| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| మండోదరి దీనాలాపములు | ||
| తే. |
రామచంద్రుండె యాదినారాయణుండు గపులె దేవత లని నీకుఁ గనఁబడంగ నెల్ల వేళల నేఁ జెవి నిల్లు గట్టి విన్నపము సేయ నామాట వినకపోతి. |
12 |
| మ. |
మయదైత్యేంద్రునకుందనూజ నయి సేమంబొప్ప నీపత్నినై జయవెట్టంగను నింద్రజిజ్జననినై సర్వాంగనాపూజ్యనై భయ మెన్నండు నెఱుంగనట్టినను నిబ్భంగిన్ వనాటుండు ని ర్భయవృత్తిందలవట్టి యీడ్వఁగనుఁ గోఁబాలైతి నీముంగలన్. |
13 |
| క. |
రాముని దూతలు నన్నును బాములు వెట్టంగఁ జూడఁ బండువె నీకున్ నామానము గాపాడని నీ మానుష మేటి కిపుడు నిర్జరవైరీ. |
14 |
| ఉ. |
ఈ మునివృత్తికన్న దనుజేశ్వర! రామునితోడ నేఁడు సం గ్రామము సేసి గెల్చిన నఖండరమావిభవంబు గల్గు నా రామునిచేతఁ జచ్చిన స్థిరంబగు మోక్షము గల్గు దీనికై యేమిటి కింతదైన్యమిసి! యిచ్చఁదలంపుము రాక్షసేస్వరా. |
15 |
| వ. |
అని యినేక విధంబులుగా దీనాలాపంబు లాడుచు వెక్కి వెక్కి యేడ్వం గని లజ్జించి మహోగ్రాకారుండై లేచి దగ్ధశేషకాండంబులచే వానరవీరుల కరంబులు శిరంబులు ముక్కులుఁ జెక్కులు నలుఁగ మొత్తినం బఱచి వారు రామచంద్రుని సమ్ముఖంబునకుం బోయి తాము పోయి వచ్చినపని విన్నవించి రట్టి సమయంబున. |
16 |
| తే. |
నగచరులఁదోలి క్రమ్మర నగరి కరిగి పంక్తి కంఠుడు ధైర్యంబు పాదుకొల్పి విన్నఁదనమున వగపునఁ జిన్నవోయి చెంత నున్నట్టి తనకులకాంతఁజూచి. |
17 |
| క. |
నాకేలు వట్టి వెలసిన నీ కేలా చిన్న వోవ నీరజనయనా! నాకులు బెదరఁగ నల యి క్ష్వాకుకులోద్భవుల గెలిచి వచ్చెద నింకన్. |
18 |
| తే. |
తెలియ మయుపుత్త్రి! నాదు ప్రతిజ్ఞ వినుము వనచరులతోడ రామభూవరుని నేఁడు చంపుటొండెను వానిచేఁ జచ్చుటొండెఁ గాని యూరక మరలుట కానిమాట. |
19 |
| వ. |
అని వీరరసం బుప్పొంగఁ బ్రతిజ్ఞాలాపంబులఁ దనపట్టపుదేవి యగు మందోదరి నోదార్చి కొలువుకూటంబున కేతెంచి యచ్చట. |
20 |