పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
కణ్వుండు దుర్యోధనునితో గరుత్మంతుని వృత్తాంతంబు సెప్పుట (సం. 5-95-1)
క. అదివోలుఁ; దన్ను నెదిరిని | మది నెఱుఁగక నిగ్రహించి మదమెత్తుట యొ
ప్ప; దహంకారం బొనరిం | పదె పౌరుషహానిఁ దొల్లి పక్షీంద్రునకున్‌.
289
వ. అది యెట్లనిన. 290
సీ. అమరేంద్రరథసూతుఁడైన మాతలి దన | సుత గుణకేశికిఁ బతిఁ దగంగ
నారసి యార్యకుండను భుజంగాధిపు | మనుమనిఁ జికురుని తనయు సుముఖు
నర్థిమైఁ గోరిన నార్యకుం డుమ్మలి | కంబుతో నిట్లను “గరుడుఁ డితని
తండ్రి వధించి యెంతయు నల్కమై వీని | నింకిట నెల సమయించువాఁడు
 
ఆ. గాఁగఁ బూనిపోయెఁ గావున నే మియ్య | కొనఁగనేర” మనిన విని ‘బలారి
నడిగి పడసి యిత్తు నాయువు రం’ డని | వారిఁగొనుచు నరిగె సారథియును.
291
వ. వారల భాగ్యంబున నప్పు డింద్రుండును, నుపేంద్రుండును, నొక్కచో నుండం గని మాతలి యక్కార్యంబు విన్నవించినం గరుణించి జిష్ణుండు విష్ణునకుం జెప్పి చేయించువాఁడై వైనతేయు దెసకుం దాన చాలి సుముఖుం జిరాయు రుపేతుం జేసిన 292
క. మాతలి పాణిగ్రహణం | బాతనిఁ జేయించియున్న నంతయు విని తా
నేతెంచి గరుడుఁ డతి కో | పాతురుఁడై రేఁగి పెలుచ నమరాధిపుతోన్‌.
293
క. ‘విను నీ వదితిసుతుండవు | వినత కొడుక నేను; విఱ్ఱవీఁగెడు మనకున్‌
జనకుఁడు గ శ్యపుఁ డొక్కఁడ; | దనుజుల శోధించి చంపుదమ యిరువురమున్‌.
295
క. ఏమిట నీకేఁ దక్కువ | నా మేరకు నడ్డపడితి ‘నావుడు నింద్రుం
డీ మహనీయ మహిమకును | ధామము విష్ణుండుగాక తక్కొరుఁ డగునే?’
296
వ. అనిన విని గటకటం బడి గరుత్మంతుం డిట్లనియె: 297
ఉ. ‘తమ్ముఁడ! నీవు నా కొలఁది తథ్యమెఱుంగక నాకు నీచభా
వమ్మగు భంగిఁ జేసితివి; వాసవ! యి య్యదితి ప్రసూత వం
శ మ్మఖిలమ్ముఁ దాల్తు నొక సన్నపు టీఁకన; యిట్టి నన్ను నీ
విమ్మెయి దూలపుత్తె! యని యీక్షణరోచులఁ గెం పెలర్పఁగన్‌.
298
వ. ఉన్నం గనుంగొని కోపించి వాసుదేవుండు వెడనవ్వు నవ్వుచు. 299
క. ‘నీవేటి మోపుకాఁడవు? | నా వెరవున నిన్ను నడపినను గర్వం బే
లా వెడఁగ’ యంచుఁ దనముం | జే వీఁపున నిడ సురేంద్రజిత్తు వికలుఁడై.
300
క. ఎఱకలు విచ్చుచుఁ దుండము | దెఱచుచు వ్రేఁగడరి సొగసి త్రెళ్ళి వివశుఁడై
యఱచిన నోడకుమని హరి | నెఱి సక్కఁగఁ ద్రోచి యెత్తె నెగయంగఁ గృపన్‌.
301
వ. ఇవ్విధంబునం గేశవుండు గరుణించి గరుడని ననునయించి ‘యింక నవుదానికి నుద్ధతి మాని బుద్ధిగలిగి యుండు’ మని వీడ్కొలిపి పుచ్చినం బోయెం; గావున గర్వంబు గొఱగా’; దింతయు నీ మహానుభావుం డెఱుంగునని నారదుం జూపియితండు మాతలి కన్యా కార్యంబునకుఁ దోడైనడచె; నడుగు; మదియకాదు సర్వేశ్వరుం డగు మాధవు మాహాత్మ్యం బితనికిం గరతలా మలకం బయి యుండు; బ్రభవిష్ణుండగు నాదివిష్ణుండు గదా యీ కృష్ణుం డీతని సహాయత్వంబు గల కౌంతేయులతోడం గూడి మనికి కార్యం’ బనిన నారదుండు ధార్తరాష్ట్రు నాలోకించి.’ 302
క. ‘బలవంతుల బలములు న | నగ్గలమగు బల మెదురఁ గలుగఁగాఁ గీడ్పడు నే
కొలఁదుల వారికి గర్వము | నిలుచునె నయమార్గ వృత్తి నిలిచిన భంగిన్‌.’
303
వ. అని పలికి వెండియు నిట్లనియె: 304
ఆ. ‘ఇదియకాని చేయ నెద్ది యే ననుచు | నిర్బంధవృత్తిఁ దలఁపు వట్టికొనిన
నట్టి వాని కెందు నలజడి వాటిల్లు | గాలవుండు గుఱియ కాఁడె మనకు?
305
వ. వినుము విశ్వామిత్రు పాల విద్యాభ్యాసంబు సేసి గాలవుండను మునికుమారుండు ‘గురుదక్షిణ యేమి సమర్పింతు’ నని యడిగిన, నతం‘డేమియు నేల?’యని యుడిపిన, నుడుగక యెన్ని సెప్పిన నన్నింటికి నన్నిసెప్పి నిర్బంధించినఁ, గటకటంబడి యత్తపోధనవర్యుం ‘డట్లేని శుద్ధ ధవళవర్ణంబులై యొక్క కర్ణంబు నీలంబైన యుత్తమాశ్వంబు లెనమన్నూఱు దెచ్చి యి’మ్మని పలికినం బోయి. 306
తే. గాలవుం డవ్విధము ఘోటకముల నెందుఁ | బడయలేక చింతాభరభ్రాంతుఁ డగుచు
వెడలి యాహార నిద్రలు విడిచి తా మ | హాపథముఁ బోదుఁగాకని యరిగి యరిగి.
307
వ. ఒక్కచో గరుడునిం గని బాలసఖుండు గావున నతనికిం దనవృత్తాంతంబు సెప్పిన నతండు కరుణా భరితుండై 308
క. ‘దేవతలు గాని యిట్టివి | గావింపం జాల రీ సకల దిక్కులలో
దేవేంద్రు దిక్కు బహు దివి | జావాసం బందుఁ బోద మని మునిపుత్త్రున్‌.’
309
క. అఱకడ నిడి ప్రాఙ్ముఖుఁడై | పఱచి జలధిలోనఁ జదలఁ బాఱెడునెడఁ జె
య్వఱి దప్పి నిలువఁ జాలక | యొఱగిన గాలవుని డించె నొక గిరి మీఁదన్‌.
310
వ. ఇట్లు డించి డప్పిదేర్చి యందుఁ గశ్యప నందనుండు శాండిలి యను నొక్క తపస్విశాపంబునఁ బక్షంబులు డుల్లి యనుగ్రహంబునం గ్రమ్మఱ వచ్చిన విషాదమోదంబు లనుభవించి యట ననుట సాలించి మగుడ మహీతలంబునకు మునికుమారుం దెచ్చి యయాతి తన నెచ్చెలియని ప్రతిష్ఠానపురనాథుండగు నతని కడకు నాతనిం దోడ్కొని చని, యగ్గాలవు తెఱం గెఱింగించిన నతండు. 311
క. తన కట్టి గుఱ్ఱములు లే | కునికిని మాధవి యనంగ నొప్పెడు పుత్త్రిన్‌
ముని కొసఁగె దీనికై యే | మనుజేశుఁడు నీఁడె హయసమాజము ననుచున్‌.
312
వ. ఇ ట్లొసంగినం దోడుకొని. 313
తే. ఇట్టి హయములుగల రాజు లెవ్వరొక్కొ! | యనుచుఁ దిరిగి యయోధ్యకుఁ జని తదీయ
నాథు నిక్ష్వాకుఁ గనిన నన్నరవరుండు | దనకు నిన్నూఱ కాని లేవనియె హరులు.
314
క. అన విని మాధవి ఋషికి | ట్లను నొక్క మహానుభావు నతుల వరమునం
దనయవతి నయ్యు నేఁ గ | న్యన యగుదుంగాన నిమ్ము నన్నీతనికిన్‌.
315
వ. ఒక్క సమయంబు సేసికొని యిచ్చి గుఱ్ఱంబులు వచ్చినవి యెల్లరాఁబుచ్చి కొమ్మనిన గాలవుండు నవ్విధంబునకు సమ్మతించె; నపత్యార్థియై యిక్ష్వాకుండును నయ్యుంకువునకు భార్య యగుట పుత్త్రజన్మావధిగా నొడివి యశ్వంబుల నొసంగి కన్యకం బరిగ్రహించి దానియందు వసుమనస్సుండను కొడుకుం బడసి గాలవునకు నమ్మగువను మగుడ సమర్పించినఁ జూచి యబ్భంగిం గలచోట్ల నెల్ల నరసి తురంగంబులం గావించికొమ్మని యతనికిం జెప్పి సుపర్ణుండు సనియె; మఱియు మహీతలంబునం గ్రుమ్మరి యమ్ముని కుమారుండు గందువ లెఱింగి పోవంబోవ. 316
క. ఆ సమయంబునను దివో | దాసుఁడు నౌశీనరుండుఁ దరుణికి నిన్నూ
ఱేసి హయంబుల నిచ్చి మ | హాసత్త్వుల సుతులఁ బడసి రధికప్రీతిన్‌.
317
వ. ఇట్లు క్రమంబునఁ గాశీశ్వరునకుఁ బ్రతర్దనుని భోజపురనాథునకు శిబిం గనిన యక్కన్యకఁ గొని వెండియు వసుంధరం దిరుగుచుండ గరుత్మంతుండు గ్రమ్మఱి వచ్చి యమ్మునితో నీ వింక జాలింబడ వలవ; దొక్క కారణంబున నీ రాజులు మువ్వురకు నివ్వాజులు గలిగె; నింతియకాని యొండెడ నీచందంబున మొత్తంబులై దొరకనేర; వియ్యాఱునూఱు గుఱ్ఱంబులను గురువునకు సమర్పింపు; మొక్కటి సెప్పెద విను’మని యిట్లనియె. 318
క. ఈ మువ్వుర తెఱఁగునఁ దగ | నా మునియుం గొడుకుఁ బడయునట్లుగ ని మ్మీ
కోమలిని గొఱంతకు వి | శ్వామిత్రున కెట్టులైన సంప్రార్థనతోన్‌.
319
వ. అని తానునుఁ దోడుసని యత్తపస్విపాలికింబోయి యత్తెఱం గెఱింగించి, గాలవుం గానిపించి, ‘యీతండు బాలుండు, నీవు దయాళుండ’ వితనిం గృతార్థుం జేయవలయు నని ప్రార్థించి పక్షిరా జక్కార్యంబు చక్కంజేసి పోయిన. 320
క. మునివరుఁ డష్టకుఁ డనియెడు | తనయుఁ బడసి శిష్యునకు సుదతి నొప్పించెన్‌;
వనితయుఁ దపంబు సేయం | జనియెను; గాలవున కిట్టి చరితము గలిగెన్‌.
321
వ. కావున నెట్టివారికి నిర్బంధము దగదు; దుర్మానంబు దుర్దశ నాపాదించు; నయ్యయాతి దుర్మానంబునంగాదె పుణ్యలోక పరిభ్రష్టుండై మాధవీ పుత్త్రులగు నన్నలువురు దౌహిత్రులకతంబున నూర్ధ్వగతిం గనియె; నట్లగుటం జేసి. 322
క. నిర్బంధము దుర్మానము | దుర్బుద్ధికిఁ గాక తగునె? దుర్యోధన! నీ
మార్బలమె పాండవులకున్‌ | దౌర్బల్యము వాయు శుభము దలఁకొను సంధిన్‌.
323
వ. కృష్ణుని మాట విని నీ విక్కౌరవాన్వయంబు రక్షింపు’ మనియె; నివ్విధంబున నమ్మువ్వురు మునీంద్రులు సెప్పిన హితోపదేశంబుల దెస ననాదరంబు సేసి గాంధారేయుండు రాధేయుం గనుంగొని చేయప్పళించి నవ్వి ‘వీర లింత వెఱ్ఱు లగుదురే?’ యని పలికి వారల నవలోకించి. 324
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )