పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
సంజయుఁడు ధృతరాష్ట్రునితోఁ బాండవుల తెఱంగుసెప్పుట (సం. 5-46-15)
తే. ‘పాండురాజ తనూజులపాలి కర్థి | నిమ్మహారాజు పనుపంగ నేఁగి ధర్మ
పుత్త్రుఁ గాంచితి; నాతండు మైత్రి మెఱయఁ | గౌరవుల సేమ మెల్లఁ బేర్వేర నడిగె.
116
వ. మఱియుఁ దగువారల నెల్ల నయ్యై యుచితవిధిం బ్రణామంబున, వినయంబున, బాంధవంబున, మిత్రభావంబున, వాత్సల్యంబునఁ, బ్రసాదంబున నాదరించె; నేనును భూనాథుండు గఱపిన తెఱంగునఁ గొఱంత లేకుండ బంధుత్వంబునకు వలయు మాటలాడితిఁ; బదంపడి కార్యంబు ప్రసంగించి నా యాడిన మాటలకు నయ్యుధిష్ఠిరుండు పలికిన వచనంబు లింత యొప్పునే?’ యని యగ్గించిన, ధృతరాష్ట్రుం డవహి తుండై యడుగఁ, దా నయ్యుధిష్ఠిరునకుం జెప్పిన భంగులు, నతండు వానికి నెల్ల నుత్తరం బిచ్చిన తెఱంగును నెఱింగించి, ధృతరాష్ట్రునకుం, బితామహునకు, దుర్యోధనునకుం గ్రమంబున వారివారితో నాడుమని నియమించిన చందంబులు ధర్మనందను పలుకుల పరిపాటిం దేటపడం జెప్పి సూతసూనుండు వెండియు నిట్లనియె. 117
తే. ‘ఏ నుపప్లావ్య పురమున కేఁగి తొలుత | వాసుదేవార్జునులఁ గంటి; వారు నీతి
పథము దప్పని మాటలు బలిమిఁ దోఁచు | నట్లుగా నాడి; రవి వినుం డాదరించి.’
118
వ. అనిన విని ధృతరాష్ట్రుం ‘డవ్వాసుదేవు చిత్తం బె? ట్లతం డేమనియె?’ నని యడిగిన, నతనికి సంజయుం డిట్లనియె: 119
ఉ. ‘తానును సత్యభామయును ద్రౌపదియున్‌ నరుఁడున్‌ రహస్యగో
ష్ఠీ నిరతాత్ముఁడై సుతులుఁ జేరని చెందని యట్టిచోటఁ గాం
తానివహంబు గొల్వఁ బ్రమదస్థితి నుండియుఁ, బిల్వఁబంచె న
న్నా నలినోదరుండు; హృదయంబున నీ దెస కూర్మియెట్టిదో?
120
వ. ఏనును దత్ప్రకారంబు పణిహారుల వలన మున్న యెఱింగిన వాఁడ నగుటం జేసి కంచుకంబును, శిరోవేష్టనంబును ధరియించి వినీత వేషుండనై పోవునప్పుడు కృష్ణార్జును లనేక మణిమయ భూషణ ప్రభా భాసితులై యొక్కసెజ్జన యున్నవారు; కృష్ణుండు పవ్వళించి యుండి, చాఁచిన చరణంబులు దొడలపై నిడికొని యర్జునుండు గూర్చున్నవాఁడు; సత్యభామయుం బాంచాలియుం గద్దియలపై నున్నవారు; సవినయంబుగా నేనును దండప్రణామంబు సేసిన నన్నాదరించి, కృష్ణుని చేసన్న నర్జును పనుపునం గనక రత్నమయంబగు నతని పాదపీఠం బతండు వ్రేల్చిన కాళ్ళు దిగిచికొన; నిద్దఱు ముద్దియ లెత్తి తెచ్చి నాకుం బెట్టిన, నేనును దానిం గరతలంబున నంటుచు ధరణీతలంబునఁ గూర్చుండి, కేలు మొగిడ్చి ఫాలతలంబునం గదియించి, నీలవర్ణులు బాహుబల మద భరితులును నయి యేనుఁగు దోయియుంబోలె నున్న యమ్మాధవధనంజయులఁ జూచునప్పుడు నాకు హర్షాశ్రు పులకలును, దదనంతరంబ భయంబునుం బుట్టె; నట్టియెడ. 121
క. ‘ఈ యిరువురుఁ బంచిన పని | సేయుదురటె! ధర్మజునకుఁ జేకుఱని తలం
పేయది? యతనిం దొడరుట | వేయేటికి జముని శిరము వ్రేయుట గాదే?’
122
వ. అని తలంచుచుండ, నమ్మహానుభావులు నన్ను సంభావించి, తా రుపయోగించునట్టి యన్నపానంబులను, దమకుఁగట్టఁదగినట్టి వస్త్రంబులను, దాము దొడుగునట్టి భూషణంబులను నాకుఁ బ్రియంబొనర్చి గారవించిరి, నేనును నా పోయిన కార్యంబు విన్నవించిన; విజయుండు బలుమొగంబుతో దానికి నుత్తరంబు వలుకం దొడంగిన వారించి వారిజోదరుం డిట్లనియె: 123
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )