| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అయోధ్య కాండము |
| చంద్రోదయ వర్ణనము | ||
| ఉ. |
భాను సహస్ర సత్కిరణ పంక్తుల నుద్భవ మైన యా బృహ ద్భానుని వెట్టఁ బెల్లుడుకఁ బడ్డ సుధాంబుధి మీఁది మీఁగడల్ పూని సమీరుచేఁ దెరలఁ బూర్వ దిశం గనుపట్ట దానిపై ఫేన మనంగ నొప్పె శశి బింబము తూరుపుఁ గొండపైఁ దగన్. |
13 |
| చ. |
కుముదములుం, జకోరములుఁ, గోమల సస్యముఁ, జంద్రకాంతముల్ రమణఁ జెలంగ వెన్నెల తిరంబుగఁ జేసె జగంబు లుబ్బఁగాఁ, గమలములున్, వియోగు, లధికంబుగఁ జోరులుఁ, జక్రవాకముల్ రమణఁ గలంగ వెన్నెల తిరంబుగఁ గాచె జగంబు లుబ్బఁగాన్. |
14 |
| ఉ. |
నారదు లైరి సన్మునులు, నాక మహీజము లయ్యె భూజముల్, శారద లైరి భామినులు, శంకర శైలము లయ్యె గోత్రముల్, పారద మయ్యె నీరధులు, పన్నగ నాయకు లయ్యె నాగముల్, వారిద వర్గ మెల్ల సిత వర్ణము లయ్యెను బండు వెన్నెలన్. |
15 |
| చ. |
కొడు కుదయించె నంచలరి కోరి సుధాంబుధి మిన్ను ముట్టి, య ప్పుడు జగమెల్లఁ గప్పె ననఁ బూర్ణత నొందెను సాంద్ర చంద్రికల్ పుడమికిఁ బాలవెల్లి గతిఁ బొల్పెసలారఁగఁ జంద్రుఁ డొప్పె, న య్యుడుపతి మేని మచ్చయును నొప్పెఁ బయోనిధిఁ బద్మనాభుఁడై. |
16 |
| వ. | అట్టి సమయంబున, | 17 |
| ఉ. |
కోరి చకోర దంపతులు గుంపులు గుంపులు గూడి, రంతులన్ బేరిన చంద్రికా రసముఁ బేర్కొని మార్కొని పొట్ట నిండగాఁ బారణ సేసి, పెన్ బయలఁ బ్రాఁకుచుఁ, జంచు పుటంబు లెత్తుచున్ బేరెము వారుచుండె మదిఁ బ్రేమ జనింప వధూటి కోటికిన్. |
18 |
| ఉ. |
వెన్నెల తీఁగలన్ గొనలు వేడుక ముక్కలఁ ద్రుంచి తెచ్చి, దా ర్కొన్న ప్రియాంగనా తతికిఁ గూరిమి నోరికి నిచ్చి, కేళికిన్ సన్నపుఁ కంఠ నాళముల సన్నలు సేసి సుఖించె నింపుగన్ దిన్నని చంద్రకాంత మణి తిన్నెలమీఁదఁ జకోర దంపతుల్. |
19 |