కావ్యములు ఆంధ్ర పురాణము అవతారిక

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

అవతారిక
శా.శ్రీకారంబును జుట్టినాఁడఁ గృతి కాశీర్వాదముల్ సేయు మ
మ్మా, కామేశ్వరి! విశ్వలోక జననీ! మాతల్లిపుట్టింటి వే
ల్పై కాపాడుచు నున్న యన్నెనరు నాయం దింత సారింపు మ
మ్మా, కైమోడ్తు భవత్కటాక్ష రసభిక్షాభ్యర్థినై భక్తిమై.
1
శా.మన్మల్ పిన్నటి మన్మరాండ్రు నిరుచెంపం గాయలుం బూవు లౌ
చు న్మేలూరిన దోసతోఁట గతి మెచ్చుల్ గూర్చు సంసార యా
త్ర న్మాధుర్యధురీణముల్ ఫలము లందం జుబ్బఁజూఱాడు జీ
వన్మాతా పితలార! మీచరణసేవాజీవి దీవింపుఁడా!
2
మ.తన బోధించిన కావ్యనాటక కళాతత్త్వంబునన్ మొగ్గ వి
చ్చిన యీ నాయెడ శాబ్ద సౌరభము వోసెన్ వాసి నార్జింప దీ
వనలం జేసె మహానుభావుఁ; డల సుబ్బారాయశాస్త్రిన్ మద
ర్చన పీఠంబు ‘మహేంద్రవాడ’ గురువంశస్వామి భావించెదన్.
3
మ.తొలిమేల్ త్రోవలు నేఁటి సంస్కృతుల రీతుల్ లెస్స గుర్తించి, నా
తలలోఁ దీయని నాల్కగా మెలఁగు సోదర్యుండు ‘సూరయ్య శా
స్త్రులు’ నా తీర్చెడి సర్వ బంధములయందుం గొంత చేదోడుగాఁ
జెలఁగున్; వాని కనామయాయువు మదాశీరక్షత ల్వోయుతన్!
4
వ.అని తలంచుకొని యొకనాఁటి బ్రాహ్మముహూర్తమునం దొలినాఁటి తెలుఁగువారి చరిత్రసారంబు నవపర్వ పరిమితంబుగా వింగడించుకొని ‘యాంధ్రపురాణ’ కావ్యరచనకుం గడంగినాఁడ; సర్గ ప్రతిసర్గాది పంచలక్షణలక్షితముకాక, త్రిలింగరాజ వంశ్యానుచరిత ప్రధానమై యుదయ, సాతవాహన, చాళుక్య, కాకతీయ, పునఃప్రతిష్ఠా, విద్యానగర, శ్రీకృష్ణదేవరాయ, విజయ, నాయకరాజ సమాహ్వయంబులగు నవపర్వంబులతో సంభృతమైన యేతత్కృతికి నవతారిక యెట్టిదనిన -5
మ.నవమాసంబులు మోసి కాంచి ‘కవిసంతానంబుతో నందనం
బవు నాజీవిత’ మంచు నెంచుకొని తీయంబారఁగాఁ బెంచి బు
జ్జవము న్నించెడి మాతృదేవత కటాక్షశ్రీలతోఁ దత్తనూ
భవతం బెత్తనమంది గొంతు సవరింపం జూతు నీనాఁ డిటుల్.
6
ఉ.పెంచి బెడంగు పాటఁ దలఁపించుచు మావిచివుళ్లు నోటఁ ది
న్పించిన కన్నతల్లి దెస నే నధమర్ణుఁడఁ; గాని, లోన నొ
క్కించుక తన్పు -
[1]ఆంధ్ర రచయితలు
మున్పు రచియించిన కూర్పునఁ ‘దల్లితండ్రి’ న
ర్చించిన దొడ్డవైభవము చేకుఱుటన్ ఘటియిల్లు నియ్యెడన్.
7
మ.ఇఁక నాకున్ సకల క్షణంబులును సాహిత్యమ్ముతోపాటు ధా
ర్మిక సౌహిత్యముఁ బంచియిచ్చుచుఁ గళారేఖారుచుల్ దీర్చు తం
డ్రికిఁ గావ్యార్చన సేయకున్నఁ బితురంతేవాసినై కన్న వా
సికి భాసించునె! మాధురీ పరిమళశ్రీ రోచిరభ్యున్నతుల్.
8
గీ.మరల నాతోడఁ బసియీడు తిరుగఁదోఁడి
యాడె - జతగూడె - నక్షరాభ్యసన మెనసె
శబ్దమంజరి వట్టె - శాస్త్రమ్ము ముట్టెఁ
గవిగ దీవించెఁ - దన గొంతుకలిపి పంచె.
9
ఉ.ఆయనపంపు పెంపు లొరయం బయనించుచు నుండి, యొండెదో
తీయని లోఁదలంపు గుఱుతించితి, నాంధ్రుల పూర్వగాథ లా
మ్నాయము చేసికొంటిఁ బరమప్రియ ఘట్టములం బురాణముం
జేయఁగఁ బూనుకొంటిఁ గృతిచేఁ బితృపాదుల నామతింపఁగన్.
10
మ.ఒకనాఁ డాదరమార నారచన మత్యుత్సాహియై యాలకిం
చి, కళాలాలసతం గరంగి, మధురాశీరార్ద్ర దృష్టుల్ సభ
క్తికమౌ నా పసిదోయిట న్నినిచి రక్తిన్ లోన నన్ గాంచు తం
డ్రికడం గోరిక వెల్లడింప నిటు లంటిన్ గొంత డగ్గుత్తికన్.
11
శా.‘ఈ నోటం బలికించు మాట లివి నీవే; పాటలు న్నీవె; తం
డ్రీ! నా గీసిన యక్షరాక్షరము నీవే; నాకుఁ బ్రత్యక్ష వి
జ్ఞాన జ్యోతివి నీవ తత్త్వమున; నైనన్ , లౌకికారాధనా
ధీన ప్రాకృత భక్తి నిన్నొకటి యర్థింతుం గుమారుండనై.
12
క.నా కూర్చిన యీ కబ్బము
నీ కుడుగరగా నొసంగ నేర్చినపుడు కా
దా, కృతినై సాగుదు! నం
గీకార మ్మిడవె దీనికిన్ బుణ్యమతీ!
13
మ.అని వేఁడం జిఱునవ్వు నవ్వుకొని శ్రేయఃకాంక్ష తీపార, మ
జ్జనకుం డీగతిఁ బల్కె నా యెడల వాత్సల్యంబునం జేసి ‘నా
యన! నీ తీయని కోర్కె చందనము పూయం జంద్రిక ల్వోయ నె
మ్మన మెంతేఁ దనివోయె; నీ కరణిఁ బ్రేమల్ లోకసామాన్యముల్.
14
శా.కానీ, యొక్క కొఱంత నా మనసునం గారించు; నీ వింత య
న్యూనప్రీతి వెలార్చు ముచ్చటకు నేదో యడ్డముం జెప్పుచు
న్నానా? యం చనిపించు; నైన నొక ప్రాణప్రాణమిత్త్రమ్ము నా
కీ నేలం గరణీయ మొం డునిచి పోయెన్ సత్య నిత్యాత్ముఁడై.
15
మ.తొలినాఁట న్విలసిల్లు తెల్గునెఱజోదుల్ మెచ్చ బాలెంత బె
బ్బులినోటం జెయివెట్టి కూల్చిన బలమ్మున్ బీరముం గూరు ను
జ్జ్వలవీరుల్ గల పద్మనాయకుల వంశంబందు మందారమై
యొలసెన్ వేంకటరాయఁ డీ వెఱుఁగ వొక్కొ! వాని సౌహార్దమున్.
16
మ.అది యీ నాఁటిది కాదు మైత్రి; గత జన్మాధార సంస్కార సం
పదుపానీతము; ముప్పదేఁడులకుఁ బైపై సాగి యా పొల్పు ప
చ్చఁదనం బేదెఁ; దదీయ మిత్రతకు లక్ష్యం బింతయున్ లేమి నా
బ్రదుకేదో యొకరీతిగాఁ గుతుక దూరస్థంబుగాఁ గన్పడున్.
17
సీ.తన తనూకాంతిఁ బోలిన పండుతల పైఁడి । గిరజాల మేలి సుందరతతోడఁ
దన యశః పరిణాహమును బోలె నింపూర్చి । యెసలారు వెడఁద నెన్నొసలితోడఁ
దనయెదవోలెఁ దెల్లనగు వల్వలు దాల్చి । నడయాడు వెలియేన్గు నడకతోడఁ
దన వర్తనముఁ బోలి, వెనువంపు గొనని జ । గా వెల్మవంశంబు ఠీవితోడ
 
గీ.స్నేహ మోహనభాషణ శ్రీలతోడ । ‘రేమెల’ మహాన్వయమ్ముపేరిమికి నెలవు
నా యనుంగైన వేంకటరాయఁ డిపుడు । జీవచిత్రముగా సుధాస్మృతికి వచ్చు.
18
గీ.మనసులో మాటలోఁ దియ్యఁదనము మెఱయఁ
బలుకరించెను; మన కుటుంబమున కెట్టి,
వెలితి రాకుండఁ దిలకించె; విలువ నెంచి
పంచె వార్షిక ధాన్య సువర్ణరాశి.
19
శా.ఆయుర్వేద చికిత్స హేతువుగ స్నేహాంకూర మారంభమై
చేయిం జేతికి నిచ్చెఁ; జెల్మి బలమై చేదోయిఁ జేదోయికిం
దీయం బెంచుచుఁ దెచ్చె; నేండ్లు గడవన్ డెందంబు డెందంబుతో
రాయంజేయుచు వచ్చె నయ్యమృత పూర్ణస్వాంతుఁ డీ నాయెడన్.
20
చ.‘మన యుభయాన్వయమ్ములు క్రమంబుగఁ బెంపు వహించి, తీపులా
ఱని యనుబంధముల్ తరతరంబులవెంట నిటుల్ రహించుఁగా’
కనియుఁ దలంచినట్టి మహితాశయుఁ; డాయన లోనలోనఁ గో
రినయది పండినప్పు డలరించుఁగదే! ననుఁ దత్కుటుంబమున్.
21
చ.అతితరమైన మా చెలిమి కాదరువై తనరారఁ దండ్రికిం
బ్రతినిధియై గుణజ్ఞతకుఁ బట్టగు నాదొరపట్టికిన్ భవత్
కృతి నెఱకాన్క యి; మ్మదికదే! విధిగా నుభయైకతారక
స్థితి; యిఁక నేమి చెప్పుదును దెల్పితి నా హృదయాభిలాషమున్.
22
వ.అని వచించిన పితృబ్రహ్మ యుపదేశం బాదేశంబుగా నౌదలంగొని పద్మనాయకవంశ రత్నదీపమ్ము శ్రీ రేమెళ్ల వేంకట రాయిణింగారి ప్రథమ సంతానమైన శ్రీ వేంకటరావుగారి చెలిమి గుర్తించి హంసశ్రోతయైన మజ్జనకునకు సన్నిధానవర్తినై శ్రీమదాంధ్రపురాణము వినిపించుచుఁ గబ్బంపుదొర నభినందించువాఁడ.23
గీ.ఆంధ్ర ధారుణి భీమఖండాంతరమునఁ
బాఱు ‘నాత్రేయి’ వాహిని పజ్జ వెలయు
దుగ్గుదురు గ్రామ; మందు నిస్తులనికామ
భాగ్యరంగము ‘రేమెళ్ల’ వంగడంబు.
24
చ.గురుతరమైన భాగ్యమునకున్ దొరయైన వితీర్ణి - దానికిన్
సరిపడు సద్రసగ్రహణశక్తియు రక్తియుఁ గల్గి ‘యుత్తరా
పరిణయ’ కావ్యకర్తయయి పండితులం దనియించి కీర్తి భా
స్వరత నెనంగె నవ్వెలమవంశపు వేంకటరాయఁ డెన్నఁడో.
25
గీ.అట్టి కవిధీరులను సువిఖ్యాతులైన
వీరులను జిత్రకారులఁ బెంచినట్టి
రేమెలాన్వయమున మత్పితృప్రియుండు
తాతతండ్రుల మించి పెత్తనము నెఱపె.
26
ఆ.వె.అతని మొదటి పంట యైన వేంకటరావు
భావ మెన్నఁ గపిలగోవు వెన్న
మలి తనూజుఁడైన లలితుండు వేణుగో
పాలరావు మల్లెపూల ప్రోవు.
27
మ.ఇటు లీకబ్బము గారవించిన ఘనుం డేపారు రేమెళ్ల వేం
కటరా; వాయన చూపువెంట సకల గ్రామంబు పాఱాడుఁ; బి
న్నటి నవ్వుల్ రమణించునప్పెదవివెంటన్ విచ్చు దోసిళ్లు; బా
సటయై యాతని మాటపోఁడిమి సమస్యల్ తీర్చుఁ బ్రాంతీయులన్.
28
మ.పొలముల్ సేద్యముగట్టి బంగరువు కూర్పు ల్వెట్టు భూస్వామి; పె
ద్దలలోఁ బిన్నలలోనఁ దా నొకఁడుగాఁ దారాడు మేధావి; పే
దల యిబ్బందులు చూచి జాలిగొను చింతారత్న; మాతండు పు
త్రులతో మన్మలతో నితోధిక సుఖస్తోమంబుఁ జూఱాడుతన్!
29
మ.నవనీతార్ద్రము చిత్తమున్, సుకవితాంతఃప్రీతి, సాహిత్య బాం
ధవమున్ ధీర గభీర నిర్మలిన మౌనవ్యాఖ్యతో విప్పి మ
త్కవితాచంద్రిక సోఁకి పొంగిన యుదాత్తస్వాంతు నౌదార్య సిం
ధువునన్ బిందు వొకండు నా పయిని జిందుల్వెట్టె నీ తీరునన్.
30
మ.కపురంపుం బెడఁగారు హారతులతోఁ - గల్యాణ వాద్యంపుఁ దీ
రుపుతో - సత్కవిసాధువాదముల కూర్పుంబొల్పుతో వచ్చి, యాం
ధ్రపురాణమ్మును మెచ్చి కైకొను మహోదారుండు పెంపొంద వే
లుపు లాశీరమృతప్రసూనములఁ జిల్కుం డుల్లసత్ప్రీతిమై.
31
గీ.ఇంతకును - నెల్లకృతులకు నెవఁడు కర్త?
యెవఁడు భర్త? అతండు కర్తృత్వ భోక్తృ
తాద్యతీతుండు సర్వ కావ్య ప్రపంచ
భద్రతకు మూలహేతువు పయిని గలఁడు.
32
ఉ.సన్నుతకీర్తి భారత రసాస్థలి కెల్లను మేలిమచ్చులై
యెన్నిక నంది తెన్గుజనయిత్రి ఋణమ్మును వడ్డితోడఁ దీ
ర్పన్నెఱినెంచి, ధర్మపరిపాలనముం బొనరించి యెన్నఁడో
చన్న మహానుభావుల ప్రశంసల సేఁతలు జాతి కొప్పదే?
33
చ.తెలుఁగున వేలయేండ్లుగ గతించిన గాథలపెంపు కొండ గు
ర్తుల పెనుగుంపు గాని “యిది రూఢిగ నిట్టిది” నాఁగఁ దేల్ప నె
వ్వలన నసాధ్య, మైన నొకపాటి చరిత్రము నేఁడు నేర్పుఁ దీ
ర్పులఁ బరిశీలకుల్ తడవి ప్రోవులు వెట్టిరి పుణ్యబుద్ధులై.
34
చ.పొలపముఁ దప్పి పుర్వులకు భుక్తులు వెట్టెడి తాటియాకుఁ గ
ట్టలు - నెపు డెప్పుడో పుడమి డాఁగిన శాసనరాజి - వగ్గువా
రలబడి నివ్వటిల్లిన పురాణకథల్ - ససిమాయు శిల్పముల్
తెలుఁగుచరిత్ర తొల్లిటిగతిన్ వచియించును గొంచియమ్ముగన్.
35
గీ.అఱమఱుఁగు మేలిముసుఁగులో నందగించు
నాంధ్ర చారిత్ర సుమనోహరాంగి భంగి
మనసుపండువుగా నెంచుకొనెడి సిరికి
నోఁచువాఁడు, రసజ్ఞత మోచువాఁడు.
36
క.అభిజాతులు బుధపరిష
న్నిభృత వచోనిధులు కీర్తనీయాభ్యుదయుల్
శుభవర్తనులు పురాంధ్ర
ప్రభువులు; తచ్చరిత మిఁకఁ బురాణింపఁబడున్‌.
37

[1] ఆంధ్ర రచయితలు.
అవతారిక - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu