| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| విభీషణ శరణాగతి | ||
| సీ. |
భానుకులోత్తంస! వందితామరలోక!-జానకీనాయక! శరణు! శరణు! తాటకాప్రాణవిదారణ! రఘురామ!-సకలలోకాధార! శరణు! శరణు! దిక్కు నీవని వచ్చితిని దీనమందార!-పరమపూరుష! రామ! శరణు! శరణు! మాతృపిత్రాదులమాడ్కి సంరక్షించు-సర్వలోకస్తుత్య! శరణు! శరణు! |
|
| ఆ. |
రాను వెఱచినాఁడ రక్షించు రక్షించు-మిపుడు నాకు నభయ మిమ్ము ఇమ్ము చూడు చూడు నిన్నుఁ జొచ్చితి శరణమ్ము-కావు కావు నన్నుఁ గరుణతోడ. |
31 |
| వ. |
అని యివ్విధంబున రామచంద్రుని స్తుతిసేయుచుఁ జేరవచ్చు తఱిని సుగ్రీవుండు శ్రీరామచంద్రునిఁ గని విశ్వాసంబు సూపువాఁడై దేవా వీఁడు రావణుని తమ్ముండు విభీషణుం డనువాఁడు రాక్షసులు మాయలు సేయుదురు గాన వీని వధియింప నాజ్ఞయొసంగు మనిన రామచంద్రుం డందులకు సమ్మతింపక యితండెవ్వండైన నేమి శరణన్న రావణుని తమ్మునినేకాదు రావణునైనను గాచెద శరణని వచ్చిన వాని ప్రాణంబులు గాపాడుట రాజులకుఁ బరమధర్మంబు. తొల్లి శిబి చక్రవర్తి రాజ్యంబు సేయుచుండ నొక్కఖగం బేతెంచి శరణు చొచ్చిన నభయం బిచ్చి తన దేహముం గోసి దానిం దఱుముకొని వచ్చిన డేగ కిచ్చెనఁట. కావున నాతని నాయొద్దకుఁ గొని రమ్మనవుడు సుగ్రీవుండు విభీషణునిఁ దోడ్కొని తెచ్చి శ్రీరామచంద్రుని పాదారవిందములపైఁ బడవైచిన నతండు విభీషణునెత్తి యాలింగనంబుచేసి యభయప్రదానం బొసఁగి నేఁడు మొదలు నీవు మాకు హితుండవు బంధుండవు నయితివి గావున నిన్ను మా తమ్ములలో నొకనిఁగాఁ జూచు కొనియెద నని నమ్మఁబలికి విభీషణా! యింక వైరిప్రభావంబు చెప్పుమనిన దశరథ నందనునకుం వందనం బాచరించి కరంబులు శిరంబునధరించి యతం డిట్లనియె. |
32 |