చందము నొందిరి శల్యుఁడుఁ బాం
చాలుఁడుఁ గర్ణుఁడుఁ జాపగురుండును శాంతనవుండు నిజంబున కీ
బాలుఁడు వీరి ప్రభం గడచెం గుణభద్రునిఁ గంటె సుభద్రసుతున్‌.
12
ఆ. ప్రభువు లంతనంత రాజిల్ల నెడనెడ | వీరయోధతతులు వెలుఁగుచుండ
గ్రహచయమునఁ దారక ప్రకరంబున | బొలుచు గగనతలముఁ బోలెఁ గలను.
13
సీ. అర్జున భీష్మ చాపాచార్య భీమ క |ర్ణాదుల మహిత దివాస్త్ర వితతు
లాడిన నొండొక కీడు రానేరమి | వీతవికారమై వీరయోధ
చారుశరీరసంచయ ముండఁగా దీనిఁ | గంకశివాగృధ్రకాకకులము
లాదిగాఁ గలుగు క్రవ్యాదముల్‌ వీఁకు వీఁ | కాడుట నెంగిలి యయ్యెనకట!
 
తే. హంసతూలికా తల్పములందుఁ బొందు | భోగిజనముల మృదుగాత్రములు ముకుంద!
కంటె పరుసని ధరణి భాగమునఁ గూలి | యున్న యవి సూచువారల యుల్ల ముడుక.
14
క. చెవిని సొగియించు వీణా | రవమును గానంబు వేణురావము నిత్యో
త్సవముగ విను రాజులకడ | శివారుతము చెలఁగుచునికి చిత్త మలంచెన్‌.
15
తే. సారచందనహృద్య కస్తూరి కాది | లేపనాలిప్తి నుండెడు భూపవర్యు
లకట! శోణితపంకదిగ్ధాంగులగుటఁ | గనుట కోర్వరాదయ్యెడుఁ గమలనాభ!.
16
క. వనితలు మేలపుమెయి మెలు | పునఁ దిగిచిన నొప్పు హారములు మొదలగు ప్ర
న్నని తొడవులు గ్రద్దలు దివి | య నరేంద్రులు గొందఱునికి యచ్యుత! కంటే?
17
క. ప్రాణంబులు విడిచియును గృ | పాణాదులు విడువకున్న భటు లారయ స
ప్రాణుల పోలెం బ్రధన | క్షోణికిఁ దొడవగుచు నున్కి చూడుము కృష్ణా!
18
క. సూరెలను నందిజను లిం | పారఁగ వినుతింప నొప్పునట్టి మహీశుల్‌
నారీజనములు సుట్టుం | జేరి పనవుచుండ నునికి సేసె నలంతన్‌.
19
తే. కూరు మొన పెట్టినట్టులు గొంద ఱుజ్జ్వ | లాయుధములు గంకటములు నమర నున్నఁ
జూచి చావని వారని చూడు చేర | నరుగకున్నవి కంక గృధ్రాదు లనికి.
20
వ. ఇది యంతయు నీచే సాధితంబైన కార్యం’ బని పలికి వెండియు. 21
సీ. ‘అట్టలకడ యుత్తమాంగముల్‌ గానక | యలమట నలుగడ లరయువారుఁ
దలలు చేతులఁగొని తనువు లుత్తలమునఁ | దఱచు పీనుఁగులలోఁ దడవు వారు
శిరములు మేనులఁ జేర్చి భావించి ని | జాస్యముల్‌ వ్రేసికొం చఱచువారు
తునియలు పెక్కైనఁ బనివడి గూర్చి రూ | పులు గనుంగొని మూర్ఛ మునుఁగువారు
 
తే. నైన కౌరవపాంచాలి మానినీ జ | నముల నచ్యుత! చూడుము నాథజనక
పుత్రసోదరశవముల పొంతకేఁగి | పెక్కు దురవస్థ లొందెద రక్కటకట!
22
తే. అవయవములు రూపఱఁగఁ గ్రవ్యాద భక్షి | తంబులై యున్కిఁ గొన్ని శవంబు లువిద
లెంత సూచియునవి గొంద ఱెఱుఁగ జాల | రయ్యెదరు సూడు తమ బంధులగుటఁ గృష్ణ!
23
క. ఇట్టివి యెల్లనుఁ గనుఁగొను | కట్టిఁడితన మొందునట్లుగా నేమొకొ తొ
ల్పుట్టువునం జేసితి నీ | చుట్టలనిటు సూడకుండఁ జొప్పడ దయ్యెన్‌.
24
క. అని పలుకునపుడు దుర్యో | ధనుని కళేబరము దృగ్గతంబగుటయు న
వ్వనిత యిలఁ ద్రెళ్ళె నఱికిన | యనఁటి క్రియన్‌ మూర్ఛఁ జిత్త మవశం బైనన్‌.
25
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )