| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| రావణునికి విభీషణుని హితోపదేశము | ||
| తే. |
అవధరింపుము దేవ! మహానుభావ! మనపురమ్మునఁ బ్రకృతము చనుతెఱంగు విన్నవించెద నున్నది యున్నయట్లు కొంచె మవధానముగ నాలకించుమయ్య. |
10 |
| సీ. |
అన్నంబు నీరును నక్కఱ లేకుండ-భటు లందఱును దుఃఖపడుదురయ్య కంబాలఁ గట్టిన గజబృంద మెల్లను-జవసత్త్వములు దూలి జడిసెనయ్య హర్షంబుతోడుత హయజాతమంతయు-మెడ లెత్తుకొని వేడ్క మెలఁగెనయ్య ప్రజ్వలించుచు నున్నప్రతిహోమకుండంబు-బొగలు గ్రమ్ముచు నాఱిపోవునయ్య |
|
| తే. |
ఇట్టియపశకునముల గన్పెట్టుమయ్య-సకలశాస్త్రంబు లెఱిఁగిన జాణవయ్య యింపుగాఁ జెప్పుచుంటి నాలింపుమయ్య-వేగ రాముని సతి నిచ్చివేయుమయ్య. |
11 |
| క. |
సీతను దెచ్చుట మొదలుగ నీతో నయవాక్యములను నేఁ జెప్పితి నీ చేతమునఁ బెట్టవైతివి ఖ్యాతిగ నిఁక నైన సీత నాతని కిమ్మా. |
12 |
| వ. |
అదియునుంగాక మొన్నరాతిరి సీతయొద్దఁ గావలియున్న రాక్షసకాంత లందఱును నిద్రించుచున్న సమయంబునఁ ద్రిజట దిగ్గనమేల్కాంచి నిదురించుచున్న స్త్రీలను లేపి చెప్పిన దుస్స్వప్నంబు విన్నవించెద నాకర్ణింపుము. రామచంద్రుండు మనలంకపై దండు విడిసినట్లును నీవును గుంభకర్ణుండును దక్షిణాభిముఖులై గార్దభంబులపై నెక్కి పితృభూమి కరుగుచున్నట్లును నింద్రజిత్తాదికుమార వర్గంబును సైన్యంబును మూలబలంబును సర్వంబును నశించిపోవుచున్నట్లును సీతం జేకొని శ్రీరామచంద్రుం డయోధ్యకుఁ బోవుచున్నట్లును గలఁగన్నదఁట. త్రిజటకల నిక్కంబై తోఁచెడిని. రాముండు వానరసైన్యంబుతోఁ గూడి సముద్రతీరంబునకు వచ్చియున్నాఁడని చారులు విన్నవించిరి. ఆ రాముని దూతలు మఱల నిచ్చటకు రాకమునుపే శ్రీరామచంద్రునకు సబహుమానంబుగా సీతను సమర్పించుటయు లెస్స కార్యము. ఇంతచెప్పనేల మొన్న నొక్కదూత వానరవేషంబున వచ్చి తన పరాక్రమంబు నీకును బరివారమునకును నెఱింగించిపోయె నది గుఱుతుంచుకొమ్ము. అనియిట్లు నీతిచెప్పు తమ్మునిపైఁ గోపించి దిగ్గన కొలువుకూటంబు విడిచి యంతఃపురంబునకుఁ బోయె. నా సమయంబున నా సభలోని వారందఱును దమతమ మందిరంబుల కరిగిరి. |
13 |
| క. |
మఱునాఁ డెప్పటియట్లనె సురుచిరముగఁ గొలువు సేయఁ జోద్యంబుగ ని ద్దుర బోవుకుంభకర్ణుఁడు సరిగా మేలుకొని వచ్చె సరభసలీలన్. |
14 |
| వ. |
ఇట్లు వచ్చి గృహప్రవేశంబుఁ జేసి స్నానాదిక్రియలు నిర్వర్తించుకొని భుజియించి మంత్రులతో నన్నకొలువునకుఁ జనుచుండు కుంభకర్ణునితో మఱల విభీషణుండు మంత్రిసహితుండై వచ్చెను. అనుజు లిద్దఱును వచ్చి నమస్కరించిన దీవించి సేమం బడిగి యుచితాసనంబులం గూర్చుండ నియోగించినఁ గుంభకర్ణుం డత్యంతమును నాసన్నుండై కూర్చుండెను. కొంచెము దూరములోఁ గూర్చుండియున్న విభీషణుండు మరల నన్నతో నిట్లనియె. |
15 |
| సీ. |
దశరథరాముండు తనపత్నిఁ గోల్పోయి-వానరావళిఁ గూడి వచ్చి యిప్పు డదె చూడు మంభోధియావలి యొడ్డునఁ-గపిబలంబులతోడఁ గలసి యుండె రాముని సత్త్వంబు రమణిచే మున్వింటి-మాతనితమ్ముండు నట్టిఁడంట సొరిది వారికిఁ బ్రాపు సుగ్రీవుఁ డున్నాఁడు-వార్ధి నిన్ ముంచినవానితమ్ముఁ |
|
| తే. |
డాతఁడిట వచ్చి నిన్ను నుగ్గాడి కాని-సీతఁ దే నని పంతంబు చేసె నంట వలదు వైరమ్ము సీత నీవలయు వేగ-నతని నని గెల్వఁగా జాల్ రమరవరులు. |
16 |
| తే. |
రాముఁ గెలువంగ వచ్చునే రాజసమున సీత నర్పించి తత్పదాబ్జాతములకు నర్థిఁ బ్రణమిల్లి శర ణన్న నతఁడె కాచు సత్యసంధుండు సత్కృపాసాంద్రుఁ డతఁడు. |
17 |
| ఆ. |
చంప వచ్చినట్టి శత్రువు నైనను శరణు జొచ్చినంత సదయుఁ డగుచు నభయ మిచ్చి కాచు టాతని బిరుదంట సీత నిచ్చి రాముఁ జేరి బ్రతుకు. |
18 |
| వ. | అనిన విని రావణుండు కటకటంబడి విభీషణునితో రోషభీషణంబుగా నిట్లనియె. | 19 |