ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
రామ రావణుల వీరాలాపములు
ఉ. భూరి భుజప్రతాపమునఁ బొంగుచు నిర్ఝరకోటి మాటికిన్‌
బోర జయించి తంచుఁ బలుపోకలు పోదువు నీవు భీతిమైఁ
దారక నిల్చి నాయెడఁ బ్రతాపము సూపుము చూపవేని నా
వారిజ గర్భుఁ డడ్డుపడ వచ్చినఁ జంపుదు నిన్ను రావణా.
75
ఉ. ఆలములోన వానరుల నాలము సేసినయట్లు గాదు నా
పాలిశరంబు నీనుదుటివ్రాలు హరింపఁగఁ బాలుపడ్డ దీ
వేళ వృథాపహాస్యములు వేయివిధంబుల మానలేక తాఁ
గాలుఁడు కన్నుగీటె నిదె కాలము డగ్గఱె నీకు రావణా.
76
చ. హరిగిరివహ్నిగిహ్నిఁబ్రళయాంతకుఁ గింతకుదైత్యుగీత్యువా
ర్వరుగిరు గాడ్పుగీడ్పు ధనవల్లభు గిల్లభు రుద్రు గిద్రు సం
గరమున నోర్చినట్టిదశకంధర! నీకు జయింప వచ్చునే
సురనగధీరు నుగ్రరణశూరుఁ బయోధిగభీరు రాఘవున్‌.
77
క. మతిఁ దలఁప సుఖరతిం బతి
వ్రతలను మునివరులఁ బట్టి వ్రతములు గర్వో
న్నతిఁ జెఱచినట్టిదురిత
స్థితి నిప్పుడు నీవు నాకుఁ జిక్కితి విచటన్‌.
78
వ. అని గర్వాలాపంబు లాడుచున్న యుర్వీశునకుఁ బూర్వ గీర్వాణాధీశ్వరుం డగు
రావణాసురుం డిట్లనియె.
79
క. అంతటి భూరిపరాక్రమ
వంతుఁడ వౌ టెఱుఁగుదేని వసుధేశ్వర! నా
పంత మెఱింగియు నెఱుఁగక
యింత ప్రగల్భముల నాడ నేటికి నీకున్‌.
80
క. నీలావును నాలావును
వాలాయము సురలు సూచి వర్ణింపఁగ నేఁ
డాలములోపలఁ జూపుద
మేలా గర్వోక్తు లిప్పు డినకులతిలకా!
81
మ. జననాథాగ్రణి! నా ప్రతిజ్ఞ వినుమా శాంతాత్ముఁడై నీకునై
వనజాప్తుం డిట వచ్చి కావు మనుచున్‌ వైళంబ నన్‌ గోరినన్‌
వినువీథిన్‌ సుర లెల్లఁ జూచి వెఱవన్‌ బీరంబు సంధిల్లిఁగా
నిను నీతమ్మునిఁ బంపకుండ మరలన్‌ నే లంకకుం బోఁజుమీ.
82
వ. అని కోపోద్దీపితమానసులై వీరాలాపంబు లాడుచు నిద్దఱును నుద్దవిడి గద్దింపుచు నోలమాసగొనక
మీఱిన కోపంబున శరీరంబులు మఱచి జయోల్లాసంబు లుల్లసిల్ల నొసళ్ళఁ బొడముపెన్‌ జెమట
మొత్తంబులును రక్తపూరంబులునున్‌ బెరసి కాలువలై పాఱుచుండ మెఱుంగుకఱకుటంపగములు నాటినం
జుఱు కెఱుంగక తమకంబులను నిష్ఠుర బాణ సంఘట్టనంబులను బృథులరథనేమిస్వనంబులను
ద్విసహస్రతురంగహేషారవంబులను భటుల సింహనాదంబులను గగనంబు వగుల జగంబులు కలంగ
సముద్రంబులు ఘూర్ణిల్ల ధాత్రి వడంక దిగ్గజంబులు మ్రొగ్గతిల్లఁ బడ నభోభాగంబున దేవ
గంధర్వ సిద్ధసాధ్యకిన్నరకింపురుషాదులు సూచి వెఱంగుపడ నిది పగ లిది రాత్రి యని యెఱుంగక
తమకంబున నే డహోరాత్రంబులు పోరాడి యలసి బాణప్రయోగంబు లుజ్జగించి యొకరి నొకరు
సూచుచుండ నయ్యవసరంబున.
83
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )