ఇతిహాసములు మొల్ల రామాయణము అరణ్య కాండము
శ్రీ రామాయణము - అరణ్య కాండము
క. మునిదత్త ధనుర్వేదా!
మునినాథ ప్రియసతీ సుపూజిత పాదా!
జనకార్చిత గుణధామా!
సనకాది స్తవ్య నామ! జానకి రామా!
1
వ. శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి కెఱింగించిన తెఱంగు వినిపించెద. 2
పంచవటిలో సీతా రాముల మధుర జీవనము
చ. "ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?" యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌.
3
సీ. నడువనేరని కొమ్మ యడుగులు పొక్కులై-శర్కర స్థలముల శ్రమముఁ జెందె,
వీచిన చేతుల వ్రేళ్ళు నెత్తురు గ్రమ్మి-పొటమర్లు కెంపుల పోల్కి నమరె
వడి గాలి సుడివడి వాడిన లేఁదీఁగ-భావంబునను మేని చేవ తఱిగెఁ,
బూర్ణ చంద్రుని కాంతి పున్నమ వేకువఁ-గనుపట్టు గతి మోము కళల విడిచె.
 
తే. ధవుని నడుగడుగునకుఁ గైదండఁ గొనుచు-నెగడు దప్పిని నిట్టూర్పు లెగసి చిగురుఁ
బెదవు లెండఁగ, నీడకు నుదిలగొనుచు-మనసులోఁ జేవ యూఁతగఁ జనెడు వేళ.
4
వ. ఇట్లా సీతయు రాముండును సత్యఋషిం బోని సౌమిత్రియుఁ
గతిపయ ప్రయాణంబులఁ బంచవటికిం జని, సంతోష భరితాంతరంగులై,
5
క. అచ్చటఁ గొన్ని దినంబులు
ముచ్చటపడి యుండఁ దలఁచి ముని ముఖ్యులచే
మచ్చికఁ దమ్ముఁడుఁ దానును
గ్రచ్చఱ నొక పర్ణశాలఁ గావించి తగన్‌.
6
ఆ. అందు రామచంద్రుఁ డనుజన్ముఁడును దాను
గొన్ని వాసరంబు లున్నవేళ
వికృత వేషధారి వేవేగ నట శూర్ప
ణఖ యనంగ దైత్య నారి యోర్తు.
7
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - araNya kAMDamu ( telugu andhra )