| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| హనుమంతునిచే రావణుని యధిక్షేపము | ||
| క. |
కుటిల భ్రూకుటి నటన స్ఫుట ధూమ విలాస పవన ఫూకృతి జనితో ద్భట రోషానల కీలో త్కట నేత్రుం డగుచుఁ బలికెఁ గటము లదురఁగన్. |
196 |
| ఉ. |
ఎవ్వఁడ వోరి? నీకుఁ బ్రభు వెవ్వఁడు చెప్పుము? నీ విటొంటిమై నివ్వనరాశి దాఁటి యిట కే గతి వచ్చితి? నామ మేమి? నీ వెవ్వని ప్రాపునం బెఱికితీ వనమంతయు శంక లేక? యిం కెవ్వని పంపునం దునిమితీ సురవైరుల నెల్ల నుగ్రతన్? |
197 |
| సీ. |
అమర వల్లభు భోగ మంతయుఁ గైకొని-వీతిహోత్రుని సిరి నీటముంచి, జముని కింకరులను సంహారమొనరించి-రాక్షసాధీశ్వరు శిక్షసేసి, యంభోధినాథుని గాంభీర్య మణఁగించి-దోర్బలంబున గాలిఁ దూలబట్టి, విత్తనాథుని మహా విభవంబు గొల్లాడి-శూల హస్తుని నొక్క మూల కదిమి, |
|
| తే. |
అమర గంధర్వ కిన్నర యక్ష భుజగ-గరుడ గుహ్యక ముని సిద్ధ వరుల నెల్లఁ బట్టి మును వెట్టి సేయించునట్టి నన్ను-విన్నయంతన గుండెలు వ్రీల వెట్లు? |
198 |
| చ. |
శరనిధి దాఁటి వచ్చుటయ చాలక నా పురిఁ జొచ్చి, చొచ్చియున్ వెఱవక బంటవై వనము వేళ్ళకుఁ ద్రుంచితి, త్రుంచి క్రమ్మఱన్ బిరుదవు పోలె రాక్షసులఁ బెక్కురఁ జంపితి, చంపి నెమ్మదిన్ గరకరితోడ నా యెదుర గర్వముతోడ నిల్చి తద్దిరా! |
199 |
| క. |
ఖండించెద నీ చేతులు, తుండించెద నడుము రెండు తునుకలు గాఁగన్, జెండించెదఁ గత్తులతో, వండించెద నూనెలోన వారక నిన్నున్. |
200 |
| వ. |
ఇట్లు పట్టరాని కోపంబున నాటోపంబుగాఁ బలుకుచున్న రావణా సురుం జీరికిం గొనక హనుమంతుం డిట్లనియె. |
201 |