| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అయోధ్య కాండము |
| శ్రీ రామాయణము - అయోధ్యా కాండము | ||
| క. |
కందర్ప రూప! ఖండిత కందర్ప విరోధి చాప! కరుణా ద్వీపా! వందిత శుభ నామా! ముని సందోహ స్తుత్య భూమ! జానకి రామా! |
1 |
| వ. |
శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహాముని కెఱిగించిన తెఱంగు వినిపించెద నాకర్ణింపుము. |
2 |
| శ్రీ రామునకుఁ బట్టాభిషేక సన్నాహము | ||
| సీ. |
తన సుమంత్రాది ప్రధానులతోఁ గూడి-సుఖ గోష్ఠి నుండగ నఖిల మునులఁ జక్కఁగా రావించి, సమ్మదంబున వంశ-గురువుతో దశరథ ధరణినాథుఁ డనియె: నీ భూభారమంతయు నొక్కట-నేలితిఁ జాలదే యేక హేళి? నటుగాక పగతుర నవలీల గెల్చితి,-నిల్పితి ధర్మమ్ము నిష్ఠతోడ |
|
| తే. |
నింత చాలదె? యాశకు నెంత కెంత?-రామచంద్రుని ధరణికి రాజు గాఁగ మీరు సూడంగఁ బట్టంబు భూరి మహిమఁ-గట్టవలయును మంచి లగ్నమునఁ జెలఁగి. |
3 |
| తే. |
అనుచు గురునకుఁ దెల్పి, తా నతని సమ్మ తమున సౌభాగ్య మంగళ ద్రవ్య సమితిఁ గూర్చుఁ డనుచును మంత్రులకును నెఱుంగఁ జెప్పి, శృంగార మీ పురిఁ జేయుఁ డనియె. |
4 |
| వ. | అట్టి సమయంబున | 5 |