ఇతిహాసములు మొల్ల రామాయణము సుందర కాండము
శ్రీ రామాయణము - సుందరకాండము
క. సూర్యకుల రత్న దీపా!
సూర్య సహస్ర ప్రతాప! సుందర రూపా!
ఆర్యారాధిత నామా!
శౌర్యాధిక సుగుణ సీమ! జానకి రామా!
1
వ. శ్రీ నారద మహా ముని వాల్మీకి కెఱింగించిన
తెఱంగు విన్నవించెద నవధరింపుము.
2
సంపాతి కపివీరులకు సీత యునికిని దెలుపుట
తే. రామునకు మ్రొక్కి యక్కపిరాజు కరుణఁ
దత్క్షణంబున వెడలిరి దక్షిణంబు
వెదకువా రగు వానర వీర వరులు
పంతముతోడ నెంతయు సంతసమున.
3
క. మును తా మేఁగిన దిక్కులు
పనివడి వెదకంగఁ జనిన బలిముఖు లెల్లన్‌
జనకజఁ గానక వచ్చిరి
మనుజేశుని కడకు చనిన మార్గంబుననే.
4
వ. అట్టి సమయంబున, 5
క. గిరులును, నదులును, వనములుఁ
బరికింపుచుఁ, బట్టణములు బహు విధ గతులన్‌
దిరుగుచు వెదకుచుఁ, గానక
కరువలి సుతుఁ డాది యైన కపి వరు లెదుటన్‌.
6
క. ఆలోఁ గాంచిరి సత్కపి
జాలముఁ, గరి శరభ సింహ శార్దూల మృగా
భీలముఁ, బుణ్య కదంబ వి
శాలము నగు నమ్మహేంద్ర శైలము లీలన్‌.
7
వ. ఇట్లు మహేంద్ర పర్వతంబు గనుంగొని డాయంజని యచ్చట. 8
ఉ. ఆ తఱి వానర ప్రవరు లా ధరణీ సుతఁ గానలేక దుః
ఖాతురులై వగం బడఁగ నయ్యెడఁ దద్గిరినుండి వచ్చి సం
పాతి యనం బ్రసిద్ధుఁ డగు పక్షి కులేంద్రుఁడు రావణుండు దా
సీతను గొంచుఁ బోవుగతిఁ జెప్పుచుఁ దెల్పెను లంక త్రోవయున్‌.
9
క. ఆ పక్షీంద్రునిచేతను
జాపల శుభనేత్ర రామచంద్రుని దేవిన్‌
బాపాత్ముఁ డైన దైత్యుఁడు
వే పట్టుక చనిన త్రోవ విని కపు లెల్లన్‌.
10
వ. మహానందంబు నొంది యమ్మహేంద్ర పర్వతం బారోహించి పురోభాగంబున. 11
క. ఆ కపి వీరులు గనుగొని
రాకాశనదీ ప్రచుంబితార్భట భంగా
నీక మహాఘనరవ భయ
దాకార నటత్ప్రకాశు నాజలధీశున్‌.
12
వ. అట్లు కనుంగొని. 13
క. తమ తమ సత్త్వ స్థితులును
గమియించెడు నబ్ధి కొలదిఁ గనుకొని మదిలో
బ్రమయుచుఁ బలికెను గపి సం
ఘము లెంతయు డెందమందుఁ గళవళపడుచున్‌.
14
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - suMdara kAMDamu ( telugu andhra )