| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: | 2 |
| తే. |
సంజయుఁడు దన్ను వీడ్కొని చనిన ధర్మ | సుతుఁడు మఱునాఁడు దమ్ముల సుతుల నిష్ట భృత్యవరులఁ గొలువునకుఁ బిలువఁ బనిచి | యెల్లవారలు వినుచుండ నిట్టు లనియె. |
3 |
| క. |
‘మనము జనార్దను పాలికిఁ | జని కౌరవసభకు నతనిఁ జనుమని ప్రార్థిం చిన మేలు బంధు హిత గురు | జనములతో రణము గాక సంప్రీతి యగున్.’ |
4 |
| వ. | అని పలికి వార లందఱు బలసి చనుదేర మాధవు మందిరంబున కరిగి యతని చేత సత్కృతుండయి సమస్త పరిజనంబులుం బరివేష్టింప నొక్క పార్శ్వంబునం బాంచాలియు సముచిత పరివార పరివృతయై యుండ నతండునుం దానును సుఖాసీనులై యుండి యతనితో నిట్లనియె: | 5 |
| క. |
‘ఆపదఁ గడవం బెట్టఁగ | నోపి శుభంబైనదాని నొడఁగూర్పను మా కీ పుట్టువునకుఁ బాండు | క్ష్మాపాలుఁడు నిన్నుఁ జూపి చనియె మహాత్మా! |
6 |
| తే. |
సమయ మిది మిత్త్రకార్యంబు చక్కఁ జేయ | నీ కతంబున నే మవినీతుఁ డైన యా సుయోధను తోడి పోరాట దక్కి | యనుభవింతుము మా యంశమగు ధరిత్రి. |
7 |
| వ. | నీకు మేము ప్రద్యుమ్నాది కుమారుల తోడివారము, మమ్ము దురితంబులు వొరయకుండ నరసి రక్షింపు’ మనవుడు వాసుదేవుండు ‘నీ పంచిన యట్ల చేయంగలవాఁడ; నెయ్యది తలంపు? సెప్పు’ మనిన నజాతశత్రుండు ‘నీవు కరినగరంబున కరిగి కౌరవులతోడం దగిన మాటలాడి తెఱంగు సేయవలయు’ నని ప్రార్థించి, యతని నియ్యకొలిపి యిట్లనియె: | 8 |
| సీ. |
‘మా తండ్రి తలఁపును నాతని నందను | చందంబు నిన్న నా సంజయుండు పలికిన పలుకులఁ దెలిసెఁగదా నీకు; | వారి చిత్తము భంగి వాఁ డెఱుంగుఁ; బాలు పంపనియీక మేలిమాటలన మ | మ్మలుక దీర్చెదరు తా; రధిక దుష్క రంబైన యాసమయం బేము పదుమూఁడు | వత్సరంబులు సల్పి వచ్చియుండఁ |
|
| ఆ. |
గులము పాడి నడపఁ దలఁపడ; పతి సెడఁ | దలఁచెనేనిఁ గొడుకు వలచినట్టి వాఁడు గాన యతని వక్రత మాన్పలేఁ; | డింతకంటెఁ గలదె యెడరు మాకు? |
9 |
| క. |
జననియు సమస్త బాంధవ | జనములుఁ బ్రియమంద, వారి శాంతులఁగాఁ జే యను, నెమ్మిగ నొక్కటియై | మననుం దెఱఁగేది యునికి మా పౌరుషమే? |
10 |
| క. |
ఇచ్చటి బంధులు నీవును | నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా కిచ్చినను జాలు నంటిని | బొచ్చెముగా దింతవట్టు పూర్ణము సుమ్మీ! |
11 |
| శా. |
ఆ దుర్యోధనుఁ డంతమాత్రయును జేయంజాలఁడో కాని, పెం పేదం గ్రూరత కోర్వరాదు; సిరి నా కేలందునే, గ్రాసవా సోదైన్యంబులు వచ్చు నా యరయు నీ చుట్టాలకుం; గావునన్ మోదంబందుట గల్గుఁ గౌరవులు నేముం బొంది శ్రీ నొందినన్. |
12 |
| ఉ. |
అక్కట! లాఁతులైనఁ బగఱైనను జంపన కోర నేల? యొం డొక్క తెఱంగు లేదె? యది యొప్పదె? బంధు సుహృజ్జనంబు లా దిక్కున నున్నవారు; గణుతింపక సంపదకై వధించి దూ ఱెక్కుట దోషమందు టను నీ దురవస్థల కోర్వవచ్చునే?’ |
13 |
| వ. | అని పలికి పాండవాగ్రజుండు వెండియు. | 14 |
| ఆ. |
క్షత్త్రధర్మ మింత కష్టమగునె? పెఱ | ధర్మ మాచరింపఁ దగ దటండ్రు గాన శస్త్రజీవికయ తగియున్నది; | యైన వంశనాశ మనభిమతము. |
15 |
| వ. | అదియునుంగాక. | 16 |
| ఆ. |
కలహ మగుట లక్ష్మిఁ గావించుఁ, బ్రాణహా | నియును జేయు; నింత నిక్కువంబు; పలువు రొకని కోడి పాఱుట, బల్లిదు | లనదచేతఁ జెడుటయును ఘటించు. |
17 |
| క. |
జయమగు నోడుదు మను ని | శ్చయ మొక్కఁడు లేదు; వినుము! సమరమునఁ బరా జయము మరణంబు కంటె హృ | దయపుట భేదనము సేయుఁ దథ్యం బనఘా! |
18 |
| క. |
కాన నవశ్యముఁ బెనఁకువ | గాని యుపాయమునఁ బగఱఁ గడతేర్చు ధృతిం బూని నడచు నెవ్వఁడు డెం | దానం జెయివెట్టికొని యతఁడు నిద్రించున్. |
19 |
| ఆ. |
పగయ కలిగె నేనిఁ బామున్న యింటిలో | నున్న యట్లకాక యూఱడిల్లి యుండు నెట్లు చిత్త మొకమాటుఁ గావున | వలవ దధిక దీర్ఘ వైరవృత్తి. |
20 |
| చ. |
పగ యడఁగించు టెంతయు శుభం; బది లెస్స; యడంగునే పగం బగ? వగ గొన్న మార్కొనక పల్కక యుండఁగ వచ్చునే? కడుం దెగ మొదలెత్తిపోవఁ బగ దీర్పఁగ వచ్చినఁ గ్రౌర్య మొందు; నే మిగతిఁ దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా! |
21 |
| ఉ. |
కావున శాంతిఁ బొందుటయ కర్జము; దా నది యట్టులుండె; శ్రీ గావలె నంచుఁ, బోరితము గామియుఁ గోరెద; మెల్లసొమ్ములుం బోవుటయుం గులక్షయము పుట్టుటయున్ వెలిగాఁగ నొండుమై నే విధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁ జుమీ జనార్దనా! |
22 |
| చ. |
మనమునఁ బక్షపాతగతి మాదెస మానుము ధర్మనీతి వ ర్తనముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రా నుచితంబుతోడి మె ల్పునఁ బరుసందనంబునను భూపతులెల్ల నెఱుంగ నాడుమీ! |
23 |
| చ. |
తగవునఁ బోక రాజు బెడిదంబులు వల్కినయేని సైఁచి యొ ప్పుగ నిలుమీ; గురుత్వముఁ బ్రభుత్వమునుం గల పెద్దవారి మా ట గొనమి యా సుయోధను కడన్ నిలువన్ మన మెల్ల గారవం బుగఁ గురువృద్ధు పల్కుఁ దలఁపుం జన నిచ్చిన మెచ్చరే జనుల్? |
24 |
| మ. |
సుతువాఁడై వినయంబు సేకొనక యేచొప్పున్ దగం జెప్ప కా ధృతరాష్ట్రుం డవినీతిఁ జేసినను సంధింపంగ రాదంచు వే గ తెగంబాఱకు తెంపుసేయునెడ లోకంబెల్ల మెచ్చం బ్రకా శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగాఁ జేయుమీ! |
25 |
| ఆ. |
ఇన్ని సంకటముల నిబ్భంగి నెంతయు | నొగులు చిత్తవృత్తి నొవ్వు దీర్ప వెజ్జ వీవకావె! వేయేల? యేగతి | నడపఁ దలఁచి తదియ నాకుఁ బ్రియము.’ |
26 |
| వ. | అని చెప్పి తలంచికొని వెండియు నిట్లనియె : | 27 |
| క. |
‘నీవు సుయోధను పాలికిఁ | బోవఁగ వలదనియు నొక్క బుద్ధి వొడమెడున్; గోవింద! యతఁడు మంత్రులుఁ | గావరమునఁ జక్క వినరు కార్యవచనముల్. |
28 |
| తే. |
కుటిలమతు లవినీతులు క్రూరకర్ము; | లట్టి నీచుల కడకు ని న్ననుపఁజాల; నీవు సంకటపడియెడు దేవపదవి | యైన నే నొల్ల; నొంటి యం దరుగు టుడుగు.’ |
29 |
| చ. |
అనవుడుఁ గృష్ణుఁ డిట్లనియె ‘నా ధృతరాష్ట్రుఁడు నట్టివాఁడ త త్తనయుఁడ యేల; నీ పలుకు తథ్యము; నీ తలఁ పే నెఱింగితి; న్మనమున శంక దక్కుము; వినన్ వలతే విను; మేను నిక్క మ ల్గిన నచటం గలండె రణకేళికి మార్కొన నొక్కఁడేనియున్? |
30 |
| క. |
పనుపుము కౌరవసభ; కేఁ | జను టెట్లును మేల; యర్థ సంసిద్ధియగున్; మన కొకటం బాపము రా | కునికికిఁ గతమైన పలుకు లొండెను గలుగున్.’ |
31 |
| వ. | అని పలికిన యుధిష్ఠిరుం డిట్లనియె: | 32 |
| ఆ. |
‘మేలుగాక నీకుఁ బోలినట్లయిన నం | దరిగి యేము వారు నర్థిఁ బొంది యుండునట్లుగాఁగ నొడఁబాటు గావింపు | మెల్లభంగి మనకు నిదియ లెస్స. |
33 |
| క. |
మ మ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు | నెమ్మి యెఱుఁగు దర్థసిద్ధి నెఱి యెఱుఁగుదు వా క్యమ్ముల పద్ధతి నెఱుఁగుదు | పొ మ్మెవ్వఁడ నేను నీకు బుద్ధులు సెప్పన్. |
34 |