పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము
యముఁడు ధర్మరాజు నుచిత వచనంబుల సంభాషించుట (సం. 18-3-28)
సీ. అనియె నప్పుడు ధర్ముఁ డభిరామమూర్తి ము | ఖ ప్రసాదంబునఁ గరము వెలుఁగ
నా రాజవర్యునిఁ జేరంగ నరిగి ని | స్సీమగౌరవ! పరీక్షింప! గంటి
నిన్ను ముమ్మా; ఱరణీ ప్రసంగంబున | ద్వైతవనంబునఁ దగిలి కుక్క
తో వచ్చినప్పుడు దైవతగిరిపొంత | ననుజవర్గము విషయంబు గాఁగ.
 
తే. నిప్పు డిచటను; జలన మొకప్పుడైన | నీదుమది నించుకేనియు లేదు; దమము
శమము సత్యంబు మద్గత సారభక్తి | నీకు నగ్గలములు మహనీయచరిత!
048
వ. పరిశోధితుండ వయితి; కలంక దొఱంగి సుఖివి గ’మ్మని పలికి ‘రాజునకు నవశ్యంబును నరకంబు సూచుట గలదు గావున నత్తెఱంగున కయి యేనును వాసవుండును నిన్నుం గడుఁగీడగు నచ్చోటు సొనిపితిమి. సూర్యతనయ పవననందనాదుల నరక దుఃఖానుభావంబులు మా చేసిన యెడ మాయంబులగుట నీకుఁ దెలిసె; వారు పుణ్యలోకవాసులయి యునికియు వాసవు వాక్యంబులఁ దేటపడియె’ నని చెప్పి. 049
క. ‘నీ వియ్యాకాశనదీ | పావన సలిలముల మునుఁగు భవ్యాత్మ ! భవ
ద్భావంబు విడుచు మానుష | భావ వికారముల శోకబంధము లడఁగున్‌.
050
చ. పరమ సుఖంబుఁ జెంది యతిభాస్వరులై విహరించు నీదు సో
దరు లగు కర్ణ ముఖ్యుల ముదం బెసలారఁగఁ జూచె దీ మహో
త్తర బహు సౌఖ్యనిర్మల పదంబున దివ్య విహార లీలలం
బరఁగెద వేల? యిం కిచట బాంధవరక్షక! రమ్ము చెచ్చెరన్‌.’
051
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )