| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అవతారిక |
| ఇష్టదేవతా సన్నుతి | ||
| ఉ. |
శ్రీ మహిమాభిరాముఁడు, వశిష్ఠ మహాముని పూజితుండు, సు త్రామ వధూ కళాభరణ రక్షకుఁ డాశ్రిత పోషకుండు, దూ ర్వామల సన్నిభాంగుఁడు, మహా గుణశాలి, దయా పరుండు, శ్రీ రాముఁడు ప్రోచు భక్తతతి రంజిల్లు నట్లుగ నెల్ల కాలమున్. |
1 |
| ఉ. |
శ్రీనగ మందిరుం, డమర సేవితుఁ, డర్థ శశాంక మౌళి, స న్మౌని మనఃపయోజ దిననాయకుఁ, డబ్జభవామరేశ్వర ధ్యాన లసత్ప్రసన్నుఁ డతి ధన్యుఁడు, శేష విభూషణుండు, వి ద్యానిధి, మల్లికార్జునుఁడు, తా నిడు మాకు శుభంబు లొప్పఁగన్. |
2 |
| ఉ. |
తెల్లని పుండరీకముల తేజము మెచ్చని కన్నుదోయితో నల్లని శక్రనీల రుచి నవ్వెడు కోమల దేహ కాంతితో నల్లనఁ బిల్లఁ గ్రోవి కర మంచిత సంజ్ఞల నింపు నింపఁగా గొల్లతలన్ విరాళి తగఁ గొల్పెడు కృష్ణుఁడు ప్రోచుఁగావుతన్. |
3 |
| ఉ. |
మించి, సమస్త లోకములు మిన్నక తాఁ దన నేర్పు మీఱ ని ర్మించి, ప్రగల్భతన్ మెఱసి, మేలును గీడును బ్రాణికోట్లు సే వించ ఘటించి శాస్త్రములు, వేదములుం గొనియాడుచుండు నా కాంచన గర్భుఁ డిచ్చు నధికంబుగ నాయువు నీప్సితార్థముల్. |
4 |
| సీ. |
చంద్ర ఖండ కలాపుఁ జారు వామన రూపుఁ-గలిత చంచల కర్ణుఁ, గమల వర్ణు, మోదకోజ్జ్వల బాహు, మూషకోత్తమ వాహు-భద్రేభ వదను, సద్భక్త సదను, సన్మునిస్తుతిపాత్రు, శైలరాడ్దౌహిత్రు-ననుదినామోదు, విద్యా ప్రసాదుఁ, బరశువరాభ్యాసుఁ, బాశాంకుశోల్లాసు-నురుతర ఖ్యాతు, నా గోపవీతు, |
|
| తే. |
లోక వందిత గుణవంతు, నేక దంతు-నతుల హేరంబు, సత్కరుణావలంబు, విమల రవి కోటి తేజు, శ్రీ విఘ్న రాజుఁ-బ్రథిత వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు. |
5 |
| చ. |
కరిముఖుఁడుం, గుమారుఁడు వికారపుఁ జేఁతల ముద్దు సూపుచున్ గురుపులు వాఱుచున్సరిగ గుట్టలు దాటుచుఁ చన్ను దోయితో శిరములు రాయుచుం గబరిఁ జేర్చిన చంద్రునిఁ బట్టి తీయఁగాఁ గరములఁ జాఁప నవ్వెడు జగమ్ముల తల్లి శుభంబు లీవుతన్. |
6 |
| ఉ. |
సామజయుగ్మ మింపలరఁ జల్లని నీరు పసిండికుండలన్ వేమఱు వంచి వంచి కడు వేడుకతో నభిషిక్తఁ జేయఁగాఁ దామరపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా కాముని తల్లి సంపద లఖండముగా నిడు మాకు నెప్పుడున్. |
7 |
| ఉ. |
మేలిమి మంచు కొండ నుపమింపఁగఁజాలిన యంచ నెక్కి, వా హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా వాలిక సోగ కన్నుల నివాళి యొనర్చి, ముదంబు గూర్చు వి ద్యాలయ, వాణి శబ్దముల నర్థములన్ సతతంబు మాకిడున్. |
8 |
| |