| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| రావణుఁడు కుపితుఁడై సీతకు వ్యవధి నొసఁగుట | ||
| క. |
ఆఁటదిగ యని కూరిమి పాటించిన కొలది నన్నుఁ బలుకఁగఁ జొచ్చెన్, మాటాడకుండ నాలుక తూఁటులుగాఁ జేయకున్న దోసము గాదే! |
69 |
| క. |
కుయ్యాడక నా ముందఱఁ గయ్యమునకుఁ గాలు దువ్వఁ గడఁగెను దీనిన్ దయ్యాలకు బలి వెట్టెద వ్రయ్యలుగా నఱికి యెల్లవారును జూడన్. |
70 |
| క. |
కాకున్న దీని బలిమిని బైకొని నాకాంక్ష దీఱ భావజ కేళిన్ జేకొనక విడిచిపెట్టినఁ గైకొనునే నవ్వుఁ గాక గర్వము పేర్మిన్. |
71 |
| శా. |
భీమాటోప భుజ ప్రతాప మహిమన్ భీమాచలం బెత్తి, సు త్రామాద్యష్ట దిగీశ సైన్యముల సంగ్రామంబులో నోర్చి, యు ద్దామ ప్రౌఢిఁ జెలంగుచుండెడు కళా ధాముండ, నా ముందటన్ రామున్ గీముని జెప్ప గిప్ప నగరా రాకేందు బింబాననా! |
72 |
| సీ. |
అఖిల లోకముల నా యాజ్ఞ నిల్పితి నేక-హేలను బుష్పకం బెక్కి తిరిగి, వేల్పు మూఁకలచేత వెట్టి సేయించితి-దితి వంశ వల్లభుల్ నుతులు సేయ, గణములతోఁ గూడ గైలాస మెత్తితి-బటువైన పూవుల బంతి పగిది, వనజ గర్భునిచేత వరములు గైకొంటి-దండిగా నత్యుగ్ర తపము సల్పి, |
|
| తే. |
చెఱలు పట్టితి గంధర్వ సిద్ధ సాధ్య-భుజగ సుర యక్ష కిన్నర ముఖ్య సతుల, నిట్టి సామర్థ్య మెవరి కేనాఁడు గలదు?-మహిని నా కొక్కనికె కాక మంజువాణి! |
73 |
| తే. |
నాకు నెదిరింప నొక పేద నరుని నొడ్డి వెఱవ కీ రీతి దుర్భాష లఱచు దీని జిహ్వ మొదలంటఁ బట్టి యీ శిత కుఠార ధారఁ దునుమాడి ధారుణిఁ బాఱవైతు. |
74 |
| వ. |
అని చంద్రహాసంబు జంకించి లేవ నుంకించు తఱిఁ గొందఱు ప్రియ సుందరు లడ్డంబు సొచ్చి, |
75 |
| చ. |
సురవరుఁడో? ధనంజయుఁడొ? సూర్యతనూజుఁడొ? యాతుధానుఁడో? శరధి విభుండొ? గొప్పొ? పురశాసను మిత్త్రుఁడొ? భోగిభూషుఁడో? గురుభుజశక్తిఁ గైకొనుచుఁ గోపము సూపఁగ నీకు నెంత యి త్తరుణిపయిం బ్రతాపమున దారుణ కృత్యము సేయఁ గూడునే? |
76 |
| క. |
ఏటికి మీ రిటు కినియఁగ గాటపు జంకెనయె చాలుఁ, గరవాలున కీ యాఁటది యర్హమె? మము నీ మాటికి మన్నించి కావుమా యిఁకఁ జాలున్. |
77 |
| వ. |
అని శాంత వచనంబులఁ బ్రియంబు సెప్పిన యప్పంకరుహాక్షుల విన్నపంబులు మన్నించి, యారాక్షస చక్రవర్తి వైదేహికిఁ గావలి యున్న యేకజటా ద్విజటా త్రిజటా దుర్ముఖీ వాయుముఖీ శూర్పణఖ లాదిగాఁ గల దైత్య కామినుల వంకఁ గనుగొని. |
78 |
| క. |
గడు విచ్చితి నిరు మాసము లొడఁ బఱుపుఁడు నేర్చినట్టు, లొడఁబడ కున్నన్ గడి కండలుగాఁ గోసుక పడఁతులు భక్షింపుఁ డింతి పలలం బంతన్. |
79 |
| వ. | అని రోషారుణిత నేత్రుండై యతి భీషణాకారంబుఁ దాల్చి పలికిన. | 80 |