కావ్యములు ఆంధ్ర పురాణము ఉదయ పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

అంగ వంగ కళింగాద్యా
స్సింహ పుండ్రాంధ్ర సంజ్ఞికాః
జజ్ఞిరే దీర్ఘతపసో
బలేః క్షేత్రే మహీక్షితః
చక్రు స్స్వనామ్నా విషయాన్ షడిమాన్‌ ...
    ‘శ్రీమద్భాగవతమ్‌’

ఉదయ పర్వము
గీ.శ్రీమదాంధ్ర వసుంధరాసీమ నొలసి
దక్షవాటీ మహాస్థాన దైవతమ్ము-
కాళనాథేశ్వరుండు - శ్రీశైలవిభుఁడు-
తెలుఁగువారల నాశీర్వదింతు రెపుడు.
1
మ.ప్రణిధానంబునఁ జూడ నాంధ్రుల చరిత్రన్ వేనవేలేండ్ల క
ప్పునఁ బెంపారిన యాదిగాథ యొకఁ డింపుల్వుట్టఁజేయున్ సదా
తనమై యార్షపురాణబద్ధమయి; యేతద్గాథకున్ మూలకా
రణమౌ బ్రాహ్మణ మైతరేయము సమారాధ్యమ్ము మున్ముందుగన్.
2
ఆ.వె.ఆంధ్రుఁ డనఁగ నెవ్వఁ! డాంధ్రదేశాభిఖ్య
యేల వెలసె! ననెడి యిట్టి ప్రశ్న
ములకు బదులుగాఁగఁ బలికెడి తొలినాఁటి
గాథ లొండు రెండు కలవు పుడమి.
3
సీ.వింధ్యకానన మహావీథి కుత్తరమున । వరలెఁ గొండొక రాచవంగడంబు;
తద్వంశమందు మందార సాలమువోలె । సంభవించెను హరిశ్చంద్ర నృపతి;
యతఁడు వేధసునకు ననుఁగు సంతానమై । పేరుపెంపున ధరాభార మూనె;
మదికి నభ్యుదయమ్ము నొదవించు మగమొల్కఁ । గన నోఁచుకొనని వెక్కసము మోసి
 
గీ.ఱేఁడు పెన్నిధిఁ దొఱఁగినవాఁడు, నెడఁద । విధికి వెఱచిన వాఁడునై విహ్వలించెఁ;
దలఁపుఁదీవలఁ బ్రసవబాంధవము నతుకు । కడుపు లేకున్నఁ దండ్రి కెక్కడిది బ్రతుకు!
4
మ.అనపత్యుండయి కుంది వందురు రసాధ్యక్షున్ హరిశ్చంద్రునిం
గని పెద్ద ల్వచియించి రిట్టులు ‘తలంకంగాదు భూపాల! వి
చ్చిన భక్తిన్ మనసిచ్చుచున్ వరుణు నర్చింపం దనూజన్మ ధ
న్యునిగా ని న్నొనరించు దైవమతఁ; డన్యుల్ కారునిర్వాహకుల్.
5
క.అని వినిచిన యుపదేశపుఁ
దనుపున కభిధాంతరముగ ధరణీపతి య
ర్చనసేయఁ జేయ జలదే
వునియెద తనివోయి పొంగి పొరలం బడియెన్.
6
మ.తలవంపుల్వడి సన్నవాఱిన నిజోత్సాహంబులో, నిండుఁగౌఁ
గిలికిన్ లోఁగిన ముద్దుచూలి యనురక్తిన్ భావనావీథి జు
ఱ్ఱలు వేసెన్ నృపమౌళి; దైవకరుణారంభంబు చేసేఁతఁ బు
వ్వులు పూసెన్; గరుణించె నవ్వరుణదేవుం డా హరిశ్చంద్రునిన్.
7
వరుణదర్శనము; వరప్రదానము
వ.సాక్షాత్కరించిన యప్పరమ దయామయు నడుగుఁ దామరలతావు లంటి మిన్నంటినటులై హరిశ్చంద్రభూనేత యన్నీటిఱేనికిఁ దనకోరికి నెఱింగించుటయు నవ్వేలుపు కొఱనవ్వు నవ్వి -8
మ.అకటా! మా కొక చిక్కు తెచ్చితి వసాధ్యంబైన నీలోని కో
రికఁ బండించుట యెట్టులో తెలియ; దార్తింగుంద; కీ నీదు పు
ట్టుకకుం బుత్రకృత ప్రమోదమున నిండు న్మెండు చేకూరు భా
గ్యకళాయోగము లేదు; దానికి నుపాయం బొండె కన్పట్టెడిన్.
9
ఆ.వె.నీకుఁ బుట్టినట్టి నిసువును బశువుగాఁ
జేయఁగలవె రాజసూయమందుఁ?
గానియెడల - నీకుఁ గలుగఁడు బిడ్డండు
లేని బెడఁద కేల పూనుకొనెదు?
10
గీ.అనుడు, బడబాగ్ని తోడుగా నవఘళించు
వరుణు నమృతాక్షరానిలభరము సోఁకి
సొగపుగొని తేఱుకొని వెల్గుఁ జూచి యిటులు
పలికె నా భూమిపతి పేదయెలుఁగు తొలఁక.
11
గీ.లోకమున వంశవృక్ష మైక్ష్వాక మిటులు
మ్రోడువడక చిగుర్చుటే ముక్తి నాకు;
నా చివురు పూవు కాయగా నేచి, పండ
నరయవలె ననికూడఁ బేరాసవడను.
12
ఉ.కన్నుల వెఱ్ఱివేడ్క తొలఁగం దలఁపారఁగ నొక్కతూరి నా
యన్నువ నెత్రుచూలుఁ బసుపాడిన తత్ప్రసవిత్రి పొత్తిటన్
గన్నది చాలు నింతకు వినా వరుణా! నినుఁ గోర; నాపయిం
గన్ననిసుంగు నధ్వరపుఁగాన్కగ నిల్పెద; నిన్నుఁ దన్పెదన్.
13
వ.హరిశ్చంద్రుం డసంతానుం డను తక్కువపేరు తొలంగి పుత్రజాతుం డనిపించుకొనుటయ పదివేలని నివేదించు నా ఱేని పరిదీనప్రార్థనంబునకుఁ గరఁగి వరుణదేవుండు వాని నిబంధనంబున కొడంబడి యంతర్హితుం డయ్యె.14
మ.ఇటు జాల్వాఱిననీటిఱేనిదయ దోయిళ్లన్ హరిశ్చంద్రుఁ డా
దటఁ జూఱాడియు రాణివాసమున కంతన్ గర్భ మింపారె న
న్నటు లాలించియు దందడించిన మహానందంబునందోఁగె; నూ
ఱటమై వేడుక లూఁగెఁ దత్ ప్రకృతివర్గంబందు సంస్థానిలోన్.
15
గీ.మీఁదఁ గసివోవ విసరెడి చేఁదుగాలి
జాడ లెఱుఁగని దా హరిశ్చంద్రురాణి;
యామె యప్పటి సంతస మంతులేని
హలహలము దాఁచుకొన్న మహాబ్ధిపురుడు.
16
ఉ.ప్రామిన చీకటుల్ పలుకఁబాఱి క్రమంబుగ విచ్చిపోవఁ బ్రా
చీముఖమందుఁ బ్రొద్దువొడిచెన్ హిత ‘రోహిత’ రోచిరంకుర
స్తోమమునన్; నృపాలకవధూమణి పొత్తిట జొత్తుపాప కెం
దామర ముద్దులూర్చెను; మనంబు లెలర్చెను రాచజంటకున్.
17
గీ.ఎట్టయెదురుగఁ జిందాడు నెడరు వైపు
తొనకుఁ జూపులఁ బఱపి యజ్జనవిభుండు
కన్నబిడ్డను గని నవ్వుఁ గానినవ్వు;
రాణిఁ గననీఁడు తనయెదలోనినొవ్వు.
18
చ.‘జరిగినమాట దాఁటి యెటసాగెద వీచిటిపాపఁ జంపి య
ధ్వర మొనరింపఁగాఁ బ్రతినవట్టితి వో కపటీ! స్మరింపవో
యెరవుధనంబుపై మమత యేటికి మాటికిఁ బెంచుకొందు’ వం
చుఱిమిన యట్టులైన జడియున్ మదిలో నొడయండు మెండుగన్.
19
గీ.ఆరఁబండిన తములపుటాకుఁ బోని
లేఁబురుటియాలి పసిపొత్తిలికి బెడంగు
రోహితుని ముద్దు-ఱేఁడు దారుణతరాసి
ధార మెఱుఁగారు తేనెపూఁతగఁ దలంచు.
20
గీ.జేవుఱించిన కనుఁగోపు - లావులించి
మ్రింగ నుంకించు నోరునై మీఁది కుఱుకు
వరుణదేవుని నిలువు భావమున వెలయ
వెఱచుఁ; గంపించుఁ; జేష్టలు మఱచు ఱేఁడు.
21
గీ.పృథులతరమైన బాధలో మధురిమముగ
మధురిమములోన బాధగా మాఱి నృపతి
కొక్కకంట ముదశ్రువు లోడిగిల్ల
నోడిగిల్లె శుగశ్రువు లొక్కకంట.
22
చ.తరఁగలుగట్టిపాఱు వసుధావరు వెచ్చని యశ్రుధారలం
దెరలిన నీటిఱేఁ డలుకదేరిన కన్నులువిచ్చి పల్కె ని
క్కరణి - ‘నృపాల! యేల తమకంబు వహించెదు, నీ కుమారు నె
వ్వరిదరి నుంచె దీ వరుణుపాశముఁ గాదని మోసగించుచున్.
23
గీ.బాసఁ దలపోసి నీబిడ్డఁ బశువుఁ జేసి
జన్నమున వేల్చి ననుఁ దన్పఁ జనుట మఱతొ
కడుపుతమకముతో-’ నని పిడుగు లుమియఁ
జెదరుగుండియ ఱేఁడు పాశి నిటువేఁడు.
24
మ.ఇలువేల్పట్టులు పుట్టి మాబ్రదుకులం దింపూర్చుచున్ బాలవ
త్తులకేనిన్ ససినోరురాని పసికందుం బట్టి పాలాడు నీ
కొలకుం జేతులురావు; లేఁజివురుటాకుం దున్మితూఁటాడి మ్రో
డులుగాఁ బాడఱు పాపజాతి తలిదండ్రుల్ నీకు క్షంతవ్యులే!
25
గీ.ఎఱుకకును మాఱుపేరైన వరుణ! నీకుఁ
గఱప మే మెంతవారము! పురుటి యంటు
తొలఁగినం గాక యధ్వరబలికిఁ దగునె
మూఁతవిడువని కనుల లేలేఁత పశువు!
26
మ.అని యాభూపతి పల్కినన్ మనసు నీరై మాఱుమాటాడ నే
రనివాఁడై వరుణుండు పోవుడుఁ, గుమారప్రేమపాశైక బ
ద్ధునకున్ ఱేని కగాధమౌ జలధియందుం గొంతచేయూఁత యం
దినయట్లాయెను; బూరిపోఁచ యొకఁడూఁదెన్ స్వావలంబమ్ముగన్.
27
చ.దొరకిన పోఁచ యూఁతముగఁ దోఁచక పట్టిన వెఱ్ఱిఱేని సం
బరమది విశ్లథంబుగఁ గృపం బెడఁబాసిన పాశి వెండియున్
నరవరుఁ జూడఁగాఁ బురుటినాళులు దాఁటినవెంట వచ్చి తొం
దరపఱిచెన్ మఖంబునకుఁ దత్సుతుపైగల కూర్మిపెంపునన్.
28
వ.హరిశ్చంద్రభూజాని వరుణదేవున కేమి చెప్పుటకుం దోఁచనివాఁ డొక వెరవు దొరకి మెఱపుతోడి నీలనీరదమూర్తియై-29
గీ.నీ యెదుట ధర్మసరణి వర్ణించి నొడువ
నెంతవారము దేవ! క్షమింపఁగాదె!
దంతములు రాని పశువు మేధ్యమ్ముగాదు;
నీవు గాదన బిడ్డఁ గొంపోవు మిపుడ.
30
చ.అనుడు, దయార్ద్రమైన దరహాసము మోమున మోసుదేఱ న
జ్జనవిభుమోసముం దెలిసి సంతతిపైగల మోహ మిట్టిదం
చును నొక వ్యాఖ్యచేసికొనుచున్ సయిచెన్ మది రోసమేది పో
యెను వరుణుండు; ఱేని కొకయింత సుధాకణభుక్తి చేకుఱెన్.
31
చ.తొలిజనులందు నాటుకొని దోసపుఁ జల్లులు నేఁటి కీగతిన్‌
మొలచె ననంగ దంపతుల ముద్దులమూటల కింక రద్దులై
పొలుపులఁదేలు పాలపసిబుగ్గలకుం జిఱునవ్వు వెల్గు వం
పులిడెడి మొగ్గలై రదనముల్ తుదలెత్తెను రాచకూనకున్.
32
ఆ.వె.శిశువు బోసినోరు చివురించెఁ; దోడనె
జేవుఱించె వరుణదేవు కన్ను;
లరుగుదెంచె నరయ నాహరిశ్చంద్ర భూ
పాలు నాడినట్టి బాసతీరు.
33
ఉ.వచ్చినవానిఁ గాంచి తలవంచి పటుక్కునఁ బ్రేమపాశమున్
వ్రచ్చిన పాశికిన్ బదులు వల్కఁగ నేరక దేవ! దంతముల్
వచ్చినవెంట నీ చిఱుతవానిని నధ్వరవీథిఁ గాన్కగా
నిచ్చెదనంటి లెస్స చనవిచ్చుట నొక్కటి విన్నవించెదన్.
34
ఉ.ఆడినమాట కాదని భయప్రదమౌ భవదీయ పాశపుం
బోఁడిమి వాఁడిమిం గడచిపోఁ దరమా! పరమాదరంబు ముం
దాడఁగ నన్ను నీ యభయహస్తపు నీడకుఁ జేరఁదీసి యీ
వేడుక చెల్లఁగా నమృతభిక్ష యొసంగుమయా దయాశ్రయా!
35
గీ.బాలునకు నేఁడు మొలచిన పాలపండ్లు
తిరముగా నుండఁజాల; వీ తెఱఁగు పశువుఁ
గ్రతుసమర్థముగా సమర్థనముసేఁత
యెన్నఁగా ధర్మదేవత కన్నుమూఁత.
36
వ.అనినంత నమృతమూర్తియగు ప్రచేతసుండు పుత్రప్రణయ పురస్సరం బగు హరిశ్చంద్రు వేఁడికోలునకు మాఱాడక యూరీకరించి యప్పటికిం దిరోహితుండై మఱికొంతకాలము గడచిన పదంపడి విచ్చేసి తొల్లిటియటులు జన్నంబొనర్పు మని నిర్బంధించుటయు న య్యేలిక దోయిలించి వరుణున కిట్లనియె; దేవా! నీయెఱుంగని ధర్మముండునే! క్షత్రియుండు కవచియు ధానుష్కుండునుంగాక సవనపశువుగా విశసింపఁబడుట ధర్మవ్యత్యయంబుగదా యనుటయు నీటిఱేఁడు బాడబంబు బోని క్రోధంబు మ్రింగికొని కానీ చూత మని యొడంబడి పోయి కొంత కాలమ్ము వదలిన-37
చ.పొదలిన జవ్వనంపుఁదలఁపుల్ తొలకాడఁగఁ జేతికందఁగా
నెదిగిన రాచబిడ్డ బలియిమ్మని వచ్చెఁ బ్రచేతసుండు సౌ
హృదమును ద్రోసిపుచ్చి; ధరణీశుఁడు శోకమహాహలాహలో
న్మదశిఖ లేచి రేఁగ గళనాళమునం దిగనాఁగి యిట్లనెన్.
38
గీ.అమృతసఖమగు నీ యంతరంగమునకు
నప్పువడినాఁడఁ; బలుసార్లు త్రిప్పినాఁడ;
నిదియు నాలోని తీపిగా నెంచి సైఁచి
యందుకొమ్ము మదన్వవాయాంకురమ్ము.
39
మ.అని డగ్గుత్తిక జీరువాఱి వెతవోయన్ ‘నాయనా, రోహితా!'
యనుచున్ భూపతి నెవ్వగం దనయు నొయ్యంబిల్చె; నాతండు చ
య్యన నేతెంచి యుదంచిత ప్రణయ ధన్వంబైన యాతండ్రి చాఁ
చిన పొందారెడి సందిటన్ మధురుచిశ్రీబిందువై జాఱఁగన్.
40
గీ.మాయ మర్మము నెట్టికర్మము నెఱుఁగని
బిడ్డలో నెల్ల యుసుఱుల నొడ్డి ఱేఁడు
తనయు లేలేఁతవ్రేళ్లమెత్తనఁ దడవుచుఁ
దడిపె నాతని నులివేఁడి జడులతోడ.
41
గీ.ఆజడులఁ ద్రెంచుకొని పడె నార్ద్రమైన
పిడుగు లీరీతి రోహితు నెడఁద కదలి
యదరువేటుగ నదవదయై భ్రమింప
నఖల సామ్రాజ్యరమ హృదయము ద్రవింప.
42
శా.ఒడ్డారించిన పాశపాణి భవదాయుర్వల్లిఁ దున్మాడఁ గే
లొడ్డెన్ నేఁ డిదె; వెఱ్ఱివేడుకలతో నుఱ్ఱూఁత లూఁగించి తో
బిడ్డా! నిన్నొక యాటబొమ్మవలెఁ జూపెన్ బాపపుంగర్మ; మీ
వెడ్డున్ దాఁటగ దిక్కుమాలితి మహోర్వీ సార్వభౌముండనై.
43
మ.కని - సర్వస్వము నీవుగా మని, కడంకన్ గండముల్ త్రెంచి పెం
చినవాఁడన్; మఱి యీ వసంతమున నీచేఁ జిచ్చు వెట్టించు కొం
దును దండ్రీ! నినుఁబట్టి యధ్వరమునందుం బాలగుంజం గృతాం
తుని చందంబున గుంజికట్టి విశసింతున్; బెంతు నైర్ఘృణ్యమున్.
44
మ.దయకున్ దవ్యుల నున్న తండ్రియెడ నీదండంబు మున్ముందు ని
ర్ణయముం జేసి వచింపు; మావలఁ గుమారా! బాసకున్ లోఁగి య
ప్రియముం జేసెదఁ జేతులార వరుణప్రీతిన్ ఘటింపన్; దుర
త్యయనిత్యస్థితి నంది చూఱకొను మన్నా! బంధురానందమున్.
45
గీ.అని హరిశ్చంద్రుఁ డలమటంగొనఁ, గుమారు
మనసులో దాఁగియున్న యమాయికతకు
నొక నవీన ధోరణిని లౌకికపుటెఱుకఁ
గఱపినటులయ్యెఁ దండ్రి దుఃఖమ్ముచుఱుకు.
46
రోహితుని పలాయనము
వ.అగుటయు మృత్యు భయభర భ్రాంతుండు రోహితుం డప్పటి కేమి యనక నాఁటి నడురేయిఁ బడుకకేని తెలియరాక ధనురేకసహాయుండు రాజసౌధంబు విడిచి చని చని యొక గహనంబునం జొచ్చి యటఁ బొంచి నడయాడుచుండె.47
ఆ.వె.పశువు రోహితుండు వడిఁ దిరోహితుఁడౌట
సర్వసిద్ధమైన జన్న మాఁగె;
నన్నమాటఁ దప్పెనని హరిశ్చంద్రుపై
వరుణుకన్ను లెఱ్ఱవడుచు రేఁగె.
48
ఉ.రేఁగిన నీటిఱేని కనురేకలతో నలఱేని పొట్టపైఁ
దీఁగలవోలెఁ జాఱ లగుదెంచి కలంచి - జలోదరోపతా
పాగతిఁ దెల్పె; భూమిపతి యన్నముముట్టఁడు; డప్పి కోర్వఁ; డా
రోగము గడ్డుదేర బెదరున్; జెదరుం దనగుండె నీరు గన్.
49
మ.అటు లారాజు జలోదర వ్యథకు లోనైయున్న దుర్వార్త - య
క్కటికం బారఁగ నొక్కఁడున్ వెఱపుమైఁ గారూళ్ల వెన్వెంటఁ బా
పటవోవం దిరుగాడు రోహితునకుం బాపంబు పండన్ శ్రవః
పుటముల్ వ్రచ్చెను; విచ్చె వాని కనుఁదమ్ముల్ బాష్పరేణూద్గతిన్.
50
గీ.పొడమె వెనువెంట రోహితు నెడఁదలోన
దాఁగి యూఁగాడు నొక్క నెత్తావి యిటులు;
‘కొమరుఁడనె నేను! జనకుఁ బ్రాణములఁ బాపి
ముదము గుడుతునె యీ పాడు బ్రదుకుఁ దీపి!
51
గీ.ప్రియముఁ దండ్రికిఁ దెలిపి, క్షత్త్రియత నిలిపి
యాగ పశువుగ నాహుతి యగుదు నోపి;
వ్యాధిఁ దొనఁకిన జనకు జీవనము పొంటె
నీబ్రతుకు నిత్తుఁ గలదె నా కింతకంటె’
52
చ.అని తలపోసి, యాత్మ పిత నట్టులు మోసము చేసిరాక నె
మ్మనమున రోసి, రోహితుఁడు మల్లడిగొన్న త్రపాభరంబు ముం
దు నడవ యజ్ఞవాటిఁ దమితో నెఱవిందయి తండ్రిఁ గావఁ బ
త్తనమున కేఁగ నెంచె; విధి తప్పునె! యెప్పటి కేది కప్పునో!!
53
గీ.జబ్బుపడియున్న తండ్రి రక్షణము సేఁత
యాత్మజుని చేత నైన భాగ్యమ్ముకాదె!
యీ యదృష్టము రాదు రోహితున; కెంత
మనసు కలిగిననేమి కర్మమ్ము లేమి.
54
మ.తన ప్రాణమ్ములు కుప్పవోసి పితృసంతాపోపశాంత్యర్థ మ
ప్పనసేయం దలపోయుచుం బురముత్రోవం బోవు నారాజపు
త్రుని మోసంబున వేల్పుఱేఁడు పలుసారుల్ మాఱువేసంబులం
గని సాకుల్ వచియించి యాఁగె మఖదీక్షాపాలనేర్ష్యాళువై;
55
ఆ.వె.మనసు తండ్రిమీఁదఁ దొనఁకియాడ నతండు
తనకు మా ఱొకండు మనుజపశువు
వెదకనెంచి యడవివెంటఁ బల్లెలవెంట
నొదిఁగి తిరుగులాడు చుండునంత.
56
మ.నిలువం బోవఁగ వెన్కముందులగు ప్రాణి న్నిల్పి కాపాడఁగాఁ
దొలిపున్నెంబుల పంట ‘సూయవసు’ పుత్రుండౌ నజీగర్తుఁ డు
జ్జ్వల భవ్యాకృతి బ్రహ్మవర్చసపుఁజెల్వం బూఁతగా నిల్చు నె
మ్ముల గూఁడై కనుపట్టె రోహితునిచూపుల్ తీపులై దీపిలన్.
57
చ.పొగిలి దిగుల్గొనం జివికిపోయిన పేదఱికమ్ము గుండియం
బగిలిన ముక్కలట్లు నలువంకల న ‘య్యజిగర్తు’ బత్నియున్
ముగురు కుమారులుం గదిసి మూఁగుటకుం దలయూఁచి వేడ్క పెం
పుగ నవనీసురున్ దరియఁబోయెఁ బితృప్రియకాంక్ష త్రోయఁగన్.
58
క.డగ్గరి - యడఁకువఁ గేల్గవ
యొగ్గి యజీగర్తు భూసురోత్తముఁ గని యీ
యెగ్గతపుఁ జోట నేలా
మ్రగ్గెదు వీరలు కుటుంబమా! యని యడుగన్.
59
వ.ఆ క్షత్త్రియకిశోరుం గనుంగొని యజీగర్తుం డుపవాసకృశం బగు పేద యెలుంగున నోయీ! యే నొక యభాగ్యుండగు బాఁపనయ్య; నీమె నాయిల్లాలు; వీరలు శునఃపుచ్ఛుఁడు శునశ్శేపుఁడు శునోలాంగూలుఁడు నను నామధేయంబులు గల నా కన్నకడుపులు. నే నియ్యడవి పల్లియలం దారాడి తిరిపంబెత్తుకొని యుత్తలంపడుచు నీ బిడ్డలం బోషించుకొనుచున్నాఁడను. ముదుసలినై యీ నిరుపేద బ్రదిమి నిఁకమీఁద నెటు లీఁదుటయో తోఁచకున్న యది యనుటయు-60
గీ.వనట యొదవించు పేదబాఁపని చరిత్ర
వినుట రోహితు నెడకంటఁ దొనఁకె నశ్రు;
వతని కుడికంట వెనువెంట నంకురించె
సుందరానంద మధులవ స్పందనంబు.
61
చ.పితృహిత మెంచి భూసురుని పేదతనమ్ముఁ దలంచి, యెన్నఁడో
చితికిన కట్టెలో మరల జీవము పూవులు పూచినట్లు రో
హితుఁ డెద సంతసించి తన యీప్సిత మ య్యజిగర్తు సన్నిధిం
గొతుకుచుఁ గొందలించుచు దిగుల్గొనుచున్ వచియించె నీగతిన్.
62
శా.స్వామీ! యేనొక రాచమొల్కను; హరిశ్చంద్రుండు నాతండ్రి గా
రామారం గని నేను బుట్టుటకుఁ బూర్యం బేదొ బాసాడి న
న్నామంత్రించి మఖంబునందు బలివేయం బోవ - జీవాత్మ కే
దో మాధుర్యము పుట్టి నెట్టె నిటు లాయుర్గర్భ దుర్భాగ్యతన్.
63
మ.బ్రతుకుందీపులు త్రోపులాడ నిటు సర్వవ్యాపిఁ గన్గప్పి వ
చ్చితిఁ; దండ్రిం గికురించితిన్; దుదకు నాచేతాఁకునన్ ధారుణీ
పతికిన్ దారుణమౌ జలోదరము దైవక్రోధ దుష్పాక ధూ
పితమై చేపడెనంట; యేకరణి నర్పింతుం బితౄణం బిఁకన్.
64
మ.ఒఱగొడ్డంబు సమస్య వచ్చినది; నాదో, తండ్రిదో జీవితం
బెరయై పోవలె నింక; నా బ్రతుకుపై నీ నాఁటికే నాస యో
సరలే దక్కట! దిక్కుమాలినది మత్ స్వార్థంబు; నా మాఱుగా
నరుఁ డొక్కం డెవఁడేని యాగబలిదానం బైన మేలౌఁగదే!
65
మ.అవురా! నాతలఁ పింతచెడ్డది; పరార్థైక వ్రతఖ్యాతుఁ డే
ద్రవిణంబో రవణంబొ యీఁగలఁడు; స్వప్రాణంబులే నాకుఁగా
నెవఁ డిచ్చున్! మఱి యిచ్చినం గలదె యానృణ్యంబు తత్త్యాగగౌ
రవ భావంబునకుం గృతజ్ఞతగ సర్వస్వంబు నర్పించినన్.
66
క.ఏనొక్కఁడ మావారికిఁ
గానుపనై యుంటి; జాలి కలిగిన దేనిన్
బోనీ, యీ మూవురు సం
తానములో నొకనిబదులు నను మనుపఁగదే!
67
మ.అని మండాడెడి రాచబిడ్డయెడఁ ద్రోయన్‌రాని నేయంబు ము
న్కొనియావెన్క నమాయికత్వమున సూనున్ జన్నపుంగాన్కగాఁ
దన కర్పింపఁగ వేఁడుకోలునకుఁ జింతాక్రోధ దుస్సంధి దా
కొని యా పేదకుటుంబి యీ కరణి వాకోఁ జాగె నుద్వేగియై.
68
ఉ.‘ఏ నొకరాచమొల్క’ ననియేకద, నీకథ నెత్తికొంటి వో
కూన! కులంబు గౌరవము కూడ దిసంతులవంతు చేసి నీ
ప్రాణపుఁ జిందు నాకడుపుపై నిడ ధర్మువె? క్షత్త్రబంధుతా
ధీనము నీతలంపు తెగుదెంపున కేమని మాఱు సెప్పుటల్!
69
మ.ఎకసక్కెంబున కాడితో యిటులు మే మేపూఁట కాపూఁటఁ గూ
టికిఁ గొట్టాడుచు నుండవచ్చు; నది యట్టే యుంచు; మేతండ్రి తిం
డికినై బిడ్డను బిండివంటకము వండింపంగ నుంకించుఁ; గొం
కక యీ సేగి వెలార్పఁ బుట్టవలె నింకన్ దందశూకంబుగన్.
70
మ.పరమశ్రద్ధ వహించి శాస్త్రవిధులం బాటించి కర్మైక త
త్పరతం బైతృక మాచరించు నిజసంతానంబుతోఁ దండ్రి పు
న్నిరయాపాయముఁ బాయఁ ద్రోసికొనుఁగానీ, పుత్త్రతంజెండి నె
త్తురులం బిండి యెవండు వైతరణి నీఁదుల్వోవఁ గేల్సాఁచెడిన్‌.
71
క.కానీ, నీ యాంతర్యము
నే నర్థము చేసికొంటి; నిప్పటి యీ నా
లో నిలువున నీ తండ్రియ
కానంబడునేమొ చూడఁగదె నీ వన్నా!
72
చ.అనుటయు సిగ్గునం జిదికి యారటమంది వడంకు దోయిటం
దొనఁకెడి బాష్పబిందువులతో నటు నిల్చిన రోహితుం గనుం
గొని యజిగర్తు పత్ని వలుకున్ దనభర్త యెలుంగునం బ్రతి
స్వన మన - రాచపుండుపయిపై మిరెపుంబొడి రాచినట్లుగన్‌.
73
శా.‘వత్సా! నీ వొక తల్లిబిడ్డఁడవు గావా! ముద్దుముచ్చట్లు సం
పత్సర్వస్వము నిండ బుజ్జవము నింపం బెంచి పోషించు న
వ్యాత్సల్యంబును నుజ్జగించి వెలమోవం గాన్పుఁ బోకార్చు నా
పత్సంకల్పము మాతృమానసపుఁ ద్రోవం జూపు సారించునే?’
74
చ.కుడి యెడ చెంపపెట్టులుగఁ గొట్టఁగ దంపతు లాడినట్టి యీ
నుడులకు రాచపుట్టువు కనుల్ కొనలెత్తిన నీలిమబ్బులై
జడిగురిసెన్; జగా మెఱపుచాయ హోరంగులు వోసె; జాలి వెం
బడి నిముసమ్ములోఁ బదనువాఱవె పాఱుల నిండుడెందముల్.
75
గీ.అసువు లఱచేతఁ బట్టి-రాజసము నెట్టి
తండ్రి జీవితరక్షఁ జిత్తమునఁ బెట్టి-
కుతిలపడుచున్న వాని రోహితుని నరసి
కరఁగె నజిగర్తు రెండవకాన్పు మనసు.
76
ఉ.‘పాపము! వీని కెట్టి దురవస్థ తటస్థపడెం; బితృవ్యథా
వ్యాపనముం దొలంపఁ దనప్రాణము లొడ్డుటొ, వంగడంబులో
దీపము తా నడంగినఁ బితృప్రతిరక్తకణమ్ము మాఱి నీ
రై పొరివోవుటో, కటకటా! యిటు రావల దెవ్విరోధికిన్.
77
ఉ.రాణకు రాని నా యలఁతి ప్రాణము లేల! పరోపకార పా
రీణత మించుగాఁ దొలకరించిన యప్పుడె జీవనంబు వి
న్నాణము పుల్కరించు; మరణ ప్రకృతిన్ గుఱుతించి సజ్జన
ప్రీణన ధోరణిన్ సవదరించి తరించెదఁ గాక యిత్తఱిన్‌.
78
మ.అని లోలోఁ దలపోసి జాలిగొని, దేహత్యాగరాగంబు హె
చ్చిన డెందంబున రోహితుంగని శునశ్శేపుండు తీపారు తీ
రున నీరీతి వచింపసాగెఁ దలిదండ్రుల్ సంభ్రమాశ్చర్య శో
కనికారైక నికృత్త చిత్తులు విసంగన్, సిగ్గునం గ్రుంగఁగన్.
79
చ.సుడిఁ బడియున్న నీదు మనసున్ గుఱుతించితి నన్న! తండ్రి కొ
క్కఁడవయియున్న హేతువునఁగాదొకొ, యీయురియాటయెల్ల; నే
ల్బడిగొని జాతిధర్మ మతవల్లికిఁ బ్రాఁకగునట్టి ఱేఁడు దో
రెడునెడఁ గేరడంబు పచరించుట తత్ప్రజ కెట్టి ధర్మువో!
80
ఉ.కానక కన్నకానుపు సుకానకు నోఁచక సూను జన్నపుం
గానుక వెట్టుకోవలయు కర్మము తండ్రికిఁ బట్టరాదు; భూ
జానిపరార్ధ్యుఁ డొక్కఁడు ప్రజాకృతమౌ నికృతిన్ గతాసువౌ
దానికి నోర్చు కాలగతి తట్టఁగ రా; దది చెట్ట నేలకున్.
81
చ.ఇది యిటులుండ, బోనమున కేఁకరి యాఁకట నెత్తువోవుచుం
బొదిగొనియున్న మూఁడుకడుపుల్ తడుపం దిరిపెమ్ము నెత్తియే
లిదమున జీవయాత్రఁ గదలించెడి తల్లికిఁ దండ్రికిన్ సుఖా
భ్యుదయము నీని నా బ్రతుకు పోకడ వాకొన నౌనొ నీకడన్!
82
శా.నేను న్నీవలె నిష్ప్రయోజనత నుంటిన్; మంటి నిన్నాళ్లు; నా
యీనిర్భాగ్యతఁ గన్నవారి మదు లి ట్లేడాట లాడించితిన్
గానీ, నీదయకల్మి నిర్మలిన సంకల్పంబుతో స్వార్థసం
ధానోత్సర్గము వెల్లడించు తఱిగాదా! నాకు నీ నాఁటికిన్.
83
మ.జనకుం డాడిన పల్కులో నొక రహస్యం బేను గుర్తించినాఁ
డను ‘జ్యేష్ఠాత్మజు జాతమాత్రుఁగనువెంటం బుత్త్రియౌ మానవుం’
డని కాదా విబుధోక్తి! తండ్రి నిరయాపాయంబుఁ బోఁద్రోయు పె
త్తనముం బూనిన యన్నవెంట నొకసోదర్యుండ నే నియ్యెడన్‌.
84
గీ.ముద్దు ముచ్చట నిండు ప్రేముడియు మోసి
తల్లి యెడ వెన్నెల ల్వోసి - తనియఁ జేసి
యొనరు నొక తమ్ముఁగుఱ్ఱకు వెనుకఁబడిన
వాఁడ; మా యమ్మ కే నెడవడ్డవాడ.
85
మ.అగుటన్‌ నాకుఁ బరోపకార కృతి భూయస్స్వాపతేయంబు రా
శిగఁ జేఁజిక్కు మహావకాశ మిటుతోఁచెన్‌; దేశరక్షా కళా
నుగతిం బేర్వడు సార్వభౌము బ్రతికింతుంగాక! నీ డెందపున్‌
నొగులున్‌ డింతునుగాక! పేదతలిదండ్రుల్ నన్ను దీవింపఁగన్‌‍.
86
చ.అని యిటు విప్రసూతి హృదయంబు నిరంబుదమైన వానముం
పును వెలయింపఁ, జాతకపుఁబుల్గుగ రోహితుఁ డట్టెచూచి తి
య్యని తనివందె; సుప్రణయహంసలు భూసురవంశ దంపతుల్
తనయుని పల్కు వానజడి దందడికిం బుయిలోట నందరే?
87
గీ.ఉఱుము లురవడిసేయు పేదఱిమి నేదొ
మెఱపుఁ గన్గొనిరో, కాక - కరఁగియున్న
కడుపువెన్న మునింగిరో, కాక - విధికి
లొంగిరో యేమొ యప్పు డాలును మగండు.
88
క.తనయు శునశ్శేపునిఁ దీ
పును దిగమ్రింగికొని రాజపుత్రున కమ్మం
గొనె నతఁడు ధేనుశతకము
ధనమిడి; యది యింధనముగదా దుఃఖశిఖిన్‌!
89
శా.ఆజీగర్తినిఁ జక్రవర్తి తనయుండౌ రోహితుం డప్పు డ
య్యోజన్ విల్చినవెంటఁ బిల్చి సకలాయుఃపాశముం బట్టి, ని
ర్వ్యాజోదార దయాసుధాలయ తదీయాంతర్యముం గట్టి, భూ
మీజానిం దనతండ్రి మృత్యుముఖగామిం గావఁ గొంపోవఁగన్.
90
హరిశ్చంద్రునియాగమున దేవరాతుఁడు సంరక్షితుఁడగుట
వ.హరిశ్చంద్రుండు పెద్దకాలమ్మునకు బ్రతికివచ్చిన తనూజు నాలింగనము చేసికొనె; రోహితుండును సవనపశు ప్రతినిధిగాఁ దాను గొనివచ్చిన శునశ్శేపునిగూర్చి వచించె; నంత నాఱేఁడు సంతోషబంధురుండు వరుణు నావాహనం బొనరించి శునశ్శేపుండు పశువుగా జన్నంబుసేఁత కంగీకరింపుమని బహుధా వేఁడుకొనుటయు నాప్రచేతసుండు కరఁగి చిఱునవ్వునవ్వి ‘రాచవానికంటె భూసురుండు మేలుకదా సరి కాని’ మ్మనె; నంత మహనీయుండగు విశ్వామిత్రుండు హోతగా, జమదగ్ని యధ్వర్యుఁడుగా, వసిష్ఠుండు బ్రహ్మగా, నాయాస్యుం డుద్గాతగా హరిశ్చంద్రుని రాజసూయం బుపక్రాంతంబగుటకు నిశ్చయింపఁబడియె.91
మ.అతిభక్తిప్రతిపత్తి నానృపతి శ్రేయమ్మెంచి వర్ణాశ్రమ
శ్రుతిధర్మంబుల కాఁపుసేఁతయెడ నేర్పున్, గూప వాపీ ప్రపా
యత దేవాయతనాది రూపకృతి భూయస్సంస్థలం దీర్పు, నా
ఢ్యతఁ బాటించుచుఁ జేసె ముమ్మొదట నిష్టాపూర్తహోమక్రియన్.
92
గీ.క్షత్త్రియుండగు నా హరిశ్చంద్ర నృపతి
“దీక్షణీయేష్టి” బ్రాహ్మ్యముం దెచ్చుకొనియు-
“నుదవసానీయము”న క్షాత్త్రపదవి నెనసి
పశువుఁజేసె శునశ్శేపుఁ బట్టి నొంప.
93
వ.ఉపాకృత సంస్కరణమ్ము వెనుకఁ గుశపాశమ్ములఁ బాలగుంజకు బంధితుండై యున్న శునశ్శేపుఁడు పర్యగ్నికరణానంతరము తన విశసనమ్ము భావించి యంతలోఁ దొల్లింటి ధైర్యౌదార్యంబులెల్ల సడలి యాజానజంబైన ప్రాణంపుఁదీపి ముంచుకొన-94
గీ.‘తల్లిదండ్రుల ముద్దుఁ గౌఁగిళ్లు గడచి
కలసియాడిన యన్నదమ్ములను విడిచి
వాఁడిగల మిత్తికోఱలఁ బడితి నేఁడు
మొఱ్ఱవిని ముక్తినిడు కృపామూర్తి వీవ.
95
ఆ.వె.ఆయురమృత భిక్ష నాసించి శ్రుతిమంత్ర
యుక్తి నిన్ను వేఁడుచుంటి దేవ!
యాయురాశతోడ యజమానుఁడును వేఁడు
రెండు కోర్కె లవధరింపఁ గదవె!’
96
ఆ.వె.అనుచు వరుణు వేఁడె; నగ్నిదేవుని వేఁడె;
నింద్రు వేఁడె; వేల్పు లెల్లవారి
వేఁడెఁ; గట్టకడకు వెక్కి యుషస్స్తుతి
సేయువెంట సుకృత సీమ పండి.
97
మ.తన బంధమ్ములు దేవతాదయ లవిత్రం బౌచుఁ ద్రుంచన్ జిగి
ర్చిన ప్రాణమ్మున నొక్కగంతునిడి యాజీగర్తి గాధేయు పొ
త్తున మోక్షార్థియుఁబోలె నత్తుకొనెఁ; దోడ్తో నాఋషిబ్రహ్మ మా
తని నాత్మోద్భవు నట్టు లొత్తుకొనెఁ జేతస్సంభృ తానందుఁడై.
98
గీ.అల శునశ్శేపు పరిదేవనారభటికిఁ
గరఁగి కరడెత్తి వరుణుండు కానిపించె;
సవన పరిపూర్ణ ఫలదాన సంప్రయుక్తి
నా హరిశ్చంద్రు నుపతాప మపనయించె.
99
గీ.ఇత్తెఱంగున వేల్పుల యెదలఁ దొనఁకు
నమృతకణికలు కరఁగించి యదితిసుతుల
చెలిమి రాపాడు నా శునశ్శేపునకును
బుడమిఁ బెంపారె ‘దేవరాతుఁ’ డనుపేరు.
100
ఉ.ఆయువు వోసి, పుత్ర శతకాధికమౌ నొక కూర్మి మోసి, గా
ధేయుఁడు దేవరాతు మదిఁ దీర్చి తనర్చి - సరస్వతీ సరి
త్తోయ కణోల్బణార్ద్రమగు దోయిలి నెత్తి తొనంకు తాపస
శ్రీయుతమైన స్వాశ్రమముఁ జేర్చెఁ దనూజులు తూఁగి మూఁగఁగన్.
101
ఉ.అంతలు నింతలై పితృపదాబ్జమురేకులు సోఁకనంటి కే
రింతలు వోవుచుం బరిచరించెడి బిడ్డల నూర్వరన్ దయా
వంతుఁడు బుజ్జగించి తనపజ్జ నెలర్చిన దేవరాతులో
వంతులు సూచి కౌశికుఁడు వల్కెఁ దనూభవు లుల్కి నిల్వఁగన్.
102
ఉ.“తీపుల నించి, వేల్పుల మదిం గరఁగించి మహాధ్వరంబునన్
యూపము కట్టుఁ బాసి పునరుద్గతి నాయొడిఁ బడ్డ యీ శున
శ్శేపుఁడు- దేవరాతుఁడు- ప్రసిద్ధుఁడు- వీనిని గన్న కాన్పుగా
నే, పరికించుచుం బరిచయించితి సంచిత బంధవాసనన్.
103
మ.అగుటన్ - మీ కితఁ డన్న; మీ రితని నెయ్యంబెంచి సౌభ్రాత్ర మే
పుగ వర్తింపుఁడు నేఁటినుండి; తలవంపుల్ రాని, సంసారపున్
నొగులున్ సోఁకని యైకమత్యపుఁబసందుల్ మీయెడన్ దిద్దు పె
ద్దగఁ బూజింపుఁడు వీని స్వీయ సకలార్థత్యాగ దీక్షాఖనిన్.”
104
గీ.అని వచించుచు దేవరాతుని చరిత్ర
సాంతముగ విన్చి కడుఁ బ్రశంసలను గురిసెఁ
గౌశికుఁడు; తండ్రి యిడిన యాదేశమునకు
వార లెల్లరు నివ్వెఱపాటు గొనిరి.
105
మ.కొమరుల్ నూర్వురు వెంటవెంట నిరువాఁగుల్వోయి; రుద్భ్రాంత చి
త్తములం గొందఱు ‘దేవరాతునెడ సౌదర్యమ్ము సౌహార్ద ముం
తు’ మటం చాడిరి తండ్రి యానతికిఁ జేతుల్మోడ్చి; యామాట కాం
ధ్ర మధుచ్ఛందులు మున్నుగాఁగలకుమారశ్రేణి వెన్కాడఁగన్.
106
ఉ.బన్నము లెన్ని పైఁబడుచు వచ్చిన నొచ్చిన నాత్మగౌరవ
స్కన్నత సైఁపలేని గుణశాలి- యుదాత్తము క్షత్త్రధర్మ మా
పన్నత నొంద నోరువని పౌరుషవంతుఁడు శాంతుఁ ‘డాంధ్రుఁ’ డం
త న్నెఱవాదియై పలికెఁ దండ్రికనుంగవ జేవుఱింపగన్.
107
మ.శరణీయుండవు తండ్రి! విప్రుని మనశ్శల్యంబుఁ ద్రోపాడ నె
వ్వరు కాదందురు! కాని యౌరసతఁ జూపన్ క్షాత్త్రసంపన్నతా
గురుతల్ నిల్చునె! పూవుఁబానుపుపయిం గూర్చుండఁగాఁజేసి యె
ల్లర మర్చింతుముగాక! లోనితలఁ పేలాదాఁచి మాటాడుటల్!
108
మ.తన యౌదార్యము పొంగులై చవులుచిందన్ స్వార్థమున్‍వీడి జీ
వనదానంబున సార్వభౌము బ్రతికింపన్ మున్ను బాసాడి, యా
డిన మాటన్ దిగనాడి- కట్టకడ నోడెం బ్రాణపుందీపి ము
న్కొనఁగా; నట్టి భయస్థు పెత్తనము నాంధ్రుం డెట్టు లగ్గించెడిన్.
109
ఆ.వె.క్షత్త్రజాతి ధర్మ సంత్రాణమునుగోరి
యగ్గి నుఱుకుమన్న నళుకుసెందఁ;
బరమ తపముఁ గొన్న బ్రహ్మర్షులుగ మిమ్ముఁ
గొలుచుకొందు- నెడఁద నిలుపుకొందు.
110
గీ.జనకు నాదేశమునకుఁ గా దనెడునంత
గుండె గలవాఁడఁగాను; లోఁకువ నడంగి
క్షత్త్రధర్మమ్మునకు విషక్షతులు తెచ్చి
యుండఁగలవాఁడఁ గాను; బోనుంటి నిపుడ.
111
మ.అని మాఱాడి, స్వతంత్రతారతి స్వధర్మాపేత దాస్యమ్ము పా
ల్గొనఁ గాలాడక తండ్రివీడి యనురక్తుల్ సోదరుల్ కొంద ఱ
ల్లన వెన్నాడఁగ “నాంధ్ర” నేత యిటునేలన్ ముట్టి తొల్లింటఁ బా
లనముం జేయుట నాంధ్రదేశ మని పిల్వంజెల్లె నీతీరునన్.
112
ఆంధ్రోదయము; భాగవతకథనము
ఉ.ఆయతమై యనాదియు ననంతమునై తగు కాలగర్భమం
దేయెడ నెప్పు డేది యుదయించెనొ తేల్చుటకాదు; నిత్యతా
శ్రీయుత మాంధ్రజాతి తొలిరేకలు వెన్కకుఁ బోయిచూడఁ ద్రే
తాయుగవీథిఁ దోఁచును గృతస్థితి విశ్వమనోహరాకృతిన్.
113
గీ.కవితనూజాత లావణ్యఖనియు నైన
దేవయాని, పాతివ్రత్యదీప్ర నిష్ఠ
నెలవు శర్మిష్ఠ- తనకు భార్యలుగ వెలయ
నఖిలధారుణి నేలె యయాతి నృపతి.
114
గీ.అల యయాతివంశీయుఁడౌ బలికిఁ బొడమి
రంగ వంగ కళింగ పుండ్రాంధ్ర సింహు
లనెడి పుత్రులు; వారి పాలనము నెనసి
స్వర్ణములుపండెఁ బ్రాచ్యదేశమ్ము లాఱు.
115
గీ.బలిసుతుం డాంధ్రుఁ డేలుటవలన దీని
కాంధ్రరాష్ట్ర మనంగ విఖ్యాతి వెలసె
నని వచించెను భాగవతాది సుకృతు;
లేదియెటులున్న నిది యనాదీయజాతి.
116
చ.పృథుతర వీరభోగము, నభిన్న మహోదయ భావబంధ, ము
న్మథిత విరోధి యూధము, సనాతనకీర్తి రథమ్ము ‘దక్షిణా
పథము’న నున్న రాష్ట్రముల వాసి గడించిన యాంధ్రరాజ్వపుం
బ్రథ యొకనాఁటిదే? కవుల వర్ణన ధోరణి కందుపాటిదే!
117
గీ.కాలుబలఁగము లక్షయు- గజబలమ్ము
వేయి- గుఱ్ఱపుదడములు వేలురెండు-
దుర్గములు ముప్పదియు నొప్ప దొడ్డరాచ
దనము నడపించెఁ దొల్లింటి తెనుఁగునేల.
118
పర్వాంతము
మ.అపరోక్షంబగు దైవ మీ వగచు నాయం దింద్రియాతీత సౌ
ఖ్యపదార్థన్ఫురణంబు మేలుకొలుపంగా నెంచి యీతెల్గుఁగూ
రుపుగుట్టుల్ వెదవెట్టినాఁడవఁటె! నేర్తున్ నేర్వఁగాకేమి! యాం
ధ్రపురాణోదయపర్వముం గనవె! తాతా! గర్భరూపంబుగన్.
 
మ.రఘువంశమ్మును సన్నిధిం జదువఁగా రమ్మన్న లేఁబ్రాయమం
దఘదూరమ్ము పురాంధ్రవీరుల చరిత్రాధ్యాయముల్ సంభృతో
దఘనోద్బృంహిత చంచలారుచుల చందంబై హృదాకాశమం
దు ఘటించెన్ స్పృహణీయదీప్తి; వినిపింతున్ నేఁడు తద్గాథలన్.
 
ఉదయ పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu