| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| సర్పరోమాదుల సంహారము | ||
| ఆ. |
రోజి కలన ఖడ్గరోముండు గూలుట సర్పరోముఁ డెఱిఁగి సాహసమున వాలిసుతుని దాఁక వాని రోమంబుల విషము సోఁకి నొచ్చి వేగఁ దెలిసి. |
38 |
| క. |
ఆలోన సర్పరోమునిఁ దూలించుచు వానిముక్కుదూలము పగులన్. వాలితనూజుడు దన్నినఁ జాలంగా నొగిలి తెలిసి సాహస మొప్పన్. |
39 |
| ఉ. |
వాలితనూజునెన్నుదురు వ్రక్కలువాఱఁగ సర్పరోముఁడా భీలత నార్చి చేకొలఁదిఁ బేర్కొని కొట్టిన రక్తధారలన్ దేలుచు నంగదుం డతని డీకొని పూని శిరంబు చెక్కలై వ్రీలి పడంగ గొట్టఁ బృథివీస్థలిఁ గూలెను సర్పరోముఁడున్. |
40 |
| క. |
ఆలోన సర్పరోముఁడు గూలుట కనుఁగొనుచు మిగుల గోపంబునఁ దా నాలో వృశ్చికరోముఁడు నీలునిపై రథముఁ దోలె నిర్భయవృత్తిన్. |
41 |
| ఉ. |
బోరన నీలుఁ డంత నొకభూజముఁ గైకొని వాని తేరిపై శూరత నేసి యాక్షణము చూర్ణముగా నొనరింప నేలకున్ ధీరతదాఁటి భూరుహముఁ ద్రెంచఁగనుంగొని నీలుఁడొక్క మం దార మహీజమున్ వయిచె ధారుణి వృశ్చిక రోముఁడీల్గఁగన్. |
42 |
| సీ. |
వృశ్చికరోముఁడావేళఁ ద్రుంగుటఁ జేసి-వడి రోషమున నగ్నివర్ణుఁ డడరి త్రేతాగ్ను లొక్కఁడై తెరలి మండినలీలఁ-దనమేని మంటలు దరికొనంగ రావణునెదురఁ బరాక్రమస్థితిఁ బేర్చి-రామచంద్రునిమీఁద రణముఁ దోలి ప్రల్లదంబునఁ బెక్కుభాషలు నుడువుచు-సాయక నిచయంబు లేయునెడను |
|
| తే. |
వాని శౌర్యంబుఁ దెంపును వానిబలముఁ-జూచి భూపాలుఁ డప్పుడు చోద్యపడుచు ధనువు నందును వారుణాస్త్రంబు దొడిగి-యగ్నివర్ణునితలఁ ద్రుంచె నాక్షణంబ. |
43 |
| తే. |
అగ్నివర్ణుండు తెగిపోవు టసురవరుఁడు కన్నులారంగఁ గనుఁగొని కలుషవృత్తి రామచంద్రుని డాయంగ రథముఁ బరపి పలికె నుత్కటగర్వ ప్రభావుఁ డగుచు. |
44 |
| క. |
జాఱకుమా బీరము చెడి పాఱకుమా రిపులు నవ్వ భయపడి వనమున్ దూఱకుమా పేర్కొంచును జీరకుమా కపులఁ దోడు చేకొని పోరన్. |
45 |
| మ. |
అని విల్లెక్కిడి దైత్యనాయకుఁడు రోషాయత్త చిత్తమ్మునన్ ఘనమౌర్వీనినదంబు భీకరముగాఁ గావించి పెల్లార్చి య జ్జననాథాగ్రణిమీఁద నుగ్రశరముల్ సంధించి బిట్టేయఁగా వినువీథిన్ సురసంఘముల్గొలువఁగా వీక్షించె దేవేంద్రుఁడున్. |
46 |
| వ. | ఇట్లు కనుంగొని. | 47 |