| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘మొనతలఁబడియెదు నీచె | ప్పిన యట్టుల తడవులేదు బిరుదలరై నీ వును వీరు నిలువుఁ డిదె భం | డన మెల్లియ వచ్చె నూఱటలు గనుఁడింకన్. |
365 |
| సీ. |
అరయంగఁ దప్పు లేదంటి నీవలనఁ గీ | డొకనాఁడు సేసియు నొక్కనాఁడు సేయవె? నీ జనించిన యది యాదిగా | నుడుగక పాండవేయులకుఁ జాల నెగ్గు సేసితి విషమిడి, పెనుఁబాములఁ | గఱపించి, నీరిలోఁ గట్టి త్రోచి, లక్కయిల్ గాలిచి, పెక్కు భంగులఁ జంపఁ | దలఁచినఁ జావక ధర్మరక్షఁ |
|
| ఆ. |
జేసి నెగడి రాచసిరి నొందియున్నఁ జూ | పోప కీవు తీవ్ర పాపబుద్ధిఁ గసలి జూద మొకటి కల్పించి కపటంబు | సేయ దాన నెల్ల చేటుఁబుట్టె. |
366 |
| తే. |
అన్నదమ్ముల నెత్తంబు లాడి సతుల | తలలువట్టి సభాస్థలంబులకు నీడ్చి చీర లొలిపింతురే? యిట్టి వారి నెందుఁ | దడవుమా నీ వొకండవు దక్క నధిప! |
367 |
| ఉ. |
అప్పుడు నీవు గర్ణుఁడును నాడిన మాటలు కొల్వులోపలం జెప్పెడునట్టివే? కులము శీలముఁ గల్గిన పుణ్యకాంత క ట్లొప్పమి చేయుటెల్లఁ గనియున్న జనంబులు వించునుండఁగాఁ దప్పొక యింత లేదను విధం బది నీక చనున్ సుయోధనా! |
368 |
| తే. |
ఎత్తి విడిసిన వారని యెల్ల తప్పుఁ | బాండవుల మీఁదఁ బెట్టిన బ్రదుకుగలదె? ద్రోణ భీష్ములుఁ దండ్రియుఁ దోడుతోడఁ | జెప్పు తగుమాట లేమియుఁ జెవులు సొరవు. |
369 |
| క. |
శాంతిం బొందుట నీకుం | గుంతీ పుత్త్రులకు మేలగున్; దానిక యే నింతయు నాడెద; నది నీ | కెంతయు రుచియింపకునికి యెఱిఁగి యెఱిఁగియున్. |
370 |
| వ. | అని యిట్లు నారాయణుండు నానా ప్రకారంబులం జెప్పుటకుఁ గటకటం బడియెడు దుర్యోధనునకు దుశ్శాసనుం డిట్లనియె: | 371 |
| మ. |
‘జనకుండున్ గురుభీష్ములుం దగిన కర్జం బాప్తులై నీకుఁ బ్రీ తి నెఱింగించు తెఱంగు గాదు తమబుద్ధిం బోయి సంధాన మి ట్లొనరం జేయకయున్నఁ గృష్ణుకు నిన్నొప్పించు వా; రింతవ ట్టు నిజం; బిచ్చట నింక నీయునికి నెట్లుం గీడు వుట్టుం జుమీ! |
372 |
| ఆ. |
అనిన బాహ్లికాదులగు కురువృద్ధుల | నాత్మజనకుఁ గృష్ణు నాదరింప కతఁడు రాజసమున నప్పుడు దిగ్గన | లేచిపోయె సంచలించెఁ గొలువు. |
373 |
| తే. |
అతని వెనుకన కర్ణుండు ననుజగణము | శకునియును వారి పొందైన జనపతులును బోయి రమ్మెయిఁ జని యొక్క ప్రోవుగట్టి | వేఱ యంతంత నుండిరి గోఱడమున. |
374 |
| వ. | ఇ ట్లున్నం గనుంగొని గాంగేయుండు. | 375 |
| చ. |
‘ఇతఁ డిదియేల క్రొవ్వి ధరణీశుఁడ నంచు వృథాభిమానియై మతిచెడి లోభమోహ మదమత్సరముల్ దనుఁ ద్రిప్ప ని ట్లసం గతమునఁ బోయె; వీని వెనుకం జని రేమి దలంచియో మహీ పతులును; వీరు గొంద ఱతి పౌరుష మానసు లేమిచేయుదున్?’ |
376 |
| తే. |
అని జనార్దనుఁ గనుఁగొని ‘యకట’ కాల | పక్వమయ్యె నీ నరపతి ప్రతతి కెల్ల ! ననుడుఁ దగువారి దెసఁ గలయంగఁ జూచి | తగవు మెయి నిట్టులనియె నన్నగధరుండు. |
377 |
| శా. |
‘ఈ దుర్యోధనుఁ డింత గర్వియగునే | యీ యున్నవారెల్ల నా చే దైన్యంబునఁ బొందు టొప్పదని చర్చింపండ; యీ భంగికిన్ లేదే యొండు దెఱంగు? సత్కులముఁ బాలింపంగ వర్జింపరా దే? దుష్టాత్మకు నీచు నొక్కరునిఁ? బోదే భేద మీ జాతికిన్? |
378 |
| ఉ. |
కంసుఁడు నిట్ల తండ్రి మది గందెడు చంద మొనర్చి ధర్మ వి ధ్వంసము సేసినం గులమువారలు నా కెఱిఁగింప నేను దు ర్మాంసము గోయు వైద్యుని క్రమంబున నాతనిఁ ద్రుంచి యన్వయో త్తంసముఁ జేయనే జనకుఁ; దద్విధ మొప్పదె మీరుఁ జేసినన్? |
379 |
| ఆ. |
అంతతోడ నెల్ల యాపదలును దీఱు | వంశ మధిక గౌరవంబు నొందుఁ గూడి మనుట గలుగుఁ గురు పాండవులకు ని | త్తెఱఁగు సూడ మీకు నుఱవకాదె? |
380 |
| వ. | అనిన విని ధృతరాష్ట్రుం డదరిపడి విదురున కిట్లనియె: | 381 |
| ఆ. |
‘బుద్ధిమంతురాలు పొందుగఁ బలుకంగ | నేర్చు; వచ్చి కొడుకుఁ దేర్చిపోవుఁ గాన వేగ నీవు గాంధారిఁ దోడితె’ | మ్మనుడు నరిగి యతఁడు నట్లచేసి. |
382 |
| వ. | అద్దేవియు. | 383 |
| క. |
చనుదెంచి యుచిత పీఠం | బున నున్నం గురువిభుండు పొలఁతుకతో ని ట్లను; నీ తనూభవుఁడు దు | ర్వినయంబునఁ జనియె; నిట్టి వెంగలి గలఁడే? |
384 |
| క. |
నీవైనఁ జెప్పి శాంతుం | గావింపఁగ నోపుదేనిఁ గౌరవకుల మీ గోవిందు శాసనము సం | భావింపం గాంచి చెడక బ్రదుకుంజుమ్మీ! |
385 |
| తే. |
అనుడు ‘నీ పుత్త్రుఁ డవినీతుఁ డగుట యెఱిఁగి | యెఱిఁగి వాని వశంబున నేలపోయె దీవు పాండవులకు నేమియిచ్చితేని | నడ్డపడ నెవ్వరికి వచ్చు నధిప! చెపుమ.’ |
386 |
| క. |
అని గాంధారి పతియుఁ దా | నును విదురుం బనిచె నందనుం బిలువ; నతం డును మొగము జేవుఱింపఁగఁ | జనుదెంచెను సభకు విదుర సంప్రార్థితుఁడై. |
387 |
| వ. | మున్ను దనతోడం జనిన వార లందఱు నచ్చోటన నిలువ నిట్లువచ్చి సుయోధనుండు నిజాసనాసీనుండై యున్నఁజూచి తల్లి చిత్తంబున గర్హించుచు నతనికి ధర్మంబును నీతియును జుట్టఱికంబును బ్రదుకుఁదెరువును నిజశక్తియు సహాయంబు గొలందియుఁ గులజన చిత్త ప్రకారంబున బాండుపుత్త్రుల బలపరాక్రమంబులుఁ దెలియునట్లుగాఁ దెఱంగుపడం జెప్పి, బుజ్జగించియుం గినిసియు ననేక విధంబుల నాడిన నమ్మాటల దెస ననాదరంబు సేసి యుద్ధతిం గ్రమ్మఱం జని యతండు కర్ణాదులం గలిసి వారునుం దానును దుర్మం త్రంబునకుం జొచ్చి. | 388 |