ఇతిహాసములు మొల్ల రామాయణము అయోధ్య కాండము
భరతుని భాతృ భక్తి
మ. ఘనుఁడా రాముఁడు చిత్రకూటమున వేడ్కంజేరి యున్నంతలో
నన దంతావళ వాజిరత్న రథ నానా యోధ సంఘంబుతో
డ, నమాత్య ద్విజ బంధు వర్గములతోడం గూడి వాద్యంబులం
జనుదెంచెన్‌ భరతుండు రాముకడకున్‌ సద్భక్తి సంపన్నుఁడై.
37
సీ. చనుదెంచి, రాముని చరణంబులకు మ్రొక్కి,-కైకేయి చేసిన కపటమునకు
నగరంబు విడిచి, యీ పగిది ఘోరారణ్య-మున కిట్లు రానేల మునుల పగిది?
నది గాక, మన తండ్రి యత్యంత మైనట్టి-పుత్త్ర శోకంబునఁ బొక్కి పొక్కి
త్రిదశాలయమ్మున దేవేంద్రుఁ గనఁ బోయె-నని చెప్ప విని రాముఁ డంతలోన
 
తే. భరత లక్ష్మణ శత్రుఘ్ను ధరణి సుతులఁ-గూడి దుఃఖించి దుఃఖించి, కొంత వడికి
నాప్త వర్గంబుచే మానె, నంతమీఁద-భరతుఁడిట్లనె శ్రీరామభద్రుతోడ.
38
తే. "రాజు లేకున్నచో మఱి రాష్ట్రమందుఁ
గార్య మెట్లౌను? మీ రెఱుంగనిది కలదె?
నేఁటి సమయానఁ బట్టంబు నిలుపుకొనఁగఁ
దిరిగి విచ్చేయుఁ" డనుడు నా భరతుతోడ
39
వ. శ్రీ రామచంద్రుం డిట్లనియె. 40
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - ayOdhya kAMDamu ( telugu andhra )