| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| లంకా నగర సందర్శనము | ||
| ఉ. |
భేరికి సాటి యౌ దనుజ భీషణ భాషలు, భద్ర నాగ ఘీం కార నినాదముల్, హయ నికాయపు హేషలు, కాహళ ధ్వనుల్ వీర మృదంగ నాదములు, విశ్వ భయంకర లీల లంకలో బోరు కలంగఁగా, శ్వసన పుత్త్రుఁడు చాలఁగ నాలకించుచున్. |
21 |
| ఉ. |
కోటికిఁ గోటులై పరఁగు కుంజర వర్గము, ఘోటకంబులున్ గోటికి నెక్కుడై పరగుఁ గోత్ర సమానములౌ రథంబులున్ గోటికి హెచ్చులై పరఁగు ఘోర నిశాచర కోటి కోట్లతో సాటికి నెక్కు నప్పురము సాహసవంతుఁడు గాంచె ముందరన్. |
22 |
| వ. | ఇట్లా లంకాపుటభేదనంబును వీక్షించి తన మనంబున, | 23 |
| శా. |
ఘోరాకారులు, కామరూపులు, మహాక్రూరాత్ము, లత్యుగ్రు లీ శూరుల్, వీరలఁ గన్నుఁబ్రామి పురిలో శోధించు లా గెట్లొకో? యీ రూపంబునఁ బోవఁగాఁ గనిన వా రెగ్గేమి గావింతురో? నారీ రత్నము సీత నందుఁ గనఁగా నా కెట్లు సిద్ధించునో? |
24 |
| వ. | అని తలంచుచున్న యవసరమ్మున, | 25 |
| ఉ. |
క్రుంకెఁ బయోజ బాంధవుఁడు, గూండ్లకుఁ బక్షులు సేరె నెల్లెడన్ బొంకము తీసెఁ దామరలు, పూచెను గల్వలు, తారకావళుల్ బింకముఁ జూపెఁ గాంతి, నళి బృందములు కూర్కెఁ, దమంబుఁ బర్వె, నే వంకను జార చోరకులు వ్రాలి చరించిరి కౌతుకంబునన్. |
26 |
| వ. |
ఇట్లు నిశా సమయమునందుఁ దన మేటి గాత్రం బణు మాత్రంబుగా గుదియించి, యగ్గిరి డిగ్గి చనుచు, నల్ల నల్లనఁ బుర ద్వారంబు నొద్దకుఁ జేరి, వానర పుంగవుఁడు పుర ప్రవేశంబు సేసి, |
27 |